ప్రత్యేకాధికారి పాలనేనా?
ABN , First Publish Date - 2020-12-10T10:08:40+05:30 IST
రాష్ట్ర రాజకీయాలను వేడిక్కించి, ఉత్కంఠ రేపిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ ఓటరు విలక్షణమైన తీర్పునివ్వడంతో హంగ్ దిశగా ఫలితాలు వచ్చాయి. సాధారణ పరిస్థితుల్లోనైతే మజ్లి్‌సతో కలిసి టీఆర్‌ఎస్ పాలక

గడువు దాటితే జరిగేది అదేనా?.. హంగ్ ఫలితాలతో జీహెచ్‌ఎంసీలో ట్విస్ట్
ఎన్నికల రద్దు సాధ్యమయ్యే పని కాదు..
ప్రస్తుత పాలక మండలి రద్దూ అసాధ్యమే
మజ్లి్‌సతో పొత్తుకు టీఆర్‌ఎస్ వెనకడుగు
ఖమ్మం, వరంగల్ మునిసి‘పోల్స్’ వల్లేనా?
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయాలను వేడిక్కించి, ఉత్కంఠ రేపిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ ఓటరు విలక్షణమైన తీర్పునివ్వడంతో హంగ్ దిశగా ఫలితాలు వచ్చాయి. సాధారణ పరిస్థితుల్లోనైతే మజ్లి్‌సతో కలిసి టీఆర్‌ఎస్ పాలక మండలిని ఏర్పాటు చేసేదే. కానీ.. ప్రస్తుత రాజకీయ సమీకరణాలతోపాటు త్వరలో జరగనున్న ఖమ్మం, గ్రేటర్ వరంగల్ మునిసిపోల్స్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని మజ్లి్‌సతో పొత్తుకు ఆ పార్టీ వెనుకంజ వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నిక ప్రక్రియను టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా మరింతకాలం జాప్యం చేయనుందా? తద్వారా ప్రత్యేకాధికారి పాలన తీసుకురానుందా? లేదా సంఖ్యాపరంగా అతిపెద్ద పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్ నిర్ణీత గడువులోగా పాలక మండలిని ఎన్నుకుంటుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రస్తుత పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి పూర్తవుతుండగా.. ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక జరగకపోతే... ప్రత్యేకాధికారి పాలన అనివార్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్-56, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాల్లో గెలిచాయి. చేతులెత్తే పద్ధతిలో మజ్లిస్ మద్దతు లేకుండా అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. సంపూర్ణ మెజారిటీ (75 సీట్లు) లేకుండా పదవులు అలంకరించొద్దనే భావనలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో మజ్లిస్ మద్దతు అడిగి బద్‌నాం కావడమెందుకు? ఏం జరుగుతుందో కొన్ని రోజులు వేచి చూద్దామంటూ పార్టీ కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. దీంతో అనివార్యంగానే ప్రత్యేకాధికారి పాలన దిశగా అడుగులు పడుతున్నాయన్న భావన వ్యక్తమవుతోంది. ఇక్కడ మజ్లి్‌సతో కలిసి నడిస్తే.. రానున్న ఖమ్మం, గ్రేటర్ వరంగల్ మునిసిపోల్స్‌తోపాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీకి ఇదొక అస్త్రంగా మారే అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం.
పాలకమండలి ఏర్పాటు కాకపోయినా?
ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10, 2021 వరకు ఉంది. ఫిబ్రవరి 11 నాటికి కొత్త పాలక మండలిని ఎన్నుకోకపోతే... జీహెచ్‌ఎంసీలో ప్రత్యేకాధికారి పాలన అనివార్యం. సహజంగా గడువు ముగిసే నాటికి ఎన్నికలు జరగని పక్షంలో ప్రత్యేకాధికారుల పాలన విధిస్తారు. అయితే.. ఎన్నికలు జరిగి పాలక మండలి ఏర్పాటు కాకపోయినా... ప్రత్యేక పాలన తప్పదని నిపుణులు చెబుతున్నారు.
రద్దు చేయాలన్నా కుదరదు
చట్టసభలను కొద్దికాలం పాటు శుప్త చేతనావస్థలో (ఏ పార్టీకి బలం లేని పక్షంలో) ఉంచే విధానం స్థానిక సంస్థల చట్టాల్లో లేదని నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఏ పార్టీకీ మెజారిటీ లేదనే కారణంగా ఎన్నికలను రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి లేదు. ఇవి జరగాలంటే... ప్రస్తుత చట్టాలకు సవరణలు చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రస్తుత పాలకమండలిని ముందుగానే రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి లేదు. పాలకమండలి సభ్యులందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసినప్పుడే.. కొత్తగా ఎన్నికైన వారు ముందుగా బాధ్యతలు తీసుకునే వీలుంటుంది. లేదంటే... మొదటి సమావేశం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఎన్నికైన కార్పొరేటర్లుగానే ఉండాల్సిన పరిస్థితి.
ఇదీ ఎన్నిక ప్రక్రియ..
జీహెచ్‌ఎంసీలో కొత్త పాలక మండలిని ఎన్నుకోవాలని అధికార పార్టీ భావిస్తే.. సంక్రాంతి తదుపరి లేదా ఫిబ్రవరి 11వ తేదీనే జరిగే అవకాశం ఉంది. మొదటి సమావేశంలో తొలుత కార్పొరేటర్లందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు. తదుపరి మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. రాజకీయ పార్టీల తరపున మేయర్ పదవికి పోటీ పడే అభ్యర్థులు ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి అనుమతి పత్రం(బీ ఫాం) తీసుకొని సమర్పించాల్సి ఉంటుంది.
ఎన్నిక అవసరమైతే చేతులెత్తే పద్ధతిలో నిర్వహిస్తారు. కార్పొరేటర్లు, ఓటు హక్కున్న ఎక్స్ అఫిషియో సభ్యులందరిలో కనీసం సగం మంది హాజరైతేనే కోరం ఉన్నట్లుగా గుర్తిస్తారు. కోరం లేని కారణంగా మొదటి సమావేశం వాయిదా పడితే... మరుసటి రోజు నిర్వహిస్తారు. రెండో రోజు కూడా అదే పరిస్థితి ఎదురైతే.. సమావేశాన్ని వాయిదా వేసి.. సమాచారాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేస్తారు. త దుపరి సమావేశాన్ని ఎన్నికల సంఘం ఖరారు చేస్తుంది. అప్పుడు కోరంతో సంబంధం లేకుండా హాజరైన సభ్యులతోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది.