బర్త్‌ సర్టిఫికెట్‌ ఎక్కడ తేవాలె?

ABN , First Publish Date - 2020-03-08T09:31:06+05:30 IST

‘నేను మా ఊర్లో పుట్టిన. అప్పుడు దవాఖానాల్లేవు. నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు. మరి ఈ దేశఽంలో నీవెవరివి అంటే ఏం చెప్పాలె? ఏ విధంగా నిరూపించుకోవాలె? నాకే

బర్త్‌ సర్టిఫికెట్‌ ఎక్కడ తేవాలె?

నాకే దిక్కులేదు.. మా నాయనది యాడినుంచి తేవాలె?.. సీఏఏను కచ్చితంగా వ్యతిరేకిస్తాం

కావాలంటే జాతీయ గుర్తింపుకార్డు తెండి

పోడు భూములపై ప్రజాదర్బార్‌ పెడతాం

రాష్ట్రంలో కరోనా లేదు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ‘నేను మా ఊర్లో పుట్టిన. అప్పుడు దవాఖానాల్లేవు. నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు. మరి ఈ దేశఽంలో నీవెవరివి అంటే ఏం చెప్పాలె? ఏ విధంగా నిరూపించుకోవాలె? నాకే దిక్కులేదు.. మా నాయనవి తీసుకురావాలంటే యాడికెళ్లి తేవాలె?’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై జరిగిన ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘నాకు 585 ఎకరాల జాగా ఉంది. పెద్ద బిల్డింగ్‌ ఉంది. అట్లాంటి కుటుంబంలో పుట్టిన నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేకుంటే.. దళితులకు, ఎస్టీలకు, నిరుపేద ప్రజలకు ఎక్కడిది? ఇది పెద్ద టర్మాయిల్‌(విపత్తు). దీనికి బదులు నేషనల్‌ ఐడెంటిటీ కార్డు పెట్టండి.. ఇంకేదైనా పెట్టండి’ అని కేంద్రానికి సూచించారు.


భారత రాజ్యాంగాన్ని పౌరసత్వ సవరణ చట్టం అగౌరపరుస్తోందన్నారు. రాజ్యాంగ పీఠిక మతాలకు అతీతంగా ఉందని, కానీ.. ప్రత్యేకంగా ఒక మతానికి ముడిపెట్టడాన్ని తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పౌరసమాజం అంగీకారం తెలుపదని, ఇప్పటికే దేశం పరువు పోతోందని అన్నారు. సీఏఏ, ఎన్పీఆర్‌ విషయంలో దేశ వ్యాప్తంగా చాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి. మనకు ప్రత్యేకంగా లేదు. రాష్ట్రప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌లో కూడా చెప్పాం. శాసనసభలో కచ్చితంగా తీర్మానం చేసి పంపుతాం. దీనిపై అసెంబ్లీలో చర్చ జరగాలి. అందరూ మాట్లాడాలి. రాజాసింగ్‌ కూడా మాట్లాడాలి. వివాదం చేయవద్దు’ అని సీఎం అన్నారు. జీఎస్టీ డబ్బుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వడం లేదని, దీనిపై తమ ఎంపీలు లోక్‌సభలో ఆందోళన చేశారని, ఆ తర్వాత కేంద్రం రూ.1000 కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఇంకా బకాయిలు రావాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగంలోని ఇతర అంశాలు ఆయన మాటల్లోనే..


హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదు

పాతబస్తీలో నీటి సమస్య తీర్చడానికి రింగ్‌ మెయిన్‌ వేస్తున్నాం. కృష్ణా-గోదావరి నీళ్లు కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. పాతబస్తీకి మెట్రోను తీసుకెళ్లడానికి యుద్ధప్రాతిపదికన పనులు చేస్తాం. ఉస్మానియా ఆస్పత్రి, సచివాలయం, అసెంబ్లీ కట్టొద్దు... కళాభారతి కట్టొద్దు అని కేసులు వేశారు. ఈ కుట్రలన్నీ ఛేదించి.. ముందుకెళుతున్నాం. ఉస్మానియా ఆస్పత్రితోపాటు మరో ఆస్పత్రిని కూడా పాతబస్తీలో కడతాం. 350 బస్తీ దవాఖానాలు తెరుస్తాం. గుడుంబా నిర్మూలనకు రూ.125.99 కోట్లతో 6299 మందికి రూ.2 లక్షల చొప్పున సాయం చేస్తాం. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నాం.


