కూరగాయల ధరలతో కునారిల్లుతున్న సామాన్యులు

ABN , First Publish Date - 2020-10-04T20:45:37+05:30 IST

కూరగాయల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోవడంతో కూరగాయల ఉత్పత్తులు బాగా తగ్గిపోయాయి.

కూరగాయల ధరలతో కునారిల్లుతున్న సామాన్యులు

హైదరాబాద్‌: కూరగాయల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోవడంతో కూరగాయల ఉత్పత్తులు బాగా తగ్గిపోయాయి. ఇప్పటికే ముఖ్యమైన పలు రకాల కూరగాయలు ధరలు భారీగా పెరిగాయి. ఏది కొనాలన్నా ధరలు భగ్గుమంటున్నాయి. ఒక దశలో టమాటా కిలో 60 రూపాయలకు తక్కువగా దొరకలేదు. అలాగే ప్రస్తుతం బీన్నీసు కిలో 100 రూపాయలు, చిక్కుడుకాయ 80 రూపాయలు, గోకర కాయ కిలో 60 రూపాయలు, ఆలుగడ్డ 40 రూపాయలు, బెండకాయ 40రూపాయలు, బీరకాయ 40 రూపాయలు పచ్చిమిర్చి కిలో 60 రూపాయలకు అమ్ముతున్నారు. మార్కెట్‌కు వెళ్తే ఏ వస్తువు కూడా 50రూపాయలకు తక్కువ పలకడం లేదు. 


ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్‌కు వచ్చే కూరగాయల ఉత్పత్తులు 50శాతానికి పైగా పడిపోయినట్టు మార్కెటింగ్‌ శాఖ అధికారి ఒకరు తెలిపారు. డిమాండ్‌కు తగ్గట్టుగా కూరగాయల దిగుమతి లేక పోవడంతో కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో కూరగాయల కొరత ఏర్పడిందని అధికారులు తెలిపారు. అయితే వర్షాలు కాస్త తగ్గడంతో ఇప్పటికే రైతులు పెద్దయెత్తున కూరగాయల సాగు చేస్తున్నారు. మరో నెల రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాపారులు తెలిపారు. కొత్త పంట మార్కెట్‌కు చేరుకుంటే ధరలు కాస్త తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. 

Updated Date - 2020-10-04T20:45:37+05:30 IST