ధరణి సమాచారం హ్యాక్‌ కాదని గ్యారెంటీ ఏమిటి?

ABN , First Publish Date - 2020-11-26T08:02:24+05:30 IST

ధరణి వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేస్తున్న సమాచారం హ్యాకింగ్‌కు గురికాదని గ్యారెంటీ ఏమిటని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ఒకేసారి రిజిస్ట్రేషన్‌,

ధరణి సమాచారం హ్యాక్‌ కాదని గ్యారెంటీ ఏమిటి?

వైట్‌హౌస్‌, బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ల సమాచారమే హ్యాకింగ్‌ గురైంది

డేటా భద్రతపై సందేహాలున్నాయి

తహసీల్దార్‌, పట్వారీ స్థాయి వారి చేతిలో

సమాచారం దుర్వినియోగమయ్యే ముప్పు

ఘాటు వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం 

డేటా సేకరణపై స్టే ఆదేశాలు పొడిగింపు

విచారణ డిసెంబరు 3వ తేదీకి వాయిదా


హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ధరణి వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేస్తున్న సమాచారం హ్యాకింగ్‌కు గురికాదని గ్యారెంటీ ఏమిటని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ఒకేసారి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేయడం మంచి పద్ధతే. అందరూ సంతోషిస్తారు. తెలంగాణ ప్రభుత్వం అదే చేస్తోంది. అయితే.. ధరణిలో నమోదు చేసుకోకపోతే ఆస్తి బదలాయింపు జరగదనడం ఆర్టికల్‌ 300ఏ కింద రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కును ఉల్లంఘించడం కాదా?’’ అని నిలదీసింది.

ధరణి వెబ్‌పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదు కోసం ఆధార్‌ సంఖ్య, కులం, కుటుంబ సభ్యుల వివరాలు కోరడాన్ని ప్రశ్నిస్తూ న్యాయవాది కాశీభట్ల సాకేత్‌, గోపాల్‌ శర్మలు వేర్వురుగా ప్రజాహిత వాజ్యాలు దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి కె.ఆనంద్‌కుమార్‌ మరికొందరు దాఖలు చేసిన బ్యాచ్‌ పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది.


 వైట్‌హౌస్‌, బకింగ్‌హమ్‌ ప్యాలె్‌సల డేటానే హ్యాక్‌ అయ్యిందని గుర్తుచేసింది. డేటా దుర్వినియోగం అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. ‘‘ధరణి వెబ్‌ పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల వివరాలు నమోదు చేసుకోకపోతే.. ఇకపై క్రయ, విక్రయాలకు అవకాశం ఉండదని పత్రికా ముఖంగా ప్రకటనలు చేశారు. దీనిపై ప్రజల్లో సందేహాలు కలుగుతున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సింది ప్రభుత్వమే’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.


ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడింది. సేకరించిన డేటాను పరిశీలించే అధికారాలు తహసీల్దారు, పట్వారీలకు ఇస్తే... అది దుర్వినియోగం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆధార్‌ సమాచారం ఇప్పటికే మూడుమార్లు బహిర్గతమైందని గుర్తుచేసింది. ‘‘సేకరించిన డేటా లీక్‌ అయితే గోప్యత హక్కుకు భంగం కలగదా? ప్రజలకు రక్షణ ఏమిటి?’’ అనే అంశాలపై చట్టంలో ఎక్కడా వివరాలు లేవంది.


ధరణి వెబ్‌సైట్‌ కోసం సమాచార సేకరణ నిలుపుదల చేయాలని, వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదుకు ఆధార్‌, కులం, కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వాలని ఒత్తిడి చేయరాదన్న మధ్యంతర ఆదేశాలను డిసెంబరు 3 వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను డిసెంబరు మూడుకు వాయిదా వేసింది. 
దానికే సుప్రీం అనుమతించలేదు

