ఈ సారైనా విమానం ఎగిరేనా?

ABN , First Publish Date - 2020-08-20T10:14:59+05:30 IST

నిజాం కాలం నాటి విమానాశ్రయం. భారత- చైనా యుధ్ధ కాలంలో కీలక స్థావరం

ఈ సారైనా విమానం ఎగిరేనా?

ఉడాన్‌ స్కీంలో మామునూర్‌ విమానాశ్రయం

అత్యధిక వరద స్థాయి వివరాలు అడిగిన ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ

చిగురించిన సరికొత్త ఆశలు

పరిశీలనకే పరిమితం అవుతున్న అధికారులు


వరంగల్‌ అర్బన్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజాం కాలం నాటి విమానాశ్రయం. భారత- చైనా యుధ్ధ కాలంలో కీలక స్థావరం. 1970 దశకంలో వాయుదూత్‌ సర్వీస్‌ల పేరుతో హైదరాబాద్‌కు ప్రయాణీకులను చేరవేసిన సందర్భం. అనంతర కాలంలో  విమానాశ్రయం అలంకార ప్రాయంగా మిగిలింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో విమానాశ్రయ పునరుద్ధరణ అంశం ముందుకు వచ్చింది. అ పరిసర గ్రామాల రైతుల భూముల్లో హద్దులు పాతారు. దీంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. వారి భూములను వారే అమ్ముకోలేని దుస్థితి ఏర్పడింది.  ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం చిన్న విమానాశ్రాలయాల ఏర్పాటుకు ‘ఉడాన్‌’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ మొదలు పెట్టింది. రెండు రోజుల క్రితం రోడ్డు భవనాల శాఖ ఈఎన్‌సీ కార్యాలయం నుంచి రోడ్డు భవనాల శాఖ ఎస్‌ఈ కార్యాలయానికి లేఖ వచ్చింది. అందులో మామునూర్‌ ఎయిర్‌ పోర్ట్‌ ప్రాంతంలో అత్యధిక వరద తీవ్రత గణాంకాలు కావాలని అడిగారు. దీంతో మరోసారి మూమునూర్‌ విమానాశ్రయం పునరుద్ధరణ ప్రచారం జోరందుకుంది. 


పురాతన విమానాశ్రయాల్లో ఒకటి..

నిజాం ఏలుబడిలోనే మామునూర్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేశారు.  1875 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయం నిజాం ఏలుబడిలో ఒక వెలుగు వెలిగింది. 401 ఎకరాలు ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్‌, నవోదయ పాఠశాల, పోలీస్‌ శిక్షణ కళాశాల, మామునూర్‌ పోలీస్‌స్టేషన్‌కు కేటాయించారు. పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ కోసం 550 ఎకరాలు ఇందులో నుంచే ప్రభుత్వం కేటాయించింది. దాదాపు 750 ఎకరాలు ఇపుడు విమానాశ్రయం ఆధినంలో ఉందని, మిగిలిన 201 ఎకరాలు అనేక రూపాల్లో అన్యాక్రాంతం అయిందని ఎయిర్‌ పోర్ట్‌ అధికారులు చెబుతున్నారు.  


అదిగో..ఇదిగో.. 

మామునూర్‌ విమానాశ్రయం నుంచి నిజాం కాలం తర్వాత కూడా హదరాబాద్‌కు రాకపోకలు సాగాయి. 1970-77 వరకు వాయుదూత్‌ పేరుతో పరిమిత సర్వీస్‌లు నడిచాయి. అనంతరం ప్రయాణికుల కొరత పేరుతో సర్వీస్‌లను నిలిపేశారు. 1977 తర్వాత నుంచి శిక్షణ విమానాలు, ఎన్‌సీసీ విద్యార్థులు ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించుకుంటున్నారు. చాలా కాలం పాటు కార్లు, మోటారు సైకిల్లు నేర్చుకోవడానికి వేదికగా మారింది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విమానాశ్రయ పునరుద్ధరణ మరోసారి ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది.


2007 మార్చి 30న ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఇండియా చైర్మన్‌ కె. రామలింగయ్యతో పాటు మరో డైరెక్టర్‌, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కేవీరావుల మధ్య మెమోరాండమ్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ (ఎంవోయూ) కుదిరింది. దీంతో మామునూర్‌ విమానాశ్రయం పునరుద్ధరణ వెంటనే జరిగి పోతుందని అందరూ ఆశపడ్డారు. అధికారులు హడావుడి చేశారు. రైతుల భూముల్లో హద్దులు పాతారు. అప్పటి నుంచి అతీగతీ లేకుండా పోయింది.  మామునూర్‌ విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న  నక్కల పల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి, రామ్‌గోపాల్‌పూర్‌, కనిపర్తి పరిసర గ్రామాల ప్రజలకు సంబంధించిన దాదాపు 400 ఎకరాల్లో ఎయిర్‌ పోర్ట్‌ అధారిటీ అధికారులు హద్దులు నాటారు. దీంతో రైతుల ఇబ్బందులు మొదలయ్యాయి.


రైతులను పట్టించుకునేదెవరు?

ఉన్నదానికే మోక్షం లేదు. మరింత విస్తరణ అంటూ  అధికారులు హడావుడి చేశారు.  రైతుల భూముల్లో హద్దులు పాతారు. భూ సేకరణ జరిపి రైతులకు డబ్బులు చెలించడం లేదు. అమ్ముకోవడానికి అవకాశం కూడా లేకుండా చేశారు.   భూములుండి కూడా ఏమి లేని వారిగా మిగిలామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మరో వైపు విమానాశ్రయ విస్తరణ పేరుతో రెండేళ్ళకోసారి హడావుడి చేస్తున్నారు.   వారసత్వంగా వచ్చిన భూములు అయినప్పటికీ కూడా అమ్ముకోలేని విచిత్ర పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. 


అమ్ముకోలేరు- కొనలేరు..

వరంగల్‌ నగరానికి 5 కిలో మీటర్ల దూరంలో ఉండే గ్రామాల్లో ఎకరానికి దాదాపు రూ.కోటి రూపాయల వరకు ధర పలుకుతోంది. అయితే ఇక్కడ రైతుల అవసరాల కోసం సగం ధరకు అమ్ముతానన్నా కొనే నాధుడే కరువయ్యాడు. ధర సంగతి తర్వాత కాని అసలు కొనడానికే ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం, అప్పుల కోసం తిరిగినా దొరకడం లేదంటున్నారు. భూములుండి కూడా పేదోళ్లమైపోయామని బాధపడుతున్నారు. దీంతో ప్రభుత్వమైనా పరిహారం చెల్లించాలి.. లేదా మా భూముల్లో పాతిన హద్దులైనా తీసివేయాలని రైతులు కోరుతున్నారు.

Read more