అక్షరాస్యతలో అట్టడుగు నుంచి మూడో స్థానంలో ఉన్నాం. వారి దుష్ట పరిపాలనతో వారసత్వంగా వచ్చిన దరిద్రం ఇది. నిరక్షరాస్యతను కచ్చితంగా తీసేస్తాం. ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్‌ బుక్‌ మూడు పేజీలు ఉండాల్సింది 300 పేజీలున్నాయి. సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల అంశాలు కొన్ని సుప్రీంకోర్టులో ఉన్నాయి. అన్ని విషయాలపై ప్రస్తుత పీఆర్సీ చర్చించి, సూచనలు ఇవ్వాలన్నదే మా ఆకాంక్ష. అందుకే గడువు పెంచాం. సందేహాలు వద్దు. ఆర్థిక మాంద్యం ఉన్నందున కాస్త తక్కువైనా.. ఇస్తాం. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిఖార్సుగా కడతాం.


సమగ్ర సర్వేలో 22 లక్షల ఇళ్లు అవసరమని నివేదిక వచ్చిందనేది పూర్తిగా అసత్యం. 7 లక్షల ఇళ్లు కడితే చాలని సర్వే చెప్పింది. దళిత కుటుంబాలకు మూడెకరాలు ఇస్తేనే సామాజికార్థిక స్థాయి పెరుగుతుంది. అది నిరంతర ప్రక్రియ. ధూల్‌పేటకు నేను తప్పకుండా వస్తా. మంత్రులు, అధికారులతో కలిసి వస్తా. పోడు భూములకు రైతుబంధు రాదు. ఆర్‌వోఎ్‌ఫఆర్‌ పట్టా ఉంటే వస్తుంది. నేను సీఎ్‌సను, మంత్రులను తీసుకొని.. ఎక్కడికక్కడ ప్రజాదర్బార్‌ పెడతా. జనం సమక్షంలోనే నిర్ణయం తీసుకుంటాం.  


కరోనా రాలేదు.. ఎవడో సన్నాసి, దరిద్రుడు వచ్చి కాలబెట్టిండు

కరోనా వస్తే మాస్కులిచ్చే పరిస్థితి లేదా అంటున్నారు. ఇక్కడ ఒక్కరికైనా మాస్క్‌ ఉందా? మనం చచ్చిపోతామా? మరి ఏ ఒక్క సభ్యుడూ పెట్టుకోలేదు? ఆరోగ్యమంత్రికి కూడా మాస్క్‌లేదు. కరోనా మన రాష్ట్రంలో రాలేదు. ఇక్కడ పుట్టిన జబ్బు కాదు. ఎక్కడో చైనాలో పుట్టి కాలబెట్టింది. అందులో ఎవడో ఒక సన్నాసి, దరిద్రుడు మన దగ్గరికి వచ్చి కాల బెట్టిండు. వాడు బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు రాగానే మన ఈటల రాజేందర్‌ దొరకబట్టిండు. గాంధీలో స్పెషల్‌వార్డు పెట్టి అందులో పడేసిండు. ట్రీట్‌మెంట్‌ ఇస్తున్రు. అతడు కూడా మంచిగానే ఉండు. సచ్చిపోయే పరిస్థితి లేదు.


ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరికి కూడా కరోనా వ్యాధి రాలేదు. అవసరమైతే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా దాన్ని రానీయం. వస్తే సర్వశక్తులు ఒడ్డి ఎదుర్కొంటాం. అవసరమైతే శాసనసభను బంద్‌ పెట్టి.. ఎమ్మెల్యేలందరం  నియోజకవర్గాల్లో నిలబడి... మాస్కులు లేకుండానే పనిచేస్తాం. నాకో సైంటిస్టు ఫోన్‌ చేసి.. కరోనాకు హైరానా పడక్కర్లేదన్నరు. జస్ట్‌  పారాసెటమాల్‌ వేసుకుంటే పోతదని, 22 డిగ్రీల వాతావరణం ఉంటే రాదని అన్నరు. మన దగ్గర 30 డిగ్రీలుంది. మిషన్‌ భగీరథ చెడ్డదంటే ఏం మాట్లాడేది? మార్చి వస్తే చావుకొచ్చేది. బిందెల ప్రదర్శన. బిందెలు ఎటుపోయినయ్‌?  


కరెంట్‌ చార్జీలు పెంచుతాం..

