లాక్ డౌన్ అంటే ఏమిటీ ?
ABN , First Publish Date - 2020-03-24T08:36:05+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించినా ప్రజలు మాత్రం బయట తిరుగుతుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. పరిస్థితులు ఆందోళనకరంగా పరిణమిస్తున్న

కరోనా ముప్పు నుంచి రక్షణకు ప్రివెంటివ్ లాక్‌డౌన్
కఠిన అమలుకు అధికారుల కృషి
హన్మకొండ (ఆంధ్రజ్యోతి)
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించినా ప్రజలు మాత్రం బయట తిరుగుతుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. పరిస్థితులు ఆందోళనకరంగా పరిణమిస్తున్న నేపథ్యంలో అధికారులు లాక్‌డౌన్‌ను సీరియ్‌సగా తీసుకుంటున్నారు. లాక్‌డౌన్ విధిస్తే నగరంలో.. నగరం నుంచి ఇతర నగరాలకు రాకపోకలను నిలిపివేస్తారు. ప్రజా రవాణ స్థంబించిపోతుంది. లాక్‌డౌన్ కారణంగానే వూహాన్‌లో పరిస్థితి కొద్ది మేరకు అదుపులోకి వచ్చింది. బాహ్యప్రదేశాల నుంచి ఏ దైనా ముప్పు ముంచుకువస్తున్నప్పుడు లేదా ఇతర బాహ్య సంఘటన నుంచి రక్షించడానికి లాక్‌డౌన్‌ను ప్రయోగిస్తారు. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల కలిగుతున్న ముప్పు నుంచి ప్రజలను రక్షించడానికి దీనిని వినియోగిస్తున్నారు. లాక్‌డౌన్ రెండు రకాలు.
ఒకటి నివారణ లాక్‌డౌన్ (ప్రివెంటివ్ లాక్‌డౌన్), రెండోది ఎమర్జెన్సీ లాక్ డౌన్. కరోనా వైరస్ వ్యాప్తిని అరికేట్టేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం నివారణ లాక్‌డౌన్‌ను ప్రకటించారు. దీనిని ద ృష్టిలో పెట్టుకొని కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ క్రమంలో లాక్ డౌన్ అంటే ఏమిటీ? ఆ సమయంలో ప్రజలు ఏం చేయాలి? ఏం చేయకూడదు? తెలుసుకుందాం.
సరిహద్దుల మూసివేత:
1897 నాటి చట్టాన్ని అమల్లోకి తెస్తూ తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేసీఆర్. లాక్‌డౌన్‌లో భాగంగా మొదట అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దులకు అవతలే నిలిపివేస్తారు. కేవలం అత్యవసరమైన పాలు, నీళ్ళు,, కూరగాయలు, మందులు, వైద్య సేవలు తదితర వాటికి మాత్రమే అనుమతిస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రయాణికుల రైళ్ళను రైల్వే శాఖ ఈనెల 31వ తేదీ వరకు రద్దు చేసిన సంగతి తెలిసిందే. రైళ్ళు, మెట్రో సర్విసులు, ఇంటర్ స్టేట్ బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేస్తారు.
మార్కెట్లు, మాల్స్, సినిమా హాళ్ళు, స్కూళ్ళు, కాలేజీలు, జిమ్స్ అన్ని మూసి ఉంచుతారు. కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను కూడా అమలులోకి తెస్తారు. నలుగురికి మించి గుమిగూడిన పక్షంలో వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.
ప్రజలు చేయకూడనవి:
లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎలాంటి శుభకార్యాలు, విందులు, వినోదాలు, ఇతరత్రా కార్యకలాపాలను నిర్వహించకూడదు. ప్రయాణాలు, కుటుంబ సభ్యులతో విహార యాత్రలు నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుంపుగా ఉండకూడదు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారు ఏ మాత్రం బయటకు రాకూడదు. ప్రజా రవాణా వాహనాలైన బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు మొత్తం బంద్ పాటించాలి. రోడ్ల మీద ఎంత మాత్రం తిరగకూడదు. వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాల్స్, ధియేటర్లు, జిమ్‌లు, ఫంక్షన్ హాళ్ళు పూర్తిగా మూసి వేయాలి.
వృద్ధులు, చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపకూడదు. గుళ్ళు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రారఽ్ధనా మందిరాలను మూసివేయాలి. తప్పని సరి అయితేనే ప్రజలు బయటకు రావాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చినా ఇతరులకు కనీసం రెండు మీటర్ల దూరంలో ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత దుస్తులను వెంటనే ఉతికివేయాలి. ఎండలో ఆరబెట్టాలి. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వీలైనంత వరకు స్నానం చేయడం ఉత్తమం.
మినహాయింపులు:
అత్యవసరమైన మందులు, కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇతరత్రా వాటి కోసం మాత్రమే బయటకు వెళ్ళవచ్చు. తెలంగాణలో ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు రావాలి, అత్యవసర సేవల్లో అంటే విద్యుత్, వైద్యం, మీడియా, టెలికాంశాఖ తదితర శాఖల్లో పని చేసే ఉద్యోగులు బయటకు వెళ్ళవచ్చు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్, జమ్ము కాశ్వీర్, లడఖ్, పశ్చిమబెంగాల్, చండీగడ్, చత్తీ్‌సఘడ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పుదుచ్చేరి, ఉత్తరాఖాండ్‌లలో ప్రస్తుతం లాక్‌డౌన్ అమలవుతోంది.