ఓటింగ్ తగ్గుదల టీఆర్ఎస్ సర్కారు వైఫల్యమే..

ABN , First Publish Date - 2020-12-02T00:50:39+05:30 IST

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో టీఆరెస్ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరించిందని తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు.

ఓటింగ్ తగ్గుదల టీఆర్ఎస్ సర్కారు వైఫల్యమే..

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో టీఆర్ఎ‌స్ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరించిందని తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ సర్కారు, ఎన్నికల అధికారుల వైఫల్యం కారణంగానే పోలింగ్ శాతం తగ్గిందని పేర్కొన్నారు. తెలంగాణ సర్కారు, ఎన్నికల సంఘం తీరును తప్పు పట్టారు. ఈసందర్భంగా విజయశాంతి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టును యథాతధంగా మీకు ఇస్తున్నాం....


’’జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంత తక్కువ ఓటింగ్ నమోదు కావడం ఆవేదన కలిగిస్తున్నప్పటికీ... ఇందులో ప్రభుత్వం, ఎన్నికల సంఘం బాధ్యత ఎక్కువనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వరుస సెలవులు ఉన్నాయని తెలిసీ, ఎక్కువ మంది నగరంలో ఉండే అవకాశం లేదని తెలిసీ... ఈ సమయంలో ఎన్నికలు వచ్చేలా షెడ్యూల్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వమే వ్యూహాత్మకంగా పోలింగ్‌ను నిర్వీర్యం చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు ఓటరు నమోదు, ఓటరు జాబితాల్లో తగిన మార్పు చేర్పులు, అవకతవకలుంటే పరిశీలించి సరిచేయడానికి కావలసిన సమయం ఇవ్వకుండానే హడావుడిగా కేవలం రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్ళడం కూడా ఈ పరిస్థితికి దారి తీసిందనే విమర్శను కొట్టిపారేయలేం. ముఖ్యంగా చాలా డివిజన్లలో ఉద్దేశ్యపూర్వకంగానే ఎందరో ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. నేటి ఎన్నికల్లో చాలా చోట్ల స్లిప్పులు ఉన్నప్పటికీ ఓటరు లిస్టులో తమ పేర్లు లేవంటూ అనేకమంది ఓటర్లు నిరాశతో వెనుదిరగడం చూస్తే ఈ ఆరోపణలు నిజమని నమ్మక తప్పడం లేదు. ఈ పరిస్థితి ఓటర్లను నిరాశకు గురిచేసి పోలింగ్ బూత్‌లకు రాకుండా చేసింది. ఇది గాక, చాలా పోలింగ్ బూత్‌‌లలో కోవిడ్ సన్నద్ధత కనిపించలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇది కూడా ఓటర్లను భయపెట్టింది. మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో టీఆరెస్ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరించిందని అందరికీ స్పష్టమైంది.’’ అని విజయశాంతి సోషల్ మీడియాలో స్పందించారు. 




Updated Date - 2020-12-02T00:50:39+05:30 IST