ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు
ABN , First Publish Date - 2020-11-25T07:56:06+05:30 IST
రైతులు పండించిన ప్రతీ గింజను కొంటామని, గిట్టుబాటు ధర కల్పిస్తామని, ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంతి కేసీఆర్ ఇచ్చిన హామీ ఆచరణలో అమలు కావడంలేదు.

తేమ, మచ్చ పేరుతో నిరాకరిస్తున్న అధికారులు
దళారులకు అగ్వకు అమ్ముకుంటున్న రైతులు
ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న కార్మిక సంఘాలు
దేవరుప్పుల, నవంబరు 24: రైతులు పండించిన ప్రతీ గింజను కొంటామని, గిట్టుబాటు ధర కల్పిస్తామని, ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంతి కేసీఆర్ ఇచ్చిన హామీ ఆచరణలో అమలు కావడంలేదు. వానాకాలంలో సన్నరకం వరి ధాన్యం పండించాలని చెప్పిన కేసీఆర్ మాట విని రైతులంతా ఈసారి సన్నరకాలు పండించారు. తీరా కొనుగోలు కేంద్రాల వద్దకు వెళితే అధికారులు అనేకరకాల కొర్రీలు పెడుతున్నారు. తేమ విషయంలో 16నుంచి 17కంటే ఎక్కువ ఉండవద్దని, ధాన్యానికి మచ్చ ఉంటే మద్దతు ధర రాదని చెప్పి చేతులు దులుపుకుం టున్నారు. వారి సూచన మేరకు ధాన్యాన్ని మరోసారి తూర్పార పడుతున్నామని, వ్యవసాయ మోటారుకు ఫ్యాన్ అమర్చి మళ్లీ తూర్పార పడుతున్నా మని, అయినా అధికారులు కొనుగోలు టోకెన్లు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విధిలేక రైతులు దళారులను ఆశ్ర యిస్తే వారు ఇదే అదనుగా భావించి అడ్డగోలు ధర పెడుతున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సన్నరకాలు ఎందుకు పం డించామా? అని తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే సన్న రకాలకు రూ.100నుంచి 150 వరకు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ కొడకండ్ల రైతు వేదిక ప్రారంభ సభలో ప్రకటించారని, కాని ఇప్పటివరకు ఆ ఊసే లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ధర ఇవ్వకపోయినా పరవాలేదు.. కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరకైనా అధికారులు కొర్రీలు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తేమ ఉందని మళ్లీ తూర్పార పట్టించారు..
బస్వ వెంకన్న, రైతు, సీతారాంపురం
గింజకు మచ్చ ఉందని మరోసారి తూర్పార పట్టమని అధికారులు చెబితే అలాగే చేశాం. మోటారు పంపుసెట్‌కు ఫ్యాన్ అమర్చి ఎంత తూర్పార పట్టినా మచ్చ వచ్చిన గిం జలు పోవటం లేదు. ఖర్చు మాత్రం తడిసి మోపెడ యింది. అధికారులు కోర్రీలు మాని కొనుగోలు చేయాలి.
మచ్చ ఉన్నా కొనుగోలు చేయాలి..
సింగారపు రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం నేత
అకాల వర్షాల వల్ల దోమ కాటుతో వరి గింజలపై మచ్చ వస్తే కొనుగోలు చేయటానికి అధికారులు నిరాకరిస్తున్నారు. నష్ట పరిహారం చెల్లించాల్సిన ప్రభుత్వం ఇలా కొర్రీలు పెట్టడం సరికాదు. మచ్చ వచ్చిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అంతే కాకుండా ధాన్యం పండించిన రైతులందరికీ కొడకండ్ల సభలో సీఎం ప్రకటించిన రూ.150 బోన్‌సగా చెల్లించాలి.
నిబంధనల ప్రకారమే కొంటున్నాం..
-బి. రామకృష్ణ, వ్యవసాయాధికారి, దేవరుప్పుల
నిబంధనల ప్రకారమే ధాన్యం కొంటున్నాం. మచ్చ ఉన్న ధాన్యాన్ని రైస్ మిల్లర్లు రిటన్ చేసే అవకాశం ఉంది. రైతులంతా గమనించి రెండోసారి తూర్పార పట్టి మచ్చ వచ్చిన గింజలు తొలగేలా చూసుకోవాలి.