ఊపిరి ఆడట్లేదు

ABN , First Publish Date - 2020-09-14T08:49:26+05:30 IST

రాష్ట్రంలో కరోనా బారిన పడి వెంటిలేటర్‌ చికిత్స పొందుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. జూలై 27న ప్రభుత్వం తొలిసారి..

ఊపిరి ఆడట్లేదు

  • ఆగస్టులో 42%.. ఇప్పుడు 47%
  • 7 జిల్లాల్లో సర్కారీ దవాఖానల్లో
  • నిండిపోయిన వెంటిలేటర్‌ పడకలు
  • నల్లగొండ జిల్లాలో సమస్య తీవ్రం 
  • ప్రైవేటులో అధిక చార్జీలతో జేబులు గుల్ల
  • ఆక్సిజన్‌ పడకలదీ అదే పరిస్థితి
  • కొత్త కేసులు 2216.. మరణాలు 11

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా బారిన పడి వెంటిలేటర్‌ చికిత్స పొందుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. జూలై 27న ప్రభుత్వం తొలిసారి.. బులెటిన్‌లో వెంటిలేటర్ల సంఖ్య, వాటిపై చికిత్స పొందుతున్నవారి వివరాలు ఇచ్చింది. దాని ప్రకారం అప్పటికి రాష్ట్రంలో ప్రైవేటులో 472 మంది, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 272 మంది వెంటిలేటర్‌ చికిత్స పొందుతున్నారు. రెండూ కలిపితే.. జూలై 27 నాటికి.. వారి సంఖ్య 744. ప్రస్తుతం ఆ సంఖ్య 1579కి పెరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి వెంటిలేటర్‌/సీపాప్‌ సదుపాయం ఉన్న ఐసీయూ పడకలు 3,304 ఉండగా.. వాటిలో 1579 నిండిపోయాయి. ఆగస్టు 1 నాటికి 42 శాతంగా ఉన్న వెంటిలేటర్‌ పడకల ఆక్యుపెన్సీ.. ఇప్పుడు 47 శాతానికి పెరగడం గమనార్హం. జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడమే ఇందుకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. మొదట్లో హైదరాబాద్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ పరిధి కన్నా జిల్లాల్లోనే ఎక్కువగా పాజిటివ్‌లు వస్తున్నాయి.


కరోనాపై అవగాహన లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు చాలా ఆలస్యంగా ఆస్పత్రులకు వస్తుండడంతో.. వారికి ఆక్సిజన్‌ చికిత్స, వెంటిలేటర్‌ చికిత్స అవసరం అవుతోంది. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్రంలోనే ఏడు జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌ సదుపాయం ఉన్న ఐసీయూ పడకలన్నీ ఫుల్‌ అయ్యాయి. ముఖ్యంగా నల్గొండజిల్లాలో అయితే ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్‌)తో పాటు.. మిర్యాలగూడలో ఉన్న ఒకే ఒక్క ప్రైవేటు ఆస్పత్రిలో కూడా వెంటిలేటర్‌ పడకలు నిండుకున్నాయి! అక్కడ మిగిలింది మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో ఐదు పడకలు మాత్రమే. ఇక.. సూర్యాపేట (25), సిరిసిల్ల (10), నాగర్‌ కర్నూల్‌ (8), మహబూబాబాద్‌ (12), గద్వాల (5), భద్రాద్రి (4) జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం అన్ని వెంటిలేటర్‌ పడకలూ ఫుల్‌ అయ్యాయి. అక్కడ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేవారిలో ఎవరికైనా వెంటిలేటర్‌ అవసరమైతే ప్రైవేటుకు వెళ్లాల్సిన పరిస్థితి. అలా వెళ్తే జేబులు అధిక చార్జీల దెబ్బకు జేబులు గుల్ల అవుతున్నాయి. పాలమూరు (35 పడకలకు 21 ఫుల్‌), హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి (500 పడకలకు 445 ఫుల్‌) వంటి చోట్ల శరవేగంగా ఐసీయూ పడకలు ఫుల్‌ అవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి.


ఆక్సిజన్‌ పడకలూ..

ఆక్సిజన్‌ పడకల విషయానికొస్తే...  ప్రస్తుతం ఖమ్మం జిల్లా  ఆస్పత్రిలో  120 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉండగా.. అన్నీ నిండిపోయాయి. అలాగే పాలమూరులో (65), నల్గొండ (35), నిజామాబాద్‌ (205), సిరిసిల్ల (22), సూర్యాపేట (40)లోని ఆక్సిజన్‌ పడకలన్నీ నిండిపోయాయి.


ఇదీ లెక్క

ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల్లో 1224 వెంటిలెటర్స్‌ అందుబాటులో ఉండగా అందులో 670 మంది రోగులున్నారు. ప్రైవేటులో 2078 వెంటిలెటర్స్‌ ఉంటే అందులో 909 మంది చికిత్స పొందుతున్నారు.

సెప్టెంబరు 1 నాటికి ప్రైవేటు ఆస్పత్రుల్లో 1980 వెంటిలెటర్స్‌ బెడ్స్‌ ఉండగా.. 833 మంది చికిత్స పొందుతున్నారు. అదే రోజు సర్కారీ దవాఖానల్లో 1224 బెడ్స్‌కుగాను 668 మంది చికిత్స పొందుతున్నారు.

ఆగస్టు 1 నాటికి సర్కారీలో కేవలం 272 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. మిగిలిన బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. అదే ప్రైవేటు ఆస్పత్రుల్లో  1218 వెంటిలెటర్స్‌ ఉంటే 765 మంది చికిత్స పొందుతున్నారు.


  • కేసులు 2216.. మరణాలు 11
  • 1.57 లక్షలకు చేరిన కేసులు
  • కోలుకున్నవారు 1.24 లక్షలు

రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2216 పాజిటివ్‌లు నమోదయ్యాయి. 11 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 1,57,096కు, మరణాల సంఖ్య 961కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో.. హైదరాబాద్‌లో అత్యధికంగా 341 కేసులు రాగా,  కరీంనగర్‌లో 119, ఖమ్మంలో 105, మేడ్చల్‌లో 148, నల్గొండలో 126, రంగారెడ్డిలో 210, వరంగల్‌ అర్బన్‌లో 102 కేసులు వచ్చాయి. కాగా.. కరోనా నుంచి కోలుకున్న 2603 మంది శనివారం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యి ఇళ్లకు వెళ్లారు. వారితో కలిపి.. రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 1,24,528కి చేరుకుంది.

Updated Date - 2020-09-14T08:49:26+05:30 IST