కంది రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు

ABN , First Publish Date - 2020-03-02T11:30:38+05:30 IST

కంది రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు

కంది రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు

మళ్లీ రైతుల పేరుతో మార్క్‌ఫెడ్‌కు అమ్మకం 

నయా మోసానికి తెరతీసిన ప్రైవేట్‌ వ్యాపారులు

 

జనగామటౌన్‌: 

జిల్లాలో కంది కొనుగోళ్ల సీజన్‌ ప్రారంభమై నెలరోజులు దాటినా కంది రైతులకు మద్దతు ధర అందని ద్రాక్షగా మారింది. రైతుల వద్ద తక్కువ ధరలతో కందులను కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యాపారులు.. అవే కందులను మార్క్‌ఫెడ్‌కు రైతుల పేరుతోనే దర్జాగా అమ్ముకుంటూ రీసైకిల్‌ దందాకు తెరతీశారు. ఫలితంగా మద్దతు ధర అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.


జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 12వేల ఎకరాలకు పైగా కంది సాగు కాగా, గతనెల నుంచి రైతులు కంది పంటను మార్కెట్‌ యార్డులకు తరలిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ సౌజన్యంతో పీఏసీఎస్‌ ద్వారా క్వింటాల్‌కు రూ.5,800 మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ మార్కెట్లలో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో రకరకాల కుంటి సాకులతో మద్దతు ధర కొనుగోళ్లు మందకొడిగా సాగాయి. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతుల నుంచి తక్కువ ధరలకు కందులను కొనుగోలుచేసి భారీగా నిల్వలు సిద్ధం చేసుకున్నారు. ఇంతటితో ఆగక తిరిగి రైతుల పేరుతోనే మార్క్‌ఫెడ్‌కు అమ్మకాలు జరిపేందుకు గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారు. 


కుంటిసాకులతో మద్దతు కొనుగోళ్లు బంద్‌ 

ఆన్‌లైన్‌లో రైతుల పేర్లు లేవని, తేమశాతం, నాసిరకంగా ఉన్నాయనే సాకుతో గత నెలరోజులుగా మార్క్‌ఫెడ్‌, పీఏసీఎస్‌ సంస్థల్లో కొనుగోళ్లు మందకొడిగా సాగాయి. రోజుల తరబడి కొనుగోళ్లు జరపలేదు. దీంతో రంగంలోకి దిగిన ప్రైవేటు మాఫియా.. కంది మద్దతు ధర రూ.5800 ఉంటే, రైతుల నుంచి రూ.3500 నుంచి రూ.4500 ధరతో క్వింటాళ్ల కొద్ది కందులు కొనుగోలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోళ్ల నిరాకరణతో దిక్కుతోచని స్థితిలో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుని నష్టపోయారు. 


ప్రైవేటుకు 50వేల క్వింటాళ్లు

జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ మార్కెట్‌ యార్డులో నెల రోజులుగా ప్రభుత్వ రంగ సంస్థలు మద్దతు ధరకు చేసిన కందులు కేవలం 12 వేల క్వింటాళ్లు కాగా, ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి కొనుగోలు చేసిన 50వేల క్వింటాళ్లు దాటాయి. అనధికారికంగా మరో 50వేల క్వింటాళ్లు కందుల కొనుగోళ్లు చిల్లర కాంటాల ద్వారా కొనుగోళ్లు జరిగాయనిఇ సమాచారం.


రైతుల పేరుతో అమ్మకాలు

కందుల సీజన్‌ ముగిసే వేళ మార్క్‌ఫెడ్‌ నిబంధనలు సడలించడంతో ప్రైవేట్‌ వ్యాపారులు ఆనవాయితీగా రీసైకిల్‌ దందాకు శ్రీకారం చుట్టారు. మార్కెట్‌ యార్డులకు గుట్టుచప్పుడు కాకుండా రైతుల పేరుతో వందలాది క్వింటాళ్ల కందులను తరలిస్తున్నారు. ప్రైవేటు మాఫియా.. అధికారులు మిలాఖత్‌తో రైతులకు చెందాల్సిన మద్దతు ధరలు కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రైవేటు వ్యాపారులు రహస్యంగా గోదాంలలో భారీ మొత్తంలో కందులు నిల్వచేసి గుట్టుగా అమ్మకాలకు తరలిస్తుండడం ప్రతీ సీజన్‌లో ఆనవాయితీగా సాగుతుంది. ఈ రీసైకిల్‌ దందాపై రైతులు ఫిర్యాదు చేయడంతో ఇంటలిజెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మార్కెట్‌ యార్డులపై నిఘా పెంచారు. జిల్లాలో సీజన్‌ చివరిలోనైనా యార్డులకు కందులు తరలించే రైతులకు మద్దతు ధరలు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 


దందాపై ఉక్కుపాదం మోపాలి 

- గోనెల సమ్మయ్య, కాంగ్రెస్‌ నేత

జిల్లాలోని మార్కెట్‌ యార్డుల్లో ప్రతీ సీజన్‌లో ప్రైవేటు వ్యాపారులు కందుల రీసైకిల్‌ దందాతో మద్దతు ధరలను కొల్లగొడుతున్నారు. మార్క్‌ఫెడ్‌, పీఏసీఎస్‌ అధికారులతో కుమ్మక్కైన ప్రైవేటు మాఫియా దందాపై  జిల్లాఅధికారులు ఉక్కుపాదం మో పాలి. అర్హులైన రైతులకు మద్దతు ధరలు అందించాలి. 


రైతుల పేరుతో అమ్మితే క్రిమినల్‌ కేసులు

- నాగేశ్వర శర్మ, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

మార్కెట్‌ యార్డుల్లో మద్దతు ధరలకు కందులను కొనుగోలు చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాము. కొనుగోళ్లలో ఎలాంటి లోపాలు లేకుండా అర్హులైన రైతులకు మద్దతు ధరలు అందించేలా చూస్తున్నాం. రైతుల పేరుతో అమ్మకాలు జరిపే వ్యాపారులపై క్రిమినల్‌ కేసులతో కఠిన చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2020-03-02T11:30:38+05:30 IST