నేలమీద వెల్లకిలా ముత్తిరెడ్డి
ABN , First Publish Date - 2020-12-13T07:58:37+05:30 IST
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. అభివృద్ధి పనులపై ప్రజలు నిలదీయడంతో సమాధానం చెప్పలేకపోయారు. పైగా తనను ప్రశ్నించినవారిపైనే అసహనం వ్యక్తం చేస్తూ తాను నిల్చున్నచోటే నేలపై వెల్లకిలా పడుకొని నిరసన

పనులపై ప్రజలు ప్రశ్నించడంతో అసహనం.. పడుకొని నిరసన
యశ్వంతాపురం చెక్‌డ్యాం శంకుస్థాపన కార్యక్రమంలో ఘటన
ఎమ్మెల్యే తీరుతో అవాక్కయిన గ్రామ ప్రజలు
జనగామ టౌన్, డిసెంబరు 12: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. అభివృద్ధి పనులపై ప్రజలు నిలదీయడంతో సమాధానం చెప్పలేకపోయారు. పైగా తనను ప్రశ్నించినవారిపైనే అసహనం వ్యక్తం చేస్తూ తాను నిల్చున్నచోటే నేలపై వెల్లకిలా పడుకొని నిరసన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి సహకరిస్తామని మాటిస్తేనే తప్ప తాను పైకి లేచేది లేదని మొండికేశారు. ముత్తిరెడ్డి చేష్టతో అక్కడి ప్రజలు అవాక్కయ్యారు.
శనివారం జనగామ రూరల్ మండలం యశ్వంతాపురంలో చెక్‌డ్యాం శంకుస్థాపనకు ముత్తిరెడ్డి హాజరయ్యారు. అక్కడికి మాజీ సర్పంచ్ బొట్ల సుశీల (టీఆర్‌ఎస్) ఆధ్వర్యంలో ఆ ఊరి రైతులు వచ్చి, గ్రామానికి చెందిన వాగులోకి జనగామ మునిసిపాలిటీ పరిధిలోని మురికినీరు మళ్లించే పైపులైను నిర్మాణం పనులను నిలిపివేయాలని కోరారు. ఇప్పటికే హైకోర్టు ద్వారా స్టే ఆర్డర్ పొందామని సుశీల చెప్పారు. ఈ సమస్యను తేల్చేదాకా చెక్‌డ్యాం శంకుస్థాపన చేయొద్దని ఆమె కోరారు.
అంతావిన్న ముత్తిరెడ్డి... కోర్టు స్టేలతో గ్రామాభివృద్ధిని అడ్డుకోవడం సమంజసం కాదంటూ ఒక్కసారిగా నేలపై పడుకొని నిరసన తెలిపారు. గ్రామాభివృద్ధికి తాను సహకరిస్తానని ఆమె చెప్పడంతో ఎమ్మెల్యే తన నిరసనను విరమించి పైకి లేచారు. అనంతరం గ్రామ వాగులోకి మునిసిపాలిటీ మురికినీరు రాకుండా ప్రత్యామ్నాయంగా ఫిల్టర్‌బెడ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.