ప్రజలకు అనుగుణంగా మునిసిపల్ చట్టాలు
ABN , First Publish Date - 2020-03-02T11:20:21+05:30 IST
ప్రజలకు అనుగుణంగా మునిసిపల్ చట్టాలు

- ప్రజలకు సేవ చేయని కౌన్సిలర్లను పక్కనపెట్టాలి
- ఎవరి ఇంటిముందు వారే శుభ్రం చేసుకోవాలి
- పట్టణ ప్రగతిలో మంత్రి దయాకర్‌రావు
పరకాల, మార్చి1: ప్రజలకు అనుగుణమైన చట్టాలను తీసుకువచ్చి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోందని గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం పట్టణ ప్రగతిలో భాగంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ హరిత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరకాల పట్టణంలోని దళిత కాలనీల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. సీఎ్‌సఐ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామాలు బాగుపడ్డాయని, ఇప్పుడు పట్టణ ప్రగతిలో కూడా పట్టణాలు పులకించాలన్నారు. కొత్త మునిసిపల్ చట్టంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, పేదవాడికి 75గజాల్లో ఇళ్లు కట్టుకుంటే పరిమిషన్ అవసరం లేదన్నారు. మునిసిపాలిటీలోని 22 వార్డులకు ప్రతి నెలా పట్టణాభివృద్ధికి రూ.లక్ష చొప్పున రూ.22లక్షలు నిధులు నెలనెలా రానున్నాయన్నారు. ఎవరి ఇంటిముందు చెత్త ఉంటే ఆ కుటుంబ సభ్యులే బాధ్యులవుతారని మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేసి జరిమానాలు విధిస్తారని తెలిపారు. పట్టణంలోని ఓపెన్ ప్లాట్లలో చెత్తా చెదారాన్ని తొలగించకపోతే మునిసిపల్ పరిధిలో శుభ్రం చేసి ఐదింతలు జరిమానాలు విధిస్తే అది కూడా కట్టని యెడలా ప్లాట్‌ను మునిసిపాలిటీ సొంతం చేసుకుంటుందన్నారు. అధికారులు, పాలకులు, ప్రజలు ఛాలెంజ్‌గా తీసుకొని పట్టణాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పేదవారు ఎస్సీ కాలనీల్లో ఇళ్లు కట్టుకునే వారికి ముఖ్యమంత్రితో మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తామని పేర్కొన్నారు. పరకాలలో డంపింగ్‌యార్డు, నాలుగైదు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుకు స్థానిక అధికారులు వెంటనే కృషి చేయాలన్నారు. షాపుల యజమానులు తమ షాపు ముందు చెత్తను పోస్తే జరిమానా విధించండి అని అలానే కొనసాగితే మునిసిపల్ పరిధిలో షాపును మూసివేయండి అని పేర్కొన్నారు. పరకాలకు మంత్రి కేటీఆర్‌ను తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
కలెక్టర్ హరిత మాట్లాడుతూ మన పరిశుభ్రతతోనే మనకు విలువ పెరుగుతుందని, కరెంట్ ఫోల్స్, వేలాడే వైర్లు పది రోజుల వ్యవధిలోనే మార్చడం జరుగుతుందన్నారు.
ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. పరకాల మునిసిపాలిటీ ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌రెడ్డి, మునిసిపల్ చైర్‌పర్సన్ సోదా అనిత రామకృష్ణ, ఆర్డీవో కిషన్, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ బొచ్చు వినయ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొజ్జం రమేష్, కుంకుమేశ్వర ఆలయం చైర్మన్ గందె వెంకటేశ్వర్లు, జిల్లా రైతు సమన్వనయ సమితి కన్వీనర్ బొల్లె భిక్షపతి, కౌన్సిలర్లు, పట్టణ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.