కుట్రదారుల సమాచారం మాకు తెలుసు
ABN , First Publish Date - 2020-11-27T07:24:02+05:30 IST
‘‘ఆరేళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో.. హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ మతకల్లోలాలు సృష్టించేందుకు విద్రోహక శక్తులు కుట్రలు పన్నాయి.

రాష్ట్రంలో, రాజధానిలో మతకల్లోలాలకు
కుట్ర పన్నే వారిపై కఠిన చర్యలు తప్పవు
వారి చర్యలను ముందుగానే నిలువరిస్తాం
సోషల్ మీడియాలో వదంతులను నమ్మొద్దు
సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై న్యాయ సమీక్ష
రోహింగ్యాలపై 62 కేసులు నమోదు చేశాం
ఎన్నికలకు 51,500 మందితో బందోబస్తు
విలేకరుల సమావేశంలో డీజీపీ
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆరేళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో.. హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ మతకల్లోలాలు సృష్టించేందుకు విద్రోహక శక్తులు కుట్రలు పన్నాయి. వారి ప్రతి కదలిక మాకు తెలుసు. ఇప్పటికైతే ఇంతకంటే వివరాలు చెప్పలేం. వారిపై ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోనూ లేం. కానీ.. వారు యాక్షన్‌లోకి దిగేలోపే నిలువరిస్తాం’’ అని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఆసరాగా చేసుకుని.. కుట్రలకు వ్యూహాలు పన్నుతున్న విద్రోహక శక్తులపై పక్కా సమాచారం ఉందని ఆయన వివరించారు.
గురువారం ఆయన అదనపు డీజీపీ జితేందర్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్ భగవత్‌తో కలిసి.. విలేకరులతో మాట్లాడారు. విద్రోహకశక్తుల వ్యూహాలపై అన్ని కమిషనరేట్లు, జిల్లాలను అప్రమత్తం చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
‘‘రౌడీషీటర్లు, ట్రబుల్ మేకర్లపై నిఘా పెట్టాం. వారిని బైండోవర్ చేస్తున్నాం. మత ఘర్షణలకు ప్రయత్నిస్తున్న వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 15 వందల కేసుల్లో నిందితులుగా ఉన్న 3,500 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారనే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిపై పోలీసు నిఘా కొనసాగుతుంది’’ అని వెల్లడించారు. ప్రజల సహకారంతో ఎలాంటి ఘటనలు లేని విధంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. ఇప్పటి వరకు మూడు కమిషనరేట్లలో 50 కేసులు నమోదు చేశామని చెప్పారు.
‘సోషల్’ వదంతులను నమ్మొద్దు
సోషల్ మీడియా ద్వారా సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని.. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని డీజీపీ కోరారు. సోషల్ మీడియాలో వ్యాప్తిచెందే వదంతులను నమ్మొద్దన్నారు.
51,500 మందితో బందోబస్తు...
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు.. 51,500మంది పోలీసులను బందోబస్తుకు నియమిస్తున్నామని డీజీపీ వివరించారు.
తేసస్వి సూర్యపై కేసు.. సర్జికల్ స్ట్రైక్
ఓయూ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు.. బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు చేశామని డీజీపీ వెల్లడించారు. సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై న్యాయ సమీక్ష జరుపుతున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఉపన్యాసాల్ని న్యాయపరంగా పరిశీలిస్తున్నామన్నారు.
రోహింగ్యాలపై..
రోహింగ్యాలపై ఇప్పటికే 62 కేసులు ఉన్నాయని డీజీపీ తెలిపారు. తప్పుడు సమాచారంతో ఓటర్ ఐడీ, ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు పొందడం వంటి నేరాలకు వారిపై కేసులు నమోదు చేశామన్నారు. అంతకు ముదు డీజీపీ కార్యాలయంలో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏడీజీలు జితేందర్, రాజీవ్‌రతన్, శివధర్‌రెడ్డి పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.