గల్ఫ్ నుంచి వచ్చినా దక్కని తల్లి చివరి చూపు
ABN , First Publish Date - 2020-05-13T09:33:07+05:30 IST
తల్లి గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోయిందన్న సమాచారంతో కుడిమెళ్లి రమేశ్ కుమార్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఆఘమేఘాల మీద హైదరాబాద్ వచ్చాడు.

- కర్మకాండలకూ అనుమతివ్వని అధికారులు
- క్వారంటైన్ పేరుతో హోటల్‌కే పరిమితం
- యూఏఈ నుంచి వచ్చిన ప్రవాసీ ఆవేదన
(గల్ఫ్ నుంచి అంధ్రజ్యోతి ప్రతినిధి)
తల్లి గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోయిందన్న సమాచారంతో కుడిమెళ్లి రమేశ్ కుమార్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఆఘమేఘాల మీద హైదరాబాద్ వచ్చాడు. ప్రభుత్వం ప్రారంభించిన ‘వందే భారత్ మిషన్’లోనూ కుటుంబ సభ్యులు మరణించిన ప్రవాసీయులకు ప్రాధాన్యత ఇవ్వడంతో యూఏఈలోని ఒక ఉన్నత సాంకేతిక కళాశాలలో పని చేస్తున్న రమేశ్ సోమవారం తొలి విమానంలోనే దిగాడు. అయితే, కరోనా భయం, కాలనీ వాసుల ఒత్తిడితో తాను రాకముందే రామంతాపూర్‌లో తల్లి అంత్యక్రియలు పూర్తి చేశారని కుటుంబ సభ్యులు ఫోన్‌లో చెప్పడంతో చివరి చూపునకూ నోచుకోలేకపోయాడు. కనీసం కర్మకాండల్లో పాల్గొనాలన్న అతడి కోరికనూ అధికారులు క్వారంటైన్ పేరుతో అణిచేస్తున్నారు.
తనను శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్ క్వారంటైన్‌కు తరలించారని రమేశ్ పేర్కొన్నాడు. తన తల్లికి తాను ఏకైక కుమారుడినని కర్మకాండల్లో పాల్గొనేందుకు రెండు రోజుల అనుమతి ఇవ్వాలని కోరినా అధికారులు అంగీకరించడం లేదని ఆవేదన చెందాడు. తనకు కరోనా పరీక్షలు నిర్వహించాలని, నెగెటివ్ వస్తేనే ఇంటికెళ్తానని, పీపీఈ ధరించడంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పినా అధికారులు ససేమిరా అంటున్నారని వాపోయాడు. 14 రోజుల క్వారంటైన్‌తో దశదిన కర్మలోనూ పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని, తనకు యూఏఈలోని భారతీయ ఎంబసీ, ఐసీఎస్ ప్రతినిధి శ్రీనివాసరావుల సహకారంతో తొలి ప్రాధాన్యత కింద తీసుకొచ్చి ఏం ప్రయోజనం అని అధికారులను రమేశ్ ప్రశ్నిస్తున్నాడు.