కరెంట్‌ చార్జీలు పెంచుతాం. డెఫ్‌నెట్‌గా పెంచుతాం.. నెలకిందటే చెప్పిన. ప్రజలకు చెప్పి.. అసెంబ్లీలో చర్చించి పెంచుతాం. వన్‌ పర్సెంటో... టూ పర్సెంటో పెంచుతాం. ప్రజల మీద భారం వేసే విధంగా పెంచబోం. కానీ సంస్థ బతకాలె. సేవ చేయాలె. 24 గంటల కరెంట్‌ వద్దని రాజగోపాల్‌రెడ్డి అన్నరు. ఆయన ఇంటికి బంద్‌ చేపిద్దాం. ధర్నాలు పాతకాలం ముచ్చట. ఇప్పుడు అది లేదు. ప్రజలకు వాస్తవాలు చెబితే సహకరిస్తున్నరు. 24 గంటల కరెంట్‌ ఇచ్చి తీరుతాం. అన్ని రంగాలకు ఇస్తాం. 2014లో 7778 మెగావాట్ల విద్యుత్తు స్థాపిత సామర్థ్యం ఉంటే... 16,246 మెగావాట్లకు చేరింది. యాదాద్రి పవర్‌ స్టేషన్‌ కడుతుంటే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వద్దంటున్నాడు.


దేశంలోనే తలసరి విద్యుత్తు వినియోగంలో నెంబర్‌వన్‌లో ఉన్నాం. తెలంగాణ ఏర్పడినప్పుడు 1356 యూనిట్లు ఉంటే...ఇప్పుడు 1896 యూనిట్లుగా ఉంది. జాతీయ సగటు 11 వందల యూనిట్లే. అద్భుతమైన ప్రగతిని సాధించాం. ఆ రోజుల్లో కరెంట్‌ లేదు. టపాకాయలు పేలినట్లు ట్రాన్స్‌ఫార్మర్లు పేలేవి. ఇప్పుడు ఏ ట్రాన్స్‌ఫార్మరూ పేలడం లేదు. 


రైతును రాజుగా  చేసేదాకా నిద్రపోం

రైతును రాజుగా చేసేదాకా నిద్రపోయే ప్రసక్తే లేదు. చెరువులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 38,19,419 ఎకరాల్లో వరి సాగు అవుతోంది. రెండు సీజన్‌లు కలుపుకొని 78 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. 225 లక్షల టన్నుల వరి దిగుబడి రానుంది. తెలంగాణలో ప్రజలకు కోటి టన్నుల వరి ధాన్యం అవసరం ఉంటుంది. మిగిలిన 125 లక్షల టన్నులను సేకరించడానికి ఎఫ్‌సీఐ అంగీకరించింది. రైస్‌మిల్లులకు కూడా బియ్యం దిగుమతి చేయడానికి పర్మిట్లు ఇస్తాం. దుర్మార్గంగా ఉన్న రెవెన్యూ చట్టాన్ని మారుస్తున్నాం. రాష్ట్రంలో సామాజిక సమతూకం పాటిస్తున్నాం. జడ్పీటీసీల్లో 65 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలున్నారు. ఎంపీటీసీల్లో 69 శాతం, జిల్లా పరిషత్‌ చైర్మన్‌లలో కూడా 53 శాతం ఉన్నారు. ముస్లిం రిజర్వేషన్‌లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. కేసు విచారణను వాదించడానికి వీలుగా మంచి లాయర్‌ను పెట్టాం. 


 ఇంటికొక ఉద్యోగం ఇస్తామనలేదు

మూర్ఖ ధోరణిలో ఉన్నారు...మేం అననివి అన్నట్లు చెబుతున్నారు. ఇంటికొక ఉద్యోగం అని నేను జీవితంలో అనలేదు. ప్రభుత్వంలో ఉద్యోగాల్లేవు... ఇవ్వలేం. ఈ వ్యవహారం ఎప్పటిదాకా నడుస్తుంది? అధికారంలో ఉంటే ఒక మాట... ప్రతిపక్షంలో ఉంటే మరో మాట. కాంగ్రెస్‌, టీడీపీలు 60 ఏళ్లు పాలించాయి. మీరిచ్చిన ఉద్యోగాలెన్ని? దేశంలో విచిత్రమైన సంస్కృతి ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ... ఆర్టీసీ చార్జీలు పెంచితే... ప్రతిపక్ష పార్టీవారు తెల్లారే వెళ్లి డిపోల ముందు కూర్చుంటారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక..


చార్జీలు తగ్గిస్తుందా? ఒక్కడైనా చార్జీలు తగ్గించాడా? కర్మ బాగాలేక టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా నేను కూడా కూర్చున్న. ఎంతకాలం ఆత్మవంచన, ప్రజావంచన? ఇది పోవాలె. మూసీ రక్షణకు ప్రత్యేక పథకం తెచ్చాం. మూసీ ప్రక్షాళన చేస్తాం. ఈ టర్మ్‌ ముగిసేలోగా మూసీని శుద్ధి చేస్తాం. క్లీన్‌ వాటర్‌ను అందిస్తాం. 104 చోట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు మంజూరు చేశాం. 82 చోట్ల పూర్తయ్యాయి. 14 చోట్ల తుది దశలో ఉన్నాయి. 

Updated Date - 2020-03-08T09:31:06+05:30 IST