నిధులు కేంద్రానివి.. ఆర్భాటం వారిదా?

ABN , First Publish Date - 2020-02-16T09:13:53+05:30 IST

జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ మెట్రో మార్గం ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వకపోవడంపై కేంద్ర మంత్రి

నిధులు కేంద్రానివి.. ఆర్భాటం వారిదా?

  • అంత హడావిడిగా ప్రారంభోత్సవం ఎందుకు?
  • మెట్రో ఉన్నతాధికారులపై కిషన్‌ రెడ్డి ఆగ్రహం
  • మెట్రో ప్రాజెక్టుపై సమీక్ష అధికారులపై ప్రశ్నల వర్షం
  • పాతబస్తీకి మెట్రో ప్రస్తావన
  • నిధులు ఇప్పించాలని కోరిన అధికారులు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ మెట్రో మార్గం ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వకపోవడంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మెట్రో ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవం గురించి ఒకరోజు ముందు అది కూడా ఓ మంత్రి ఫోన్‌ చేసి ఆహ్వానించారని, అదేమైనా టీఆర్‌ఎస్‌ కార్యక్రమమా.. అధికారులకు బాధ్యత లేదా? అని నిలదీశారు. మెట్రో ప్రాజెక్టుపై కిషన్‌ రెడ్డి శనివారం దిల్‌ఖుషా గెస్ట్‌హౌజ్‌లో సమీక్ష నిర్వహించారు. ‘‘నిధులేమో కేంద్రానివి.. ఆర్భాటమేమో టీఆర్‌ఎ్‌సదా..’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో నిర్మాణానికి కేంద్రం రూ. 1200 కోట్ల నిధులిచ్చిందని గుర్తు చేశారు. సమీక్షలో అధికారులు ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏయే కారిడార్లలో ఎంత దూరం నిర్మాణం జరిగింది.. ప్రారంభమైన కారిడార్లలో సేవలు ఎలా ఉన్నాయన్న అంశాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘మీరు ఇచ్చిన డీపీఆర్‌ ప్రకారం ఫలక్‌నుమా వరకు మెట్రో పనులు పూర్తిచేయాలి. కానీ ఎంజీబీఎస్‌ వరకే చేసి హడావుడిగా ప్రారంభోత్సవం చేశారు. ఫలక్‌నుమా వరకు పనులు ఎందుకు పూర్తి చేయలేదు? అంత హడావుడి ప్రారంభోత్సవం ఎందుకు చేయాల్సి వచ్చింది? కేవలం జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ స్టేషన్లలోనే సౌకర్యాలు కల్పిస్తే సరిపోతుందా? మిగతా స్టేషన్లలో లిఫ్టులు కూడా సరిగ్గా లేవు.  ఎవరు బాధ్యులు’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సమావేశానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి హాజరు కాలేదు. ఆయన తిరుపతి వెళ్లారని, అందుకే సమావేశానికి రాలేకపోయారని మెట్రో అధికారులు కిషన్‌ రెడ్డికి తెలిపారు. ఈ సమీక్షలో కిషన్‌రెడ్డి పాతబస్తీకి మెట్రో అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలైన్‌మెంట్‌ జరగలేదని, పనులు చేపట్టేందుకు వీలుగా రైట్‌ ఆఫ్‌ వే లేకపోవడం వల్లే ఫలక్‌నుమా వరకు నిర్మాణం చేపట్టలేదని మెట్రో అధికారులు మంత్రికి వివరించారు. కేంద్రం నుంచి వచ్చే వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌(వీజీఎఫ్‌) కింద మిగిలిన రూ.258 కోట్లు ఇప్పించాలని మెట్రో అధికారులు మంత్రిని కోరారు. పాతబస్తీ వరకు మెట్రో కారిడార్‌ నిర్మాణం ప్రారంభించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. సమీక్ష అనంతరం కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మెట్రో అధికారులతో కలిసి జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ మెట్రో కారిడార్‌లో ప్రయాణం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.


పాతబస్తీ రూపురేఖలు మారతాయనే..


మెట్రో వస్తే పాతబస్తీ రూపురేఖలు మారుతాయన్న భయంతోనే టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ కుమ్మక్కై మెట్రోను ఆపుతున్నారని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని మంత్రి కేటీఆర్‌ పదేపదే అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేంద్రంపై విమర్శలు చేయటమే ఆయన పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తే అన్నింటికీ కేంద్రం తన వాటాను ఇస్తుందన్నారు. ఎన్ని ఇళ్లు కట్టిస్తారో చెప్పాలని సవాల్‌ చేశారు. మెట్రో రైలు టికెట్‌ రేట్లు అధికంగా ఉన్నాయని, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని కిషన్‌ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్‌ రెండోదశను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండో దశ ఎంఎంటీఆస్‌ అందుబాటులోకి రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, ఈ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇవ్వడం లేదని అన్నారు. 

Updated Date - 2020-02-16T09:13:53+05:30 IST