మతరాజ్యం స్థాపించేందుకే చట్టాల అమలు

ABN , First Publish Date - 2020-03-02T11:21:07+05:30 IST

మతరాజ్యం స్థాపించేందుకే చట్టాల అమలు

మతరాజ్యం స్థాపించేందుకే చట్టాల అమలు

తెలంగాణలో ఎన్‌ పీఆర్‌ సర్వేను వ్యతిరేకిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించాలి

సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ చట్టాలను బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

ప్రజాచైతన్యగర్జన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం


నర్సంపేట, మార్చి1: మతరాజ్యం స్థాపించేందుకే నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ చట్టాలను అమలు చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నర్సంపేటలోని ఎంసీపీఐ(యూ) కార్యాలయం ఆవరణలో ఆదివారం రాత్రి సీపీఎం నాయకుడు పెద్దారపు రమేశ్‌ అధ్యక్షతన జరిగిన ప్రజాచైతన్య గర్జన సభలో ఆయన మాట్లాడారు. మతం దుర్మార్గం కాదని, మత రాజ్యం దుర్మార్గమని అన్నారు. దేశంలో కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య వైశమ్యాలను, ద్వేశాలను రగిలించేందుకే బీజేపీ చట్టాలను అమలు చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ చట్టాలతో హిందూ, ముస్లింలతో పాటు అన్ని మతాల ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్యలకు ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని దుయ్యబట్టారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏ(పౌరసత్వచట్టసవరణ), ఎన్‌ఆర్‌సీ (భారత పౌరసత్వం రిజిస్ర్టేషన్‌), ఎన్‌పీఆర్‌ (భారత పౌరజనగణన)చట్టాలను తీసుకురావడంతో దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్‌ఆర్‌సీ అమలుతో అస్సాం రాష్ట్ర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. సీఏఏ చట్టం అమలుతో దేశంలోని ముస్లింలు, మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, బహుజనులు అభద్రతకు గురవుతున్నారని ఆయన వివరించారు. దేశ ప్రధాని, హోంశాఖ మంత్రులు ప్రజల్లో అశాంతి కలిగేలా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్‌పీఆర్‌ సర్వేను ఏప్రిల్‌ 1నుంచి ఉద్యోగులతో దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు బీజేపీ ప్రభుత్వం పూనుకుందని తెలిపారు. ఈ సర్వేలో భారతీయ పౌరుడు కాదని అనుమానం వస్తే వారికి రుజువుల కోసం నోటీసులు జారీ చేసి ఆధారాలు చూపని వారిని జైలుకు పంపేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని వివరించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో డిటింషన్‌ క్యాం్‌ప(జైళ్ళు)లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తాఖీదులను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి దుర్మార్గ విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని ఆయన కోరారు. దేశంలోని 14 రాష్ర్టాలు ఎన్‌పీఆర్‌ చట్టాన్ని అమలు చేయమని తేల్చి చెప్పాయన్నారు. కేరళ, బెంగాల్‌, అస్సాం ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రజలను భయాందోళనకు, అభద్రతకు గురిచేసే ఎన్‌పీఆర్‌ చట్టం సర్వేను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోమని సీఎం కేసీఆర్‌ ప్రకటించాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ 1నుంచి జరగనున్న ఎన్‌పీఆర్‌(జాతీయ జనాభా గణన) సర్వే సందర్భంలో ప్రజలు వివరాలు చెప్పకుండా వారిని చైతన్యవంతులను చేయడానికి వామపక్షాలు, ప్రజాసంఘాలు కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసరావు, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ముఖ్తార్‌పాషా, పీవైఎల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎలకంటి రాజేందర్‌, జమాతేఇస్లామి హింద్‌ రాష్ట్ర నాయకుడు సాధిక్‌సాహెబ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ మజీద్‌లు సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ చట్టాల వల్ల ప్రజలకు కలిగే నష్టాలను వివరించారు. ఈ సభలో విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జగదీశ్వర్‌, ఎంసీపీఐ(యూ)రాష్ట్ర కార్యదర్శి గాదెగోని రవి, సీపీఎం నాయకులు పెద్దారపు రమేశ్‌, భూక్య సమ్మయ్య, ఈసంపెల్లి బాబు, న్యూడెమోక్రసీ నాయకుడు లావుడ్యరాజు, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి మోడెం మల్లేషం, సీపీఐ నాయకులు పంజాల రమేశ్‌, అక్కపెల్లి రమేశ్‌, ఈర్లపైడి, ఎంసీపీఐ(యూ) నాయకుడు కన్నం వెంకన్న, ఎల్‌హెచ్‌పీఎ్‌స రాష్ట్ర అధ్యక్షుడు జైసింగ్‌రాథోడ్‌, దళితరత్న కల్లెపల్లి ప్రణయదీ్‌పమాదిగ, టీజేఎస్‌ రాష్ట్ర నాయకుడు షేక్‌ జావెద్‌, ఖాలిద్‌ సయ్యద్‌, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు, ఏఐడీడబ్ల్యుఏ జాతీయ నాయకురాలు జ్యోతి, రాములు, స్రవంతి, విద్యార్థి సంఘాల నాయకులు సందీప్‌, పార్థసారధి, నరేశ్‌, ఎంసీపీఐ నాయకులు రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T11:21:07+05:30 IST