పోలీసింగ్‌లో తేడా వస్తే వేటే?

ABN , First Publish Date - 2020-12-15T09:13:43+05:30 IST

పోలీసు అంటే ప్రజల్లో ఉన్న ఒకప్పటి అభిప్రాయం మార్చేందుకు ఉన్నతాధికారులు ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆలోచనకు తగ్గట్లుగా,

పోలీసింగ్‌లో తేడా వస్తే వేటే?

సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారుల నిఘా..

ఠాణాల్లో కమిషనర్లు, ఎస్పీల ఆకస్మిక తనిఖీలు

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదు

పదుల సంఖ్యలో సిబ్బందిపై చర్యలు

పనిష్మెంట్‌లలో ‘వరంగల్‌’ టాప్‌


హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పోలీసు అంటే ప్రజల్లో ఉన్న ఒకప్పటి అభిప్రాయం మార్చేందుకు ఉన్నతాధికారులు ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆలోచనకు తగ్గట్లుగా, ప్రజామోద యోగ్యంగా స్టేషన్‌ హౌస్‌ అధికారులు(ఎ్‌సహెచ్‌వో)లు పనిచేస్తున్నారా లేదా అనే దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫైళ్ల నిర్వహణ, కేసుల దర్యాప్తులో టెక్నాలజీ వాడకం, పెండింగ్‌ కేసులు.. ఇలా ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.


రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవడం గమనార్హం. విధుల నుంచి తప్పించడం, హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేయడం, అప్రాధాన్యత పోస్టుకు బదిలీ చేస్తున్నారు. ఇలా పనిష్మెంట్లు ఇవ్వడంలో వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ మొదటి స్థానంలో నిలిచింది. కమిషనరేట్‌ ఏర్పడ్డ తర్వాత ఈ స్థాయిలో సిబ్బందిపై చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. సిబ్బంది పనితీరు సరిగా లేకపోవడం ఒక కారణమైతే రాజకీయ కారణాలు మరోకారణంగా ప్రచారం జరుగుతోంది.


మంచిపనులకు విస్తృత ప్రచారం..!

నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవడమే కాదు.. మంచిగా పనిచేసే వారికి అధికారులు తగిన ప్రోత్సా హం అందిస్తూ.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా గడిచిన కొద్ది రోజులుగా పోలీసింగ్‌ విధానం పూర్తిగా మారిపోయింది.

బండిలో పెట్రోల్‌ అయిపోతే తెచ్చి ఇవ్వడం దగ్గర్నుంచి, అనాథల్ని అక్కు న చేర్చుకోవడం, అనాథ, వృద్ధాశ్రమాలకు సరుకులు అందజేయడం.. ఇలా పోలీసింగ్‌తోపాటు సామాజిక బాధ్యతను కూడా నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు పోలీసు ప్రతిష్టను పెంచే విధంగా పనిచేసే వారికి విస్తృత ప్రచారం కల్పించి ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలోకఠిన చర్యలిలా


వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద అక్టోబరు 2న ఓ గోనెసంచిలో యువతి మృతదేహం లభ్యమైంది. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని సంచిలో మూటగట్టి ఇక్కడ పడేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ధారూర్‌ సీఐ మురళి నేతృత్వంలో కేసు దర్యాప్తు కొలిక్కి రాకపోవడంతో ఎస్పీ నారాయణ ఆ సీఐని సస్పెండ్‌ చేశారు.


బొమ్మరాసిపేట ఎస్సై వెంకటశ్రీను భూ వివాదాల్లో తలదూరుస్తూ ఇరు పక్షాల వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అతణ్ని వీఆర్‌లో ఉంచారు.


పరిగి ఎస్సై వెంకటేశ్వర్లు ఇసుక దందా చేసేవారిని కేసుల పేరుతో బెదిరించి.. అమ్యామ్యాలు తీసుకుంటాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో.. సస్పెండ్‌ చేశారు.


వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌కుమార్‌ సివిల్‌ వివాదాల్లో తలదూర్చి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. స్థానిక ఎమ్మెల్యే, అతని తమ్ముడు ఏది చెబితే అది చేసేవాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గత వారం అతడిని సస్పెండ్‌ చేస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 


రెండు నెలల క్రితం రియల్టర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో  హన్మకొండ ఇన్‌స్పెక్టర్‌ దయాకర్‌.. మంగపేట సర్పంచ్‌పై ఇన్‌స్పెక్టర్‌ దాడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. రియల్టర్‌ స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో ఇన్‌స్పెక్టర్‌ అతనికి అనుకూలంగా వ్యవహరించాడని బాధితుడు సీపీతోపాటు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఆ ఇన్‌స్పెక్టర్‌ని సస్పెండ్‌ చేశారు.


కమలాపూర్‌ సీఐ రవిరాజు ఇసుక ట్రాక్టర్ల యజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణలపై సస్పెండ్‌ చేశారు. ఇలా రాష్ట్రంలోని  అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల పరిధిలో నిబంధనలకు పాటించని అధికారులు, సిబ్బంది పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 


Updated Date - 2020-12-15T09:13:43+05:30 IST