బంధువుకు వీడియోకాల్ చేసి యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-06-22T09:01:52+05:30 IST
ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు బతకాలని లేదంటూ బంధువుకు వీడియోకాల్ ..

వారు వెళ్లేలోపే మృతి.. 4నెలల క్రితమే వివాహం
ఆర్థిక ఇబ్బందులతో కొన్నాళ్లుగా మనోవేదన
సరూర్‌నగర్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు బతకాలని లేదంటూ బంధువుకు వీడియోకాల్ చేసి.. ఉరి ఏర్పాట్లను చూపించి మరీ ఉరేసుకున్నాడు. హైదరాబాద్ మీర్‌పేట్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మృతుడు 28 ఏళ్ల లావుడ్య సంతోష్. అతడి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట. బాలాపూర్ మండలం మీర్‌పేట్‌లోని త్రివేణినగర్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం అతడికి మహబూబ్‌నగర్‌కు చెందిన యువతితో వివాహం జరిగింది. లాక్‌డౌన్ కారణంగా మొన్నటి దాకా ఊళ్లోనే ఉన్న సంతోష్ రెండు వారాల క్రితం భార్యను అక్కడే ఉంచి ఒక్కడే త్రివేణినగర్‌కు వచ్చాడు.. ఆయన ఇంటి పక్కనే దగ్గరి బంధువులు.. అత్తామామ వరుసయ్యే రాజు, శాంతాబాయి కుటుంబం ఉంటోంది.
ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సంతోష్ తన అత్త శాంతాబాయికి వాట్సాప్ వీడియో కాల్ చేసి ఆర్థిక ఇబ్బందులతో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని చెబుతూ ఉరేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఆమెకు చూపించి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. వెంటనే ఆమె ఈ విషయం తన కొడుకు ప్రవీణ్‌కు చెప్పగా, అతడు తన స్నేహితుడు సందీ్‌పతో కలిసి సంతోష్ ఇంటికి వెళ్లాడు. అప్పటికే సంతోష్ ఉరేసుకుని చనిపోయి కనిపించాడు. శాంతాబాయి భర్త రాజు ఈ విషయాన్ని సంతోష్ కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని రోదించారు. అతడి ఆత్మహత్యపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆర్థిక ఇబ్బందులే కారణమని పేర్కొంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ యాదయ్య చెప్పారు.