వార్‌ డిక్లేర్డ్‌..!

ABN , First Publish Date - 2020-12-07T07:39:56+05:30 IST

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధమయ్యారు. గత ఆరేళ్లుగా వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఆయన.. ఇప్పుడు పోరు బాట పడుతున్నారు. రాష్ట్రంలోనే కాదు.. కేంద్రంలోనూ బీజేపీని ఢీకొట్టే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు

వార్‌ డిక్లేర్డ్‌..!

కేంద్రంతో కొట్లాటకు కేసీఆర్‌ సన్నద్ధం

భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు

ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగానూ అడుగులు

దుబ్బాక, గ్రేటర్‌ ఫలితాల తర్వాత మార్పు

ఇక మజ్లిస్‌తోనూ వ్యూహాత్మక దూరం

వారితో కలిస్తే విమర్శలు తప్పవని భావన

బంద్‌లో టీఆర్‌ఎస్‌ పాల్గొంటుంది: కేసీఆర్‌

విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు

మధ్యాహ్నం 12 వరకు షాపులన్నీ బంద్‌

జాతీయ రహదారులపై రాస్తారోకో: కేటీఆర్‌

కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ సహకారం: భట్టి

బంద్‌కు పెరిగిన మద్దతు

లారీ ఓనర్లు, కార్మిక, బ్యాంక్‌ యూనియన్లూ సై!

9న రాష్ట్రపతితో విపక్ష నేతల భేటీ

రెండో లేదా మూడో వారంలో పార్లమెంట్‌ భేటీ?

ఖేల్‌ రత్న వెనక్కిచ్చేస్తా: బాక్సర్‌ విజేందర్‌

బాలీవుడ్‌ మద్దతు.. 11వ రోజుకు రైతుల నిరసన


హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధమయ్యారు. గత ఆరేళ్లుగా వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఆయన.. ఇప్పుడు పోరు బాట పడుతున్నారు. రాష్ట్రంలోనే కాదు.. కేంద్రంలోనూ బీజేపీని ఢీకొట్టే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం జరిగే భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ అధినేతగా ఉంటూనే.. ధర్నాలో ప్రత్యక్షంగా పాల్గొనాలంటూ పార్టీ శ్రేణులను ఆదేశించారు కూడా. దీనికితోడు, ప్రగతి భవన్‌ వర్గాలు ఖండించినా.. కేసీఆర్‌ తనకు ప్రత్యేకంగా ఫోన్‌ చేశారని, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సంబంధించి జరిగే సభలో భాగస్వాములు కావాలని కోరారని జేడీఎస్‌ ముఖ్య నేత కుమారస్వామి మీడియాకు వెల్లడించారు. తద్వారా, డిసెంబరు రెండో వారంలో హైదరాబాద్‌లో భారీ సభ ఏర్పాటు చేస్తానని కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో.. బీజేపీ, కాంగ్రెస్‌ రహిత ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు అంతర్గతంగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారని రాజకీయ వర్గాలుభావిస్తున్నాయి. ఇప్పుడు భారత్‌ బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొనాలని ప్రకటించడం ద్వారా పోరాట జెండా ఎగరేసినట్లేనని విశ్లేషిస్తున్నాయి. దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పరాభవం తర్వాత మారుతున్న రాజకీయ సమీకరణాలకు సూచికగా వీటిని అభివర్ణిస్తున్నాయి. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేసీఆర్‌ తన వైఖరి మార్చుకుంటున్నట్లు టీఆర్‌ఎస్‌ ముఖ్యులు పేర్కొంటున్నారు.


మజ్లి్‌సతోనూ వ్యూహాత్మక దూరం!

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీతోనే టీఆర్‌ఎస్‌ నేరుగా పోరాడాల్సి ఉంటుంది. కేసీఆర్‌ కేంద్ర రాజకీయాలకు వెళితే అక్కడ కూడా బీజేపీతో తలపడాల్సిందే. అదే జరిగితే, మజ్లి్‌సతో తమకు ఇబ్బందులు తప్పవని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికితోడు, త్వరలో జరగనున్న నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎటువంటి అస్త్రాలూ ఇవ్వరాదని యోచిస్తున్నట్లు వివరించాయి.


అందుకే, ఆ పార్టీతో వ్యూహాత్మక దూరం పాటించాలని భావిస్తున్నట్లు చెబుతున్నాయి. గ్రేటర్‌ మేయర్‌ పదవి విషయలోనూ మజ్లిస్‌ మద్దతు కోరరాదని నిర్ణయించినట్లు సమాచారం. ‘‘మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక విషయంలో వేరే పార్టీల మద్దతు అడిగి బద్నాం అవ్వడం ఎందుకు!? ఏ పార్టీకీ మెజారిటీ లేనందున ఎన్నికకు దూరంగా ఉందాం’’ అని కొత్త కార్పొరేటర్లతో ఆదివారం జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మజ్లిస్‌ సహకారంతో మేయర్‌ పదవిని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే, ఈ ప్రభావం రాబోయే ఎన్నికలతోపాటు రాజకీయాలపైనా ఉంటుందని, అందుకే, వ్యూహాత్మక దూరమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిజానికి, మజ్లిస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య పొత్తు ఉందని బీజేపీ ఇప్పటికే ఆరోపిస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో దానినే ప్రధాన ప్రచారాంశం చేసింది. తొందర్లోనే నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక రానుంది. ఇప్పుడు ఆ పార్టీ సహకారంతో మేయర్‌ తీసుకుంటే.. ‘మేము చెప్పిందే నిజమైంది. టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒకటే’ అని బీజేపీ ప్రచారం చేస్తుంది.


