టీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారుతుంది ఏంటి?

ABN , First Publish Date - 2020-06-21T16:51:13+05:30 IST

టీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారుతుంది ఏంటి?

టీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారుతుంది ఏంటి?

అధికార టీఆర్ఎస్‌కు ఆ అనుబంధ కార్మిక సంఘమే తలనొప్పిగా మారుతోందా? ఆధిపత్యం కోసం ఇప్పటికీ నాయకులు ముష్టియుద్ధాలకు దిగుతుండటం దేనికి సంకేతం? యూనియ‌న్ బ‌లోపేతం సంగ‌తి దేవుడెరుగు.. పార్టీ ప‌రువునే బ‌జారుకి ఈడుస్తున్నదెవరు? పార్టీ అధినేత ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా కార్మిక నేతల్లో మార్పెందుకు రావడం లేదు? అస‌లే ట్రేడ్ యూనియ‌న్లపై ఆగ్రహంగా ఉన్న గులాబీ బాస్ ఈ విష‌యంలో ఏ చర్య తీసుబోతున్నారు? ఆసక్తికర కథనం మీకోసం! 


   టీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం- టీబీజీకేఎస్‌లో ఆధిపత్యపోరు అంతకంతకు పెరుగుతోంది. టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంక‌ట్రావు, ప్రధాన కార్యద‌ర్శి మిర్యాల రాజిరెడ్డి వ‌ర్గాలు ఎప్పటిలాగే కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. వ‌ర్గపోరుతో వారి అనుచరులు రోడ్డెక్కుతున్నారు. టీఆర్ఎస్ ప‌రువును కూడా రచ్చకీడుస్తున్నారు. ఒకవైపు గుర్తింపు కార్మిక సంఘంగా టీబీజీకేఎస్‌ కాలపరిమితి ముగిసిందనీ.. ఎన్నికలు నిర్వహించాలనీ జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. క‌రోనా లేకుంటే ఇప్పటికే గుర్తింపు ఎన్నిక‌ల ప్రక్రియ పూర్తయ్యేద‌న్న వాద‌న‌లూ ఉన్నాయి. తమకు నాలుగేళ్ళ పదవీకాలం ఉందనీ.. ఒకవేళ ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమనీ టీబీజీకేఎస్‌ నాయకులు చెబుతున్నారు. అయితే వీరిది మేక‌పోతు గాంభీర్యమన్న వాదనలూ ఉన్నాయి.   


    గ‌తంలో ముఖ్య నాయ‌కుల మ‌ధ్య విభేదాల‌తో టీబీజీకేఎస్‌ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. మళ్లీ అదే దిశగా యూనియన్‌ పయనిస్తుండటం గమనార్హం. పైకి ఐకమత్యం ప్రదర్శిస్తూ లోలోపల యూనియన్‌ నేత‌లు కుమ్ములాడుతున్నారు. దీంతో అధికార టీఆర్‌ఎస్‌కు త‌ల‌నొప్పి పెరుగుతోంది. వాస్తవానికి తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘం ముఖ్య నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఈనాటిది కాదు. మొద‌టినుంచి వారి వైఖరి ఇలాగే ఉంది. 2012లో గుర్తింపు సంఘంగా గెలిచిన త‌ర్వాత నేతల మధ్య గొడవలు ముదిరాయి. నాటి అధ్యక్షుడు కెంగ‌ర్ల మ‌ల్లయ్య, ప్రధాన కార్యద‌ర్శి మిర్యాల రాజిరెడ్డి మ‌ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఈ ఆధిప‌త్యపోరుతో యూనియ‌న్ రెండుగా చీలిపోయింది. ప‌ర‌స్పర కేసులు, అరెస్టులు వంటివి సంభవించాయి. ఈ నేపథ్యంలో అంత‌ర్గత ఎన్నిక‌లు నిర్వహిచాల్సి వచ్చింది. అప్పుడు జరిగిన ఎన్నిక‌ల్లో మిర్యాల రాజిరెడ్డి వ‌ర్గం విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత కూడా ప‌రిస్థితిలో మార్పు రాక‌పోవడంతో యూనియ‌న్ గౌర‌వ అధ్యక్షురాలిగా నాటి నిజామాబాద్ ఎంపీ కవిత ఎంట్రీ ఇచ్చారు. ఆమె బాధ్యతలు చేపట్టాక కొన్ని మార్పులు జరిగాయి. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ సింగ‌రేణి విభాగం అధ్యక్షునిగా ఉన్న వెంక‌ట్రావును టీబీజీకేఎస్‌లోకి ఆహ్వానించారు. 