ఉగ్రవాదులు సులభంగా సిమ్‌ కార్డులు పొందకుండా ఉండేందుకు.. సిమ్‌ కార్డు కోసం ఆధార్‌ వివరాలు ఇవ్వాలన్న కేంద్ర ఉత్తర్వులపై పుట్టుస్వామి దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వివేక్‌రెడ్డి విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఈ అంశం జాతీయ భద్రతతో ముడిపడి ఉన్నప్పటికీ చట్టంలో లేదని, సిమ్‌కార్డుతో ఆధార్‌ లింక్‌ చేస్తే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. ధరణి కోసం సేకరించిన ఆధార్‌, ఇతర వివరాలు సర్వర్‌లో ఎవరు భద్రపరుస్తారు? ఎలా భద్రపరుస్తారు? ఆ సమాచారం ఎంతవరకూ సురక్షితంగా? ఏ స్థాయి అధికారి దాన్ని చూడగలుగుతారు? అనే ప్రశ్నలకు చట్టంలో ఎక్కడా వివరణ లేదన్నారు.


ప్రజల ఆస్తుల వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందని ప్రశ్నించారు. మరో పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది డి. ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ... వ్యవసాయ, తోట భూములకు (అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌) మాత్రమే రెవెన్యూ చట్టాల ప్రకారం రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌ఓఆర్‌) అమలు చేస్తారని గుర్తుచేశారు. సెప్టెంబర్‌ 8 నుంచి నిలిపి వేసిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు త్వరలోనే ప్రారంభిస్తామని చెబుతున్న ప్రభుత్వం ధరణిపై కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందునే రిజిస్ట్రేషన్లు ఆపుతోందన్నారు. ధరణితో సంబంధం లేకపోతే రిజిస్ట్రేషన్లు ఎందుకు నిలిపివేయాలని నిలదీశారు. సవరించిన చట్టం-2020లోనూ ఆర్‌ఓఆర్‌ను సమగ్రంగా నిర్వచించలేదన్నారు. దీని ప్రకారం ఆర్‌ఓఆర్‌ వ్యవసాయ భూములకే వర్తిస్తుందన్నారు. దీన్ని వ్యవసాయేతర భూములకు వర్తింపజేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 300ఏను ఉల్లంఘించడమే అవుతుందన్నారు.


తెలంగాణ స్టేట్‌ నాన్‌ అగ్రికల్చర్‌ పాస్‌ బుక్స్‌ (టీఎ్‌సఎన్‌ఏపీబీ) ఇస్తామంటున్నారని, అలా వ్యవసాయేతర భూములకు పాసుపుస్తకాలు జారీ చేసే అంశం ఏ చట్టంలోనూ లేదన్నారు. దీంతో ధర్మాసనం అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను ఉద్దేశించి.. వ్యవసాయేతర భూములకు పాస్‌పుస్తకాలు ఎలా జారీచేస్తారని ప్రశ్నించింది. ఒక వ్యక్తికి ఐదారు ఆస్తులు ఉంటే వాటన్నింటికీ ఏకీకృత పాస్‌బుక్‌ ఇస్తారా? వేర్వేరుగా ఇస్తారా? అని ఆరాతీసింది. దానికి ఏజీ.. ఆస్తుల క్రయ, విక్రయాల రిజస్ట్రేషన్లతోపాటే మ్యుటేషన్‌ కోసమే ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వివరించారు. ఒకే వ్యక్తి వేర్వేరు ఆస్తులు కలిగి ఉంటే వేర్వేరు పాస్‌పుస్తకాలు జారీచేస్తారన్నారు.


అప్పుడు సీజే కల్పించుకుని.. ‘‘ధరణిలో రిజిస్టర్‌ చేసుకోని ఆస్తుల క్రయ, విక్రయాలను రిజిస్టర్‌ చేయబోమని చెబుతున్నారు. ఆస్తులు నమోదు చేసుకోకపోతే రిజిస్ట్రేషన్‌ చేయరా? ధరణిలో ఆస్తులు రిజిస్టర్‌ చేయకుండా ఒక వ్యక్తి మరణిస్తే... ఆ వ్యక్తి పేరిట ఉన్న ఆస్తులు వారసులకు చెందవా?’’ అని ప్రశ్నించారు. ఏజీ వివరణ ఇస్తూ.. ధరణిలో రిజిస్టర్‌ చేసుకోనప్పటికీ ఒక వ్యక్తి పేరిట ఉన్న ఆస్తులపై వారసులకు హక్కులు ఉంటాయని, ఇందుకోసం లీగల్‌ హైర్‌ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుందన్నారు.


Updated Date - 2020-11-26T08:02:24+05:30 IST