10 వేల కేంద్రాల్లో టీకా

ABN , First Publish Date - 2020-12-10T07:40:19+05:30 IST

ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ త్వరలోనే తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో జనవరి రెండో వారం నుంచి వైద్యసిబ్బందికి కరోనా టీకాలివ్వనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత వేగవంతం చేశాయి. రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమ ఇన్‌చార్జిగా

10 వేల కేంద్రాల్లో టీకా

2 కోట్ల డోసుల నిల్వకు సరిపడా ఏర్పాట్లు

పీహెచ్‌సీ స్థాయుల్లో 857 కేంద్రాలు

టీకా అందిన 24 గంటల్లోగా వ్యాక్సినేషన్‌

తొలుత వైద్యసిబ్బందికి టీకా ఇస్తాం

ఇప్పటికే 2.75 లక్షల మందిని గుర్తించాం

రెండో దశలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా

ప్రభుత్వ డేటాతో 60 ఏళ్లు దాటినవారి గుర్తింపు

లబ్ధిదారులు కానివారికి స్వీయ నమోదుకు చాన్స్‌

ప్రజలకు టీకా స్వచ్ఛందమే, నిర్బంధం కాదు

ఒకసారి తీసుకుంటే 9-12 నెలలు రక్షణ

సాధారణ ప్రజలకు అందుబాటులోకి

రావడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది పట్టొచ్చు

వ్యాక్సిన్‌ వచ్చినా జాగ్రత్తలు తప్పనిసరి

‘ఆంధ్రజ్యోతి’కి ప్రజారోగ్య సంచాలకుడు

డాక్టర్‌ ‌ గడల శ్రీనివాసరావు ప్రత్యేక ఇంటర్వ్యూ


హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ త్వరలోనే తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో జనవరి రెండో వారం నుంచి వైద్యసిబ్బందికి కరోనా టీకాలివ్వనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత వేగవంతం చేశాయి. రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమ ఇన్‌చార్జిగా ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావుకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో టీకాల నిల్వ, ఎప్పటి నుంచి టీకా కార్యక్రమం మొదలవుతుంది? మనకు వచ్చే వ్యాక్సిన్‌ ఏమిటి? తదితర అంశాలపై ఆయన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వివరించారు. 


టీకాలు ఇవ్వడానికి ప్రణాళికలు ఏమిటి?

సీఎం కేసీఆర్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ఇప్పటికే సమీక్ష చేసి, మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏర్పాట్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం రెండు వారాలుగా టీకా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ద్వారా ముందుగా లబ్ధిదారులను గుర్తిస్తున్నాం. తొలి దశలో నాలుగు వర్గాల వారికి టీకాలిస్తాం. హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ (వైద్యులు, వైద్య సిబ్బంది), ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ (పోలీసులు, భద్రతా సిబ్బంది, శానిటరీ సిబ్బంది తదితరులు), మూడో కేటగిరీ.. 60 దాటిన వారు, 50-60 ఏళ్ల మధ్య ఉన్నవారు, నాలుగో కేటగిరీ.. 50 ఏళ్లలోపు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు. వీరిలో హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ 2.75 లక్షలమందిని ఇప్పటికే గుర్తించాం. వారి వివరాలను కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేశాం. వారికి ఎక్కడ, ఏ రోజు, ఎన్ని గంటలకు టీకా వేస్తారన్నది మెసేజ్‌ వెళ్తుంది. తొలి డోసు అయ్యాక ఫోన్‌కు లింకు వస్తుంది. రెండో డోసు తర్వాత టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్‌ ఇస్తాం. 


తొలిదశలో మొత్తం ఎంతమందికి ఇస్తారు?

మనకున్న అంచనాల మేరకు నాలుగు రకాల గ్రూపుల్లో కలిపి 80 లక్షల మందికి టీకా ఇవ్వాల్సి ఉంది. ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పున 1.60 కోట్ల డోసులు అవసరం. రాష్ట్ర జనాభాలో 20ు తొలి దశ టీకా కార్యక్రమంలో కవర్‌ అవుతారు. జనవరి రెండోవారం నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు టీకాలిస్తాం. అవసరమైతే ఈ 80 లక్షల మందికీ 10 రోజుల వ్యవఽఽధిలోనే టీకాలిచ్చేలా యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నాం.


ఏర్పాట్లు ఎంతవరకూ వచ్చాయి?

