మా హైదరాబాద్‌పై సర్జికల్‌ దాడులెందుకు?

ABN , First Publish Date - 2020-11-25T06:59:45+05:30 IST

‘‘ఎందుకు చేస్తారు మా హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌!? హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తారా!? సోయిలో ఉండే మాట్లాడుతున్నారా? ఓట్ల కోసం కోటిమంది హైదరాబాదీలను బలి తీసుకుంటారా?

మా హైదరాబాద్‌పై సర్జికల్‌ దాడులెందుకు?

సంజయ్‌.. సోయి ఉండే మాట్లాడుతున్నారా?

పేదరికం, నిరుద్యోగం, మత విద్వేషాలు, ఆర్థిక అక్రమార్కులు, 

అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసినవారిపై చేయండి మీ దాడులు

ఓట్లు కావాలంటే ప్రజల కాళ్లు పట్టుకుంటే వేస్తారు కదా?

వారికి అవకాశమిస్తే గోల్కొండ, చార్మినార్‌, జీహెచ్‌ఎంసీనీ అమ్మేస్తారు

ఉపాధ్యాయులు, అధ్యాపకులను ఆదుకోవడంపై ఆలోచన చేస్తున్నాం

అదానీ, అంబానీ కుటుంబాల కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తోంది

ప్రధాని మోదీ తాజా నినాదం.. ‘అమ్మేయ్‌ ఇండియాను’

డిసెంబరు 4 నుంచి మళ్లీ వరద సాయం: మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, రాంనగర్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎందుకు చేస్తారు మా హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌!? హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తారా!? సోయిలో ఉండే మాట్లాడుతున్నారా? ఓట్ల కోసం కోటిమంది హైదరాబాదీలను బలి తీసుకుంటారా? మీకు దమ్ముంటే.. ధైర్యం ఉంటే.. విజన్‌ అనే పదానికి విలువ తెలిస్తే.. దేశంలోని పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయండి. నిరుద్యోగ సమస్యపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయండి. వెనకబాటుతనం, మత విద్వేషాలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై చేయండి. తప్పుడు నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన వాళ్లపై చేయండి సర్జికల్‌ సై్ట్రక్స్‌’’ అంటూ మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటూ బీజేపీ నాయకులు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌గా మార్చే ప్రయత్నాన్ని వ్యతిరేకిద్దామని స్పష్టం చేశారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలపై ట్విటర్లో మంగళవారం ఆయన స్పందించారు.


తెలంగాణ భవన్‌లో బీసీ సంఘాల ప్రతినిధుల భేటీలో మంగళవారం మంత్రి ఈటలతో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం, బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో తెలంగాణ ప్రొఫెషనల్స్‌, నాన్‌ ప్రొఫెషనల్స్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం గాంధీ నగర్‌ లింక్‌ బ్రిడ్జ్‌, రాంనగర్‌ చౌరస్తాల్లో జరిగిన రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ, మనం హైదరాబాద్‌లో ఉన్నామో.. ఎక్కడ ఉన్నామో అర్థం కావడం లేద న్నారు. పచ్చని హైదరాబాద్‌-తెలంగాణలో బీజేపీ నేతలు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.


‘‘బండి సంజయ్‌ కు ఓట్లు కావాలంటే ప్రజల కాళ్లు పట్టుకుంటే వేస్తారు కదా? ఒక్క ఎన్నిక కోసం బీజేపీ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం బండి సంజయ్‌ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తారట. నాలుగు ఓట్ల కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడడాన్ని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాం’’ అని ధ్వజమెత్తారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటూ కులాలను వర్గాలుగా విడదీసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.


తాము వరద సాయం అందజేసిన 6.50 లక్షల మంది బాధితుల జాబితాను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి అందజేస్తామని, దమ్ముంటే వారందరికీ రూ.25 వేలు ఇవ్వాలని సవాల్‌ విసిరారు. వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రానికి లేఖ రాసి ఎనిమిది వారాలు అయినా నేటికీ ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి రాలేదని అన్నారు. డిసెంబరు నాలుగో తేదీ నుంచి వరద బాధితులకు మళ్లీ సాయం అందజేస్తామని, అందుకు రూ.100 కోట్లయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గల్లీలో ఉన్న ప్రాంతీయ పార్టీని ఎదుర్కోవడానికి ఢిల్లీ నుంచి దాదాలు, టూరిస్టులు వస్తున్నారని ఎద్దేవా చేశారు.

