భూ వివాదాల్లో తలదూర్చకండి

ABN , First Publish Date - 2020-10-03T11:03:55+05:30 IST

పోలీసు అధికారులు, సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ భూ వివాదాల్లో తలదూర్చొద్దని వరంగల్‌ ఇన్‌చార్జి సీపీ ..

భూ వివాదాల్లో తలదూర్చకండి

వరంగల్‌ ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌


వరంగల్‌ అర్బన్‌ క్రైం, అక్టోబరు 2: పోలీసు అధికారులు, సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ భూ వివాదాల్లో తలదూర్చొద్దని వరంగల్‌ ఇన్‌చార్జి సీపీ పి.ప్రమోద్‌కుమార్‌ ఆదేశించారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో అధికారుల పనితీరు మరింత మెరుగుపరిచేందుకు పలుసూచనలు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే సివిల్‌ తగాదాలు, సెటిల్‌మెంట్లను పోలీసులు ప్రొత్సహించొద్దని పేర్కొన్నారు. భూ తగాదాల్లో తలదేర్చిన పోలీసు అధికారుల పరిస్థితి ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుందని, క్రమశిక్షణ కలిగి ప్రజలకు సేవలందించేవారికి మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఒక వేళ భూ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే ఇరువర్గాలను కోర్టుకు వెళ్లాని సూచించాలని తెలిపారు. భూముల విషయంలో ఏదైనా శాంతిభద్రతల సమస్య ఎదురైతే దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని బైండోవర్‌ చేయాలని సూచించారు. భూవివాదాల్లో మధ్యవర్తిత్వం చేసే రౌడీషీటర్ల పట్ల కఠినంగా ఉండాలని, చట్టవ్యతిరేకండా ప్రవర్తిస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేసేందుకు ఆధారాలు సేకరించాలన్నారు.


భూ వివాదాల్లో పాల్గోనే రౌడీషీటర్లపై ఓ కన్నేసి ఉంచాలని, పట్టాభూముల్లో కబ్జాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఆదేశించారు. ప్రతీ వారం పోలీసు స్టేషన్ల వారిగా రౌడీషీటర్లు, ల్యాండ్‌ గ్రాబర్స్‌కు కౌన్సిలింగ్‌ నిర్వహించాలని సూచించారు. నకిలీ దస్తావేజులు సృష్టించి అమ్మిన భూములనే అమ్మేవారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. నకిలీ భూ పత్రాలను సృష్టించే గ్యాంగులు వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్నాయని, వారిని గుర్తించి అరెస్టు చేయాలని సీపీ పేర్కొన్నాడు.

Updated Date - 2020-10-03T11:03:55+05:30 IST