బహదూర్‌ మృతదేహం ఎక్కడ?

ABN , First Publish Date - 2020-04-15T09:04:10+05:30 IST

కరోనా లక్షణాలతో నాలుగు రోజుల క్రితం మరణించిన నేపాల్‌ వాసి షేర్‌ బహదూర్‌(72) విషయంలో ఒక్కో ప్రభుత్వ విభాగం ఒక్కో రకంగా సమాధానమిస్తోంది.

బహదూర్‌ మృతదేహం ఎక్కడ?

  • గాంధీకి తరలించామంటున్న పోలీసులు
  • రాలేదంటున్న ఆస్పత్రి వైద్యాధికారులు 
  • తమకేమీ తెలియదంటున్న జీహెచ్‌ఎంసీ
  • ఆందోళనలో లాలాపేట వాసులు

హైదరాబాద్‌ సిటీ/అడ్డగుట్ట, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): కరోనా లక్షణాలతో నాలుగు రోజుల క్రితం మరణించిన నేపాల్‌ వాసి షేర్‌ బహదూర్‌(72) విషయంలో ఒక్కో ప్రభుత్వ విభాగం ఒక్కో రకంగా సమాధానమిస్తోంది. కరోనా అనుమానితుడిగా ఉన్నప్పటికీ ఓ ఆస్పత్రిలో సిబ్బంది పట్టించుకోకపోవడంతో అతను నడుచుకుంటూ వెళ్లి రోడ్డుమీదే పడి చనిపోయిన సంగతి తెలిసిందే. 12 గంటలపాటు రోడ్డుపైనే ఉన్న మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు చెబుతుండగా.. ఆస్పత్రి సిబ్బంది మాత్రం అక్కడికి రాలేదని అంటున్నారు. అంత్యక్రియలు కూడా జరిగిపోయాయని ఏసీపీ చెబుతుండగా.. తమకేమీ తెలియదని జీహెచ్‌ఎంసీ అధికారులు అంటున్నారు.  


అసలేం జరిగిందంటే..

నేపాల్‌కు చెందిన షేర్‌ బహదూర్‌.. సికింద్రాబాద్‌ లాలాపేట్‌లో నివాసముంటూ ఓ రెస్టారెంట్‌లో పని చేస్తున్నాడు. జ్వరం, దగ్గు రావడంతో గత శుక్రవారం గాంధీ ఆస్పత్రికి వెళ్లాడు. కరోనా పాజిటివ్‌ కేసులు తప్ప సాధారణ వైద్య పరీక్షలు అక్కడ జరగవని తెలుసుకుని, అదే రోజు కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లాడు. కరోనా లక్షణాలున్నాయని భావించిన వైద్యులు అతన్ని తిరిగి గాంధీకి వెళ్లాలని సూచించారు. గంటల తరబడి ఎదురుచూసినా అంబులెన్స్‌ రాకపోవడంతో బహుదూర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నారాయణగూడ శాంతి టాకీస్‌ వద్ద అపస్మారక స్థితిలో కింద పడిపోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బహదూర్‌ మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. అతని వద్ద ఉన్న చీటీల ఆధారంగా కరోనా అనుమానితుడిగా భావించి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతదేహాన్ని ఆ రోజు రాత్రి గాంధీ మార్చురీ వద్ద అంబులెన్స్‌లోనే ఉంచినట్లు సమాచారం. మరుసటి రోజు అంబులెన్స్‌ నుంచి దించిన మృతదేహం కనిపించకుండా పోయింది. మహాప్రస్థానం వాహన సిబ్బంది వచ్చి మృతదేహన్ని తీసుకెళ్లినట్లు తేలింది. కానీ, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియని పరిస్థితి. 


అన్నీ అనుమానాలే..!

మృతదేహం గురించి సంబంధిత ఏసీపీని వివరణ కోరగా.. ఆస్పత్రికి తరలించామని, అక్కడి నుంచి సంబంధిత బృందం వచ్చి డెడ్‌బాడీని డిస్పోజ్‌ చేసిందని చెప్పారు. అయితే మృతదేహం తమ ఆస్పత్రికే రాలేదని  గాంధీ ఆస్పత్రి ఉన్నతాధికారి చెప్పడం విశేషం. మృతదేహం నుంచి శాంపిల్‌ తీసుకోలేదని గాంధీ వైద్యుడొకరు చెప్పారు. జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రశ్నించగా.. తమకేమీ తెలియదంటున్నారు. 

Updated Date - 2020-04-15T09:04:10+05:30 IST