ఐసీఎంఆర్‌ చెప్పినట్లే చేస్తున్నాం

ABN , First Publish Date - 2020-05-09T09:32:13+05:30 IST

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కట్టడి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. పాతనగరంలో మరింత పకడ్బందీగా కట్టడి చేసి, వైరస్‌

ఐసీఎంఆర్‌ చెప్పినట్లే చేస్తున్నాం

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కట్టడి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. పాతనగరంలో మరింత పకడ్బందీగా కట్టడి చేసి, వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలని నిర్ణయించామన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులకే టెస్టులు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సూచించిందని పేర్కొన్నారు. పాజిటివ్‌ రోగుల ఇళ్లలో ఎన్‌సీడీ రోగులు ఉంటే.. వాళ్లకూ టెస్టులు చేయాలని సూచించారని, తాము అదే పద్ధతిని పాటిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మే 29 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, కేంద్రం ఇచ్చిన సూచనల మేరకు  కట్టడి ప్రాంతాల్లో సడలింపులు ఉంటాయని తెలిపారు. కేసులు పెరిగిన జిల్లాల్లో మాత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌లోని 8 సర్కిళ్లలో మాత్రం వైరస్‌ వ్యాప్తి ఉందని చెప్పారు. ప్రస్తుతం ఏడెనిమిది కట్టడి ప్రాంతాలు మాత్రమే ఉన్నాయన్నారు. కేసుల సంఖ్యను బట్టి కట్టడి విధానం ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో వైరస్‌ వ్యాప్తి తీవ్రత అంతగా లేదన్నారు. శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖతో వీడియో కాన్ఫెరెన్స్‌ జరిగిందని, రాష్ట్రంలో రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్న సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, వికారాబాద్‌ జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలుగా మార్చాలని కోరినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, భూపాలపల్లి, కరీంనగర్‌, సిరిసిల్ల, మంచిర్యాల, నారాయణపేట్‌, నిజామాబాద్‌, నల్లగొండ, జగిత్యాల, అసిఫాబాద్‌, జనగాంతో కలిపి మొత్తం 14 జిల్లాలు సోమవారం నాటికి గ్రీన్‌జోన్‌లోకి వస్తాయని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలు మాత్రమే రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నాయని తెలిపారు. వైద్యసేవలు కొనసాగించాలని ప్రైవేటు ఆస్పత్రులకు సూచించామని పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వస్తున్న వాళ్లను ఇండ్లల్లో క్వారంటైన్‌ చేస్తున్నామని, వసతులు లేని వాళ్లను గవర్నమెంట్‌ క్వారంటైన్‌ కేంద్రాలో ఉంచుతామని తెలిపారు. దేశంలో కరోనాతో కాకుండా ఇతర కారణాలతోనే ఎక్కువ మంది చనిపోతున్నారని మంత్రి చెప్పారు.

Updated Date - 2020-05-09T09:32:13+05:30 IST