    ఈ క్రమంలోనే 2017లో సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నిక‌ల్లో టీబీజీకేఎస్‌ గెలుపుకోసం టీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా శ్రమించింది. యూనియ‌న్ నేత‌ల‌ను న‌మ్ముకుంటే ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని కేసీఆర్ అంచ‌నాకు వ‌చ్చారు. ఒక విధంగా చెప్పాలంటే విజ‌యం కోసం సాక్షాత్తు సీఎం కేసీఆరే రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల‌ను, ముఖ్య నేతలను సింగ‌రేణివ్యాప్తంగా మోహ‌రించారు. పోస్టర్లపై యూనియ‌న్ నేత‌ల ఫోటోలు లేకుండా ప్రచారం చేశారు. ఎలాగైతేనేం- టీబీజీకేఎస్‌ను గెలుపు తీరం చేర్చారు. 


    గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలిచినా, సీఎం కేసీఆర్‌ మనసు శాంతించలేదు. యూనియన్‌ నేతల తీరుపై గుర్రుగానే ఉన్నారు. కొన్నాళ్లపాటు వారికి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. టీబీజీకేఎస్‌ నేతలు నెల‌ల త‌ర‌బ‌డి ప్రద‌క్షిణ‌లు చేసిన త‌ర్వాత జంబో కార్యవ‌ర్గాన్ని ప్రక‌టించారు. యూనియ‌న్ అధ్యక్షునిగా వెంక‌ట్రావు, ప్రధాన కార్యద‌ర్శిగా మిర్యాల రాజిరెడ్డిని నియమించారు. ఆ త‌ర్వాత వ‌ర్కింగ్ ప్రెసిండెంట్‌గా మ‌రో సీనియ‌ర్ నేత కెంగ‌ర్ల మ‌ల్లయ్య పేరును ప్రక‌టించారు. తదుపరి జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీబీజీకేఎస్‌లోని వ‌ర్గపోరు టీఆర్ఎస్‌పై ప్రభావం చూపింది. ప‌లు సింగ‌రేణి ప్రభావిత నియోజ‌క‌వ‌ర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు ఓట‌మి పాల‌య్యారు. త‌ర్వాతకాలంలో గౌర‌వ అధ్యక్షురాలి పదవి నుంచి క‌విత త‌ప్పుకున్నారు. దీంతో యూనియ‌న్‌ పరిస్థితి మరింత దిగజారింది. మొద‌టినుంచి టీబీజీకేఎస్‌లో కీల‌కంగా వ్యవహరించిన మ‌ల్లయ్యకు ప్రాధాన్యం త‌గ్గుతూ వ‌చ్చింది. త‌న‌ను యూనియన్ స‌మావేశాల‌కు పిల‌వక‌పోవ‌డంతో ఆయన మరింత అసహనానికి లోనయ్యారు. ఈ తరుణంలోనే ఆయన టీబీజీకేఎస్‌కు గుడ్‌బై చెప్పి బీఎంఎస్‌లో చేరారు. ఆయన అనుచరులూ అదే బాట పట్టారు. 


    టీబీజీకేఎస్‌లో వ‌ర్గపోరుకి స్వస్తిచెప్పాలని సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో హెచ్చరించారు. అయినా యూనియన్‌ నేతలు లెక్కచేయలేదు. ఈ తరుణంలో ట్రేడ్ యూనియ‌న్ల తీరుపై ముఖ్యమంత్రి గుర్రుగా ఉంటున్నారు. పెద్దాయన కోపంగా ఉన్నారని తెలిసినా టీబీజీకేఎస్‌ పెద్దలు ఖాతరు చేయకపోవడం ఏమిటన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. గ‌త ఎన్నిక‌ల‌ సమయంలో ఇత‌ర యూనియ‌న్ల నుంచి పెద్దసంఖ్యలో నాయ‌కుల‌ను టీబీజీకేఎస్‌లో చేర్చుకున్నారు. వారికి అప్పట్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో.. పదవులు దక్కనివారు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారని టాక్‌!  (స్పాట్) టీబీజీకేఎస్‌ ముఖ్య నేత‌ల తీరు కోల్‌బెల్ట్‌ పరిధిలోని ఎమ్మెల్యేల‌కు కూడా మింగుడుప‌డ‌టం లేదు. ప్రభుత్వంతోపాటు పార్టీ ప్రతిష్టను సైతం యూనియ‌న్ నాయకులు దిగ‌జారుస్తున్నార‌న్న అభిప్రాయంతో వారున్నారు. ఇప్పుడు గనుక గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌లు జ‌రిగితే టీబీజీకేఎస్‌ గెలుపు అంతు సులువు కాద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ అన‌వ‌స‌ర త‌ల‌నొప్పిని భ‌రించ‌డం క‌ంటే.. యూనియ‌న్‌ను వ‌దులుకుంటేనే మేలు అన్న కోణంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నారట! చూడాలి మరి ఈ  లొల్లి రాబోయే రోజుల్లో ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో! 

Updated Date - 2020-06-21T16:51:13+05:30 IST