కొత్త పాస్ పుస్తకమేది!
ABN , First Publish Date - 2020-12-06T07:42:18+05:30 IST
తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం అమలు అనంతరం నవంబరు 2వ తేదీ నుంచి ధరణి వెబ్‌సైట్ ఆధారంగా రిజిస్ట్రేషన్.. వెంటనే మ్యుటేషన్ జరుగుతోంది.

రిజిస్ట్రేషన్ నెల క్రితం జరిగినా రైతులకు అందలేదు
హైదరాబాద్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం అమలు అనంతరం నవంబరు 2వ తేదీ నుంచి ధరణి వెబ్‌సైట్ ఆధారంగా రిజిస్ట్రేషన్.. వెంటనే మ్యుటేషన్ జరుగుతోంది. రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు మాత్రం అందడం లేదు. రిజిస్ట్రేషన్ జరగ్గానే కొనుగోలు చేసిన రైతుకు పాస్‌పుస్తకం లేకపోతే డ్రాఫ్ట్ పాస్‌పుస్తకం ప్రింటవుట్‌ను తహసీల్దార్లు అందజేస్తున్నారు. దీని కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.300 వసూలు చేస్తోంది.
గతంలో రిజిస్ట్రేషన్ కాగానే మ్యుటేషన్ అనంతరం వివరాలు ప్రింటర్లకు వెళ్లేవి. తర్వాత పాస్‌పుస్తకాన్ని ముద్రించి సీసీఎల్‌ఏకు, అక్కడి నుంచి కలెక్టరేట్, ఆర్డీవోకు, చివరగా తహసీల్దార్‌కు చేరి రైతులకు అందేది. ఇప్పుడు కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ కాగానే మ్యుటేషన్.. తర్వాత రైతుల వివరాలు నేరుగా ప్రింటర్లకు చేరుతున్నాయి. వాటిని పోస్టల్ ద్వారా నేరుగా రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
రాష్ట్రంలో ఇప్పటిదాకా 44 వేల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిబంధనల రిజిస్ట్రేషన్ జరిగిన వారం రోజుల్లోనే పాస్‌పుస్తకం రైతు ఇంటికి చేరాలి. కానీ నెల రోజులవుతున్నా కొత్త పాస్‌పుస్తకం ఇంకా చేరలేదు. ఈ ఆలస్యానికి కారణమేంటో తెలియడం లేదు.