హరిత భవనాల ఆవశ్యకతపై చైతన్యం పెంచాలి: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-12-16T00:32:54+05:30 IST

పన్ను ప్రోత్సాహకాల ద్వారా హరిత భవనాల నిర్మాణాల ఆవశ్యకతపై చైతన్యం పెంచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

హరిత భవనాల ఆవశ్యకతపై చైతన్యం పెంచాలి: ఉపరాష్ట్రపతి

హైదరాబాద్: పన్ను ప్రోత్సాహకాల ద్వారా హరిత భవనాల నిర్మాణాల ఆవశ్యకతపై చైతన్యం పెంచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. 12వ ‘గృహ’ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడారు. ‘ఏక గవాక్ష విధానంతో హరిత భవనాలకు త్వరితగతిన అనుమతులు అందించాలి. భవిష్యత్తులో నిర్మాణాలు హరిత సాంకేతికతతో కొనసాగేలా మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరగాలి. ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యమివ్వడం మనందరి బాధ్యత’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.


‘ఈ ఏడాది కరోనా సృష్టించిన సమస్యలు, అదే సమయంలో వరదలు, కరవుకాటకాలు, ఉత్కృష్ట వాతావరణ పరిస్థితుల కారణంగా ఎన్నో సమస్యలను మనం చూశాం. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను వీలైనంతగా నివారించేందుకు ఇవాళ మనం చేసే పనులు మన తర్వాతి తరాలకు మేలు చేసేవిగా ఉండేలా మన ఆలోచనా విధానాన్ని పున:సమీక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. 2050 నాటికి భారతదేశంలో దాదాపు 50శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తుంది. ఇందుకు తగినట్లుగా గృహనిర్మాణ రంగంలో హరిత సాంకేతికత వినియోగాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది’ అని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి, గృహ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ అజయ్ మాథుర్, గృహ కౌన్సిల్ డైరెక్టర్ సీఈవో శ్రీ సంజయ్ సేథ్‌తో పాటు నిర్మాణరంగ ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T00:32:54+05:30 IST