అందుకే, సాగర్‌ ఉప ఎన్నిక తర్వాతే గ్రేటర్‌ మేయర్‌పై ఆలోచించాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతేనా, కేసీఆర్‌ జాతీయ రాజకీయాల యోచనకు కూడా మజ్లి్‌సతో ఇబ్బంది తప్పదని వివరిస్తున్నాయి. ఇటీవలి బిహార్‌ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకోవడానికి మజ్లి్‌సకు టీఆర్‌ఎస్‌ సహకరించిందని ఇప్పటికే బీజేపీ ఆరోపించింది. ఇప్పుడు కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడితే మజ్లిస్‌, టీఆర్‌ఎస్‌ అనుబంధాన్నే బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రం చేసుకుంటుందని, ఇది కేసీఆర్‌కు పెద్ద ప్రతిబంధకంగా మారుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే, మేయర్‌ ఎన్నికను సాధ్యమైనంత వాయిదా వేసేందుకు టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోందని చెబుతున్నాయి. ప్రత్యేకాధికారుల పాలన పెట్టినా.. ఎలాగూ అధికారం ప్రభుత్వ గుప్పిట్లోనే ఉంటుందని వివరిస్తున్నాయి. అందుకే, మేయర్‌ ఎన్నికను వాయిదా వేయాలనుకోవడం అధికార పార్టీ వ్యూహాత్మక నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి.


రెండో హయాంలో రగడ రగడ

మోదీ మొదటి సర్కారు హయాంలో నోట్ల రద్దు, జీఎస్టీ తదితరాలకు మద్దతు తెలిపిన కేసీఆర్‌.. రెండో ప్రభుత్వ హయాంలోనూ కేంద్రానికి సహకరించారు. కరోనా సమయంలో మోదీ పిలుపు మేరకు ప్రగతి భవన్‌ బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు కూడా. కానీ, ఇటీవలి కాలంలో మోదీ సర్కారు విధానాలను దునుమాడుతున్నారు. వివిధ అంశాలపై నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లిస్తే ధాన్యం కొనుగోలు చేయబోమంటూ కేంద్రం ఉత్తర్వు జారీ చేసిందని, ఇది దుర్మార్గమని దుయ్యబట్టారు. ఈ చట్టంతోపాటు కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యుత్తు బిల్లునూ కేసీఆర్‌ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో సైతం సీఎం ఈ చట్టాన్ని తప్పుబట్టారు.


అలాగే, రైల్వేల ప్రైవేటీకరణ.. ఎల్‌ఐసీ, బీఎ్‌సఎన్‌ఎల్‌ వంటి సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వంటి కేంద్ర నిర్ణయాలనూ తీవ్రంగా తప్పుబట్టారు. విదేశీ కంపెనీలకు మోదీ ప్రభుత్వం తొత్తుగా మారిందని ఆరోపించారు. అంతేనా, కరోనా సమయంలో సహకరించిన కేసీఆర్‌.. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీనీ దునుమాడారు. అది డొల్ల.. బోగస్‌ అని నిప్పులు చెరిగారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కరోనా మహమ్మారి నిర్వీర్యం చేసిన నేపథ్యంలో నగదు ఇవ్వాలని కోరితే రాష్ట్రాలను కేంద్రం బిచ్చగాళ్లుగా భావించిందని ఆరోపించారు.


ఈ ప్యాకేజీలో రుణపరిమితి పెంచినా ఆంక్షలు విధించడాన్ని దుయ్యబట్టారు. ఆ తర్వాత, కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలనూ కేసీఆర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. విద్యుత్తు చట్టంతోపాటు వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో వ్యతిరేకించారు కూడా. తాజాగా, వరదల విషయంలోనూ హైదరాబాద్‌కు కేంద్రం మొండి చెయ్యి చూపిందని విమర్శించారు. విధానాల ప్రాతిపదికనే తమ మద్దతు ఉంటుందని వివిధ సందర్భాల్లో కేసీఆర్‌ ప్రకటించారు. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా బీజేపీతో ప్రత్యక్ష పోరుకు దిగక తప్పని పరిస్థితి వచ్చిందని రాజకీయ వర్గాలు వివరిస్తున్నాయి. ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కూడా తనను ఢిల్లీ రాకుండా అడ్డుకోవడానికే బీజేపీ తెలంగాణలో నేతలను మోహరిస్తోందని ఆరోపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.

Updated Date - 2020-12-07T07:39:56+05:30 IST