కరోనా మృతులపై అనవసర రాద్ధాంతం

ABN , First Publish Date - 2020-06-25T08:40:05+05:30 IST

‘‘కిడ్నీ, గుండె సంబంధిత, ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కరోనాకు తట్టుకోలేక ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు.

కరోనా మృతులపై అనవసర రాద్ధాంతం

ఇతర వ్యాధులున్న వారికే ఎక్కువగా ముప్పు

లక్షణాలుంటేనే నిర్ధారణ పరీక్ష : మంత్రి ఈటల


మియాపూర్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ‘‘కిడ్నీ, గుండె సంబంధిత, ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కరోనాకు తట్టుకోలేక ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. దీనిపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రి విషయంలో విష ప్రచారం జరుగుతోంది’’ అని మంత్రి ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులను వైద్యులు ప్రేమగా చూసుకుంటున్నారని, గాంధీ ఆస్పత్రిలో వందలాది మంది ఇన్‌పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. అలాంటి  ఆస్పత్రిపై కొందరు సామాజిక మాధ్యమాల్లో, మరికొందరు నేరుగా బురదజల్లే దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ ఆస్పత్రి, సిబ్బందిపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వారి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయవద్దని హితవుపలికారు. లక్షణాలులేని వారు నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రులకు రావొద్దని కోరారు. లక్షణాలు ఉంటే ఎంతమందికైనా పరీక్షలు చేయడానికి సిద్ధమన్నారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌ను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలను చేశారు. కాగా, టిమ్స్‌ ఆస్పత్రిని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి  తెలిపారు. ఆస్పత్రిలోని సౌకర్యాలు, వైద్యపరికరాలను బుధవారం ఆయన పరిశీలించారు. తక్కువ ఖర్చుకే కార్పొరేట్‌ ఆస్పత్రుల కన్నా మెరుగైన సదుపాయాలతో ఈ ఆస్పత్రిలో వైద్యం అందిస్తామని చెప్పారు. మొత్తం 1,224 బెడ్స్‌లో వెయ్యింటికి ఆక్సిజన్‌ అందుబాటులో ఉంటుందన్నారు. 50బెడ్స్‌కు వెంటిలేటర్ల సదుపాయం ఉందన్నారు. టిమ్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను రెండు, మూడు రోజుల్లో భర్తీ చేస్తామన్నారు. ఆస్పత్రి ఇన్‌చార్జిగా ప్రొఫెసర్‌ విమలా థామ్‌సను నియమించామని, సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల బోధనకు ఇక్కడ పీజీ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2020-06-25T08:40:05+05:30 IST