‘జగన్ మంచిపేరు తెచ్చుకో.. మీ నాన్న ప్రతిష్ట దెబ్బ తీయకు’
ABN , First Publish Date - 2020-05-29T22:12:00+05:30 IST
ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ఇవాళ హైకోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే...

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ఇవాళ హైకోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను కొనసాగించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ తీర్పుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు స్పందించారు. ‘హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా రమేష్ కుమార్ని కొనసాగించి జగన్ మంచిపేరు తెచ్చుకో. నీ నిర్ణయాలతో మీ నాన్న రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీయకు’ అని ఆయన సూచించారు. ఇవాళ హైదరాబాద్లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడిన ఆయన.. ఏపీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానన్నారు. ఆర్డినెన్స్ ద్వారా తొలగించడంతోనే వివాదం మొదలైందన్నారు.
చెడ్డపేరు తెచ్చుకోవద్దు..!
‘ప్రజలకు ఇచ్చిన హామీలపై సీఎం వైఎస్ జగన్ దృష్టి పెట్టాలి. వైఎస్ కొడుకని ప్రజలు జగన్కు ఒక అవకాశం ఇచ్చారు. చెప్పుడు మాటలతో తప్పుడు నిర్ణయాలతో చెడ్డపేరు తెచ్చుకోవద్దు. జగన్ తొందరపాటు నిర్ణయాల వల్ల కోర్టులో మొట్టికాయలు పడుతున్నాయి. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయాన్ని జగన్ పునరాలోచించుకోవాలి. కోర్టులను కూడా తప్పుపడతామంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్య దేశం అని గుర్తుంచుకోవాలి. జగన్ వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల సమస్యలొస్తున్నాయి’ అని వీహెచ్ చెప్పుకొచ్చారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడిన ఆయన.. ఎల్లంపల్లి నీటిని కొండపోచమ్మకు తెచ్చి కాళేశ్వరం నీళ్ళని చెబుతున్నారని విమర్శలు గుప్పించారు. పోతిరెడ్డిపాడుపై కూడా కేసీఆర్ దృష్టి పెట్టి దక్షిణ తెలంగాణను ఎడారి కాకుండా కాపాడాలని ఆయన సూచించారు. గాంధీ హాస్పిటల్కు వెళ్లి డాక్టర్లకు కూడా సీఎం భరోసా ఇవ్వాలన్నారు.