తప్పుడు వివరాలెందుకిచ్చారు?
ABN , First Publish Date - 2020-12-27T08:11:30+05:30 IST
రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీకి జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) నోటీసులు పంపేందుకు సిద్ధమైంది. నకిలీ పత్రాలు సమర్పించినందుకు మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (

మల్లారెడ్డి కాలేజీకి నోటీసులు పంపనున్న జేఎన్‌టీయూ
హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీకి జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) నోటీసులు పంపేందుకు సిద్ధమైంది. నకిలీ పత్రాలు సమర్పించినందుకు మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎంఆర్‌సీఈ)ను ‘న్యాక్’ బ్లాక్‌లిస్టులో పెట్టిన విషయం తెలిసిందే. ఐదేళ్లపాటు ఎలాంటి గుర్తింపును ఇవ్వకూడదని కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. న్యాక్ లేఖలో పేర్కొన్నట్టు నకిలీ పత్రాలపై వివరణ ఇవ్వాలని కాలేజీకి సోమవారం నోటీసు పంపనుంది.
మరోవైపు పరిశోధక ప్రాజెక్టులు, నిధుల సమీకరణకు న్యాక్ గుర్తింపు తప్పనిసరి. మల్లారెడ్డి కాలేజీకి ఇప్పుడు అవి నిలిచిపోయే అవకాశాలున్నాయి. అలాగే నాణ్యతా ప్రమాణాలు, మౌలిక వసతులు, చదువుల అనంతరం ఉపాధి అవకాశాలకు ప్రస్తుతం ఇదే కొలమానంగా మారింది. ఈ నిషేధంతో జేఎన్‌టీయూ జారీచేసే అనుబంధ గుర్తింపునకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వర్సిటీ అఫీలియేషన్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయిన్పటికీ.. అనైతిక చర్యలకు పాల్పడినందున నోటీసులు పంపనున్నట్లు తెలిపారు.
వివరాలు జాగ్రత్త..
మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన జేఎన్‌టీయూ.. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోనుంది. న్యాక్ ప్రతి ఐదేళ్లకోసారి, నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ఇచ్చే ర్యాంకుల కోసం సెల్ఫ్ స్టడీ రిపోర్టు (ఎస్‌ఎ్‌సఆర్)లను సమర్పించే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని అన్ని కాలేజీలను కోరనుంది.
దీంతోపాటు జేఎన్‌టీయూ, ఉన్నత విద్యామండలి, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు వాస్తవ వివరాలు మాత్రమే తెలుపాలని, సమాచారానికి సంబంధించిన ఆధారాలను కూడా ఉంచుకోవాలని పేర్కొననుంది. ఈ మేరకు జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు శనివారం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తమ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు జేఎన్‌టీయూ లేఖలు రాయనుంది. తప్పుడు వివరాలు సమర్పించిన కాలేజీలపై ఇకనుంచి కఠినంగా వ్యవహరించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. కాగా, మల్లారెడ్డి యూనివర్సిటీని రద్దుచేయాలని ఎస్‌ఎ్‌ఫఐ డిమాండ్ చేసింది.
సాంకేతిక కారణాలతో నిషేధించారు
న్యాక్ నిషేధంపై మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్పందించింది. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఫోర్జరీలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. విద్యార్థుల ఇంటర్న్‌షి్‌పల సంఖ్య విషయంలో జరిగిన కొన్ని తప్పిదాల (డాక్యుమెంట్ ఎర్రర్) వల్ల న్యాక్ నిషేధం విధించిందని శనివారం విడుదలచేసిన ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురికావద్దని, విద్యాసంవత్సరం, భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చింది. న్యాక్ పంపిన లేఖ ఆధారంగా తాము సమర్పించిన పత్రాలను పరిశీలిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది.