చనిపోయినా మంచంపైనే!!

ABN , First Publish Date - 2020-07-15T08:24:40+05:30 IST

అసలే కరోనా కాలం. చిన్న నిర్లక్ష్యానికి కూడా ఇన్ఫెక్షన్‌ రూపంలో పెద్ద పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సిన దుస్థితి!! ఇవన్నీ తెలిసిన వైద్య నిపుణులు ఉండే

చనిపోయినా మంచంపైనే!!

  • ‘గాంధీ’లో గంటల కొద్దీ మంచంపైనే కొవిడ్‌ రోగి మృతదేహం 
  • దుర్వాసన వస్తోందంటూ.. వార్డు బయటికి  తోటి రోగుల పరుగులు
  • సోషల్‌ మీడియాలో వీడియో హల్‌చల్‌
  • జాప్యం వాస్తవమే: సూపరింటెండెంట్‌

అడ్డగుట్ట, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : అసలే కరోనా కాలం. చిన్న నిర్లక్ష్యానికి కూడా ఇన్ఫెక్షన్‌ రూపంలో పెద్ద పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సిన దుస్థితి!! ఇవన్నీ తెలిసిన వైద్య నిపుణులు ఉండే గాంధీ ఆస్పత్రిలోనే నిర్లక్ష్యం తాండవిస్తోంది. మంగళవారం సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన హైదరాబాద్‌కు చెందిన కొవిడ్‌ రోగి శ్రీనివాస్‌ మృతదేహం సాక్షిగా .. ఇన్ఫెక్షన్‌తో చనిపోయిన వారి భౌతికకాయాలను తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. శ్రీనివాస్‌ చికిత్సపొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూయగా, రాత్రి 8 గంటల వరకు ఆయన మృతదేహాన్ని మంచంపై నుంచి తొలగించడంపై ఏ ఒక్కరూ దృష్టి పెట్టలేదు. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో.. ఆ వార్డులో ఉన్న ఇతర కొవిడ్‌ రోగులు బయటికి వెళ్లిపోయారంటూ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నర్సులు, వార్డు బాయిలు, నాలుగో తరగతి సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మంగళవారం సమ్మెకు దిగడంతో గాంధీ ఆస్పత్రిలో పలు సేవలు స్తంభించాయి. కరోనాతో చనిపోయిన వారికి కనీసం అంత్యక్రియలైనా సకాలంలో నిర్వహించలేని పరిస్థితి ఎదురైంది. అయితే ఇటువంటి ఘటనలు ఇతర రోగులతో పాటు వైద్యులు, ఆరోగ్య సిబ్బందికీ ఇన్ఫెక్షన్‌ ముప్పును కొని తెచ్చే అవకాశాలు ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, శ్రీనివాస్‌ అనే వ్యక్తి మృతదేహం తరలింపులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని ఆస్పత్రి సూపరింటెండెంట్‌, ప్రొఫెసర్‌ రాజారావు అంగీకరించారు. అయితే ఒక్క రోజులోనే మృతదేహం నుంచి దుర్వాసన రాదని స్పష్టం చేశారు. దీనిపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవికత లేదన్నారు. కొవిడ్‌తో చనిపోతే తరలించేందుకు ఆస్పత్రిలో నలుగురే పనిచేస్తారని, సమ్మె కారణంగా ఒక్కరే ఉండటంతో కాస్త జాప్యం జరిగిందని చెప్పారు. 

Updated Date - 2020-07-15T08:24:40+05:30 IST