దేవాదాయ భూముల కబ్జాపై ఆగ్రహం

ABN , First Publish Date - 2020-11-25T08:05:20+05:30 IST

హన్మకొండ పద్మాక్షి దేవాలయం, వరంగల్‌లోని వేణుగోపాలస్వామి దేవాలయాల భూములకు సంబంధించిన ఫిర్యాదులపై లోకాయుక్త కోర్టులో మంగళవారం విచారణ జరిగింది.

దేవాదాయ భూముల కబ్జాపై ఆగ్రహం

 ఐజీ స్థాయి అధికారితో విచారణకు లోకాయుక్తా ఆదేశం


హన్మకొండ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): హన్మకొండ పద్మాక్షి దేవాలయం, వరంగల్‌లోని వేణుగోపాలస్వామి దేవాలయాల భూములకు సంబంధించిన ఫిర్యాదులపై లోకాయుక్త కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. దీనిపై ఐజీ స్థాయి అధికారితో విచారణ  చేపట్టి రెండు నెలల్లో నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. హన్మకొండలోని పద్మాక్షి దేవాలయానికి చెందిన 72.23 ఎకరాలు, వేణుగోపాలస్వామి దేవాలయానికి చెందిన 4ఎకరాల్లో ప్రైవేటు వ్యక్తులు షాపింగ్‌ కాంప్లెక్సులు, కాలేజీలు, పెట్రోల్‌ బంకులు, అపార్ట్‌మెంట్లు నిర్మిస్తే వాటికి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఇంటి నెంబర్లు కేటాయించడంపై వినియోగదారుల మండలి అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.


ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సీవీ రాములు అక్రమ కట్టడాలకు ఇంటి నెంబర్లు కేటాయించడం, పన్నులు వసూలు చేయడం, దేవాదాయ శాఖ అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా భూములను లీజులకు ఇవ్వడం, ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేయడంపై దేవాదాయ శాఖ, మునిసిపల్‌ శాఖ అధికారులపై ఆగ్రహం  వ్యక్తం చేశారు. అనంతరం ఐజీ స్థాయి అధికారులతో విచారణకు ఆదేశించారు. ఈ విచారణ రెండు నెలలో ముగించాలని, దేవాదాయ భూములకు బోర్డులు పాతడమే కాకుండా కంచె వేసి రక్షించాలని ఆదేశించారు.  

Read more