బీసీలు, ఎంబీసీల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించిన ఏకైక సీఎం కేసీఆర్‌ అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీసీ సంఘాలు టీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం సంతోషదాయకమన్నారు. ‘‘కొన్ని సమస్యలున్న మాట నిజం. వాటి పరిష్కారం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే సాధ్యం. పేదరికానికి కులం లేదు. అందరినీ కడుపులో పెట్టుకుని చూస్తోంది సీఎం కేసీఆర్‌’’ అన్నారు.  



ఇప్పుడు బేచో ఇండియా

గతంలో మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, ఫిట్‌ ఇండియా అని ప్రధాని నరేంద్ర మోదీ నినాదాలు ఇస్తుండేవారని, ఇప్పుడు బేచో ఇండియా (అమ్మేయ్‌ ఇండియాను) అనే కొత్త నినాదంతో ముందుకెళ్తున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. బీజేపీ భారతదేశాన్ని అమ్మేస్తోందని, ఈ ఎన్నికల్లో నగరవాసులు వాళ్లకు అవకాశమిస్తే చార్మినార్‌, గొల్కోండతోపాటు జీహెచ్‌ఎంసీనీ ప్రైవేట్‌పరం చేసి అమ్మకానికి పెడతారని ధ్వజమెత్తారు.


తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పురోగమనశీల విధానాలతో పోతుంటే.. అన్నింటినీ అమ్మేసి ప్రైవేట్‌పరం చేయడమే బీజేపీ పాలసీగా ఉందన్నారు. రాష్ట్రంలోని ఎంపీల నుంచి కేంద్ర మంత్రుల దాకా బీజేపీ నేతలు గోబెల్స్‌ కజిన్‌ బ్రదర్స్‌లాగా వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఒక్క అబద్ధాన్ని వంద సార్లు చెబితే నిజమవుతుందనే చందంగా ప్రచారాలు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు ఇంగిత జ్ఞానం లేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కొద్ది రోజుల కిందట ఆయన హైదరాబాద్‌ వచ్చి అర్ధ సత్యాలు, అసత్యాలు, పచ్చి అబద్ధాలను చెప్పివెళ్లారన్నారు. గోబెల్స్‌ పర్సనల్‌ డైరీ రూపొందించి.. దానికి చార్జిషీట్‌ అని పేరు పెట్టి.. నివేదిక విడుదల చేశారన్నారు. చార్జిషీట్‌కు టీఆర్‌ఎ్‌స-ఎంఐఎం సర్కార్‌ వైఫల్యాలని పేరు పెట్టడంపై మండిపడ్డారు.


‘‘ఈ రాష్ట్రంలో ఉన్నది టీఆర్‌ఎస్‌ సర్కార్‌. మాకెవరూ భాగస్వాముల్లేరు. గతంలో జమ్ము కశ్మీర్‌లో మీరూ పీడీపీ కలిసి ఊరేగొచ్చు. వేర్పాటువాదులతో పొత్తులు పెట్టుకోవచ్చు. టీఆర్‌ఎస్‌ మొదటి నుంచీ సింగిల్‌గానే అధికారంలో ఉంది’’ అన్నారు. టీఆర్‌ఎ్‌సకు ఎంఐఎంతోనే పోటీ అని, మిగతా పార్టీలతో అస్సలే కాదని అన్నారు.




విద్యా సంస్థల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు

కేజీ టు పీజీ విద్యా సంస్థల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందించిందని, అధ్యాపకులు, ఉపాధ్యాయులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు ఓటు వేసి వంద సీట్లను గెలిపించాలని కోరారు.


‘‘ఏమన్నా అంటే రాష్ట్రంలో కేసీఆర్‌, కేటీఆర్‌ కుటుంబమే బాగుపడిందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆదానీ, అంబానీ కుటుంబం కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేయడం లేదా?’’ అని విమర్శించారు. రూ.10 వేల ఆర్థిక సహాయం ఆపినోళ్లు రూ.25 వేలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మహిళలు సీరియల్స్‌ చూడవద్దని, బీజేపీ వాళ్ల ఉపన్యాసం వింటే కావాల్సినంత వినోదం దొరుకుతుందన్నారు. ఒక మతం వారిని దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.


Read more