ఉప్పు, పసుపుతోనే కూరగాయలు కడగాలి

ABN , First Publish Date - 2020-06-19T09:45:47+05:30 IST

దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్‌ కోరలు చాస్తోం ది. పెరుగుతున్న మరణాలు, పాజిటివ్‌ కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

ఉప్పు, పసుపుతోనే కూరగాయలు కడగాలి

  • డెటాల్‌ వాడితే ఆరోగ్య సమస్యలు
  • శానిటైజర్‌తో కరెన్సీని శుభ్రం చేయాలి
  • ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తల సూచనలు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. పెరుగుతున్న మరణాలు, పాజిటివ్‌ కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ ఎక్కడ నుంచి వచ్చి తమకు అంటుకుంటుందోనని ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అత్యవసర పనులు, ఉద్యోగాల నిమిత్తమే చాలా మంది ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు. అలాగే నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, రెండు వారాలకు కావాల్సిన కూరగాయలను తెచ్చుకుంటున్నారు. అయితే కూరగాయలను శుభ్రం చేసే విషయంలో కొందరు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటిని సబ్బు, డెటాల్‌, శానిటైజర్లతో శుభ్రం చేయడంతో పాటు తుడిచి అరగంట పాటు ఎండబెడుతున్నారు.


ఇలా చేయడం వల్ల కూరగాయల్లో పోషకాలు నశిస్తాయని జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ(ఎన్‌ఐఎన్‌) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సబ్బు, డెటాల్‌,  రసాయనాలతో శుభ్రం చేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు. రైతుల నుంచి వినియోగదారుల చేతులకు వచ్చేసరికి.. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు, ఆకుకూరల్లో 20-30 శాతం వరకు జీవకణాలుంటాయి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సబ్బు, డెటాల్‌, శానిటైజర్‌లతో 5-10 నిమిషాలు శుభ్రం చేసి.. ఆపై ఎండలో ఆరబెడుతున్నారు. దీని వల్ల జీవకణాలు నశించిపోతాయి.


ఇక వాటిని ఉడికించి తిన్న తర్వాత కొందరికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కడుపులో వికారంలాంటివి వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే క్రిములు, బ్యాక్టీరియాను నశింపజేసే ఉప్పు, పసుపుతో కూరగాయలను 20 నిమిషాలు కడిగితే చాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వాటిని మళ్లీ మంచినీటితో శుభ్రం చేయాలని, 70-80 డిగ్రీల వేడిలో ఉడికించి తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావని చెబుతున్నారు. కరోనా విషయంలో వ్యక్తిగత శుభ్రతను ఎక్కువగా పాటించాలని సూచిస్తున్నారు.

Updated Date - 2020-06-19T09:45:47+05:30 IST