నకిలీ ఈ-వాలెట్‌ పేరుతో మోసం

ABN , First Publish Date - 2020-11-13T10:11:12+05:30 IST

సెల్‌ఫోన్‌లో ఓ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఆపరేట్‌ చేస్తే విదేశాల నుంచి డబ్బు వస్తుందని నమ్మించి ఓ వ్యక్తి అకౌంట్‌ నుంచి రూ.5.50 లక్షలు కాజేశారు.

నకిలీ ఈ-వాలెట్‌ పేరుతో మోసం

 అకౌంట్‌ నుంచి రూ.5.50లక్షలు మాయం

పోలీసులను ఆశ్రయించిన బాధితుడు


వరంగల్‌ అర్బన్‌ క్రైం, నవంబరు 12: సెల్‌ఫోన్‌లో ఓ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఆపరేట్‌ చేస్తే విదేశాల నుంచి డబ్బు వస్తుందని నమ్మించి ఓ వ్యక్తి అకౌంట్‌ నుంచి రూ.5.50 లక్షలు కాజేశారు. చివరికి మోసపోయానని తెలుసుకున్న బాధితుడు హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హన్మకొండ ఎస్సై బొజ్జ రవీందర్‌ వివరాల ప్రకారం.. వరంగల్‌ పెరుకవాడకు చెందిన మండల అనుదీప్‌ హన్మకొండ కొత్తబస్టాండ్‌ సమీపంలోని ఓ లాడ్జిని అద్దెకు తీసుకుని నడిపిస్తున్నాడు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం శ్యాంపేట గ్రామానికి చెందిన లింగాల కిశోర్‌ అనే వ్యక్తి లాడ్జికి వచ్చి నెల, రెండు నెలల పాటు ఉండేవాడు.


అనుమానం వచ్చిన అనుదీప్‌.. ఏం పనిచేస్తారని కిశోర్‌ను ప్రశ్నించగా ఓ ఈ-వాలెట్‌ సంస్థలో పని చేస్తున్నానని నెలకు రూ.లక్ష సంపాదిస్తున్నట్టు తెలిపాడు. ఇది నమ్మిన అనుదీప్‌.. తానూ చేస్తానని చెప్పాడు. దీంతో ముందుగా సెల్‌ఫోన్‌లో ఓ యాప్‌ వేసుకోవాలని విదేశాల నుంచి వచ్చే డబ్బులు నీ అకౌంట్‌లో జమ అవుతాయని కిశోర్‌ నమ్మించాడు. నెల రోజుల తర్వాత కమీషనర్‌ రూపంలో డబ్బులు వస్తాయని చెప్పాడు. ముందుగా రూ.10వేలు చెల్లిస్తే తరుచుగా డబ్బులు వస్తాయని చెప్పి డబ్బులను ఫోన్‌పే ద్వారా కిశోర్‌ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడు. పనిఒత్తిడిలో అనుదీప్‌ అకౌంట్‌లో డబ్బులను చూసుకోలేదు. బుధవారం డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా అకౌంట్‌ నుంచి రూ.5.50 లక్షలు డ్రా అయినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో షాక్‌కు గురైన అనుదీప్‌ వెంటనే పోలీసుకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవీందర్‌ తెలిపారు.

Updated Date - 2020-11-13T10:11:12+05:30 IST