రాష్ట్ర వ్యాప్తంగా పదివేల టీకా కేంద్రాలను ఏర్పాటు చేశాం. రెండు కోట్ల డోసులు నిల్వ ఉంచేలా కోల్డ్‌స్టోరేజ్‌ వ్యవస్థను సిద్ధం చేస్తున్నాం. మామూలుగా జరిగే సార్వత్రిక టీకాల కార్యక్రమానికి ఎటువంటి అవాంతరం లేకుండా.. వేరేగా కొవిడ్‌ కోల్డ్‌ స్టోరేజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. తొమ్మిది రీజినల్‌ వ్యాక్సిన్‌ స్టోర్స్‌ను ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాం. ప్రజారోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) స్థాయుల్లో 857 కోల్డ్‌ చైన్‌ పాయింట్స్‌ ఏర్పాటు చేశాం. పీహెచ్‌సీలో టీకా నిల్వ కోసం ఒక వాకింగ్‌ కూలర్‌ ఉంటుంది. ఇప్పటికే ఉన్నవాటితోపాటు కొత్తగా 436 వాకింగ్‌ కూలర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. టీకా పంపేందుకు అవసరమైన రవాణా వ్యవస్థను సిద్ధం చేశాం. అలాగే రెండుకోట్ల సిరంజీల నిల్వకు, వివిధ స్థాయుల్లో వ్యాక్సిన్‌ నిల్వకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశాం.  


కొవిడ్‌ టీకా సురక్షితమేనా? 

ఒక సురక్షితమైన వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి రావాలంటే మూడు నుంచి ఐదేళ్లు పడుతుంది. ప్రస్తుతం కరోనా టీకాను ఏడాదిలోగానే తీసుకొస్తున్నారు. ఇంకా ట్రయల్స్‌ కూడా పూర్తికాలేదు. అందుబాటులోకి వస్తున్న టీకాలను కూడా ప్రపంచవ్యాప్తంగా 20-25 వేల మందిపైనే ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. అయితే, ఇలాంటి అత్యవసర సమయాల్లో మనకున్న సురక్షితమైన మందుల్లో ఒకదాన్ని ఇచ్చి కాపాడుకుంటాం. ఇదీ అంతే. ప్రస్తుతం వచ్చే వ్యాక్సిన్‌ వల్ల కూడా అప్పటికప్పుడు ఎంతోకొంత ప్రతికూల స్పందన వచ్చే ప్రమాదం లేకపోలేదు. అయితే.. అలాంటివి తక్కువ శాతం ఉంటాయి. టీకా వేయించుకున్నచోట దురద రావడం, కొద్దిపాటి  జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి ఉండొచ్చు. వాటి గురించి భయాందోళనలు అనవసరం. అయినప్పటికీ, అలాంటి కేసుల కోసం ముందు జాగ్రత్త చర్యగా టీకా కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నాం. మనకు వచ్చే టీకాలు ఎంతవరకూ ప్రభావవంతం అనే విషయం తెలియడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. లక్షలాది మందికి ఇచ్చిన తర్వాతే సైడ్‌ ఎఫెక్ట్సు వచ్చాయో లేదో తెలుస్తుంది.


మనకొచ్చే వ్యాక్సిన్‌ ఏది? 

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకా), ఫైజర్‌ కంపెనీ, భారత్‌ బయోటెక్‌.. తమ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగ అనుమతుల కోసం దరఖాస్తు చేసి భారత ఔషధ సంస్థ తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతానికి మూడు రకాల టీకాలు అందుబాటులోకి రాబోతున్నా మున్ముందు అవి పదుల సంఖ్యలో ఉండబోతున్నాయి.  తొలుత వచ్చేదే ఉత్తమ వ్యాక్సిన్‌ అనుకోవడానికి వీల్లేదు.  మనకొచ్చేది ఏ కంపెనీ టీకా అనే విషయంపై స్పష్టత రాలేదు. టీకాకు ఎక్స్‌ఫైరీ తేదీ ఏడాది ఉంటుంది.


టీకా వినియోగంపై మార్గదర్శకాలు వచ్చాయా?

కేంద్రం 2 వారాలుగా కొవిడ్‌ టీకాపై నిరంతరం సమీక్ష చేస్తోంది. టీకాలకు సంబంఽధించిన కోర్‌ గైడ్‌లైన్స్‌ను సిద్ధం చేసింది. ఒకటి రెండు రోజుల్లో వాటిని విడుదల చేయనుంది. అవి వచ్చాక స్థానిక భాషల్లోకి తర్జుమా చేస్తాం. టీకా అందిన 24 గంటల్లోనే లక్ష్యిత వర్గాలవారికి అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.


లక్ష్యిత లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు?

వైద్యసిబ్బందిలో 2.75 లక్షల మందిని ఇప్పటికే గుర్తించాం. 60 ఏళ్లు దాటినవారి వివరాలను ప్రభుత్వ పథకాలలో ఉన్న లబ్ధిదారుల డేటా ఆధారంగా సేకరించనున్నాం. అందులో కవర్‌ కానివారికి స్వీయ నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. అంటే.. 60 ఏళ్లు దాటి, ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులు కానివారు స్వయంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 


ప్రభావం ఎంత కాలం ఉంటుంది?

కొన్ని టీకాలు తొలి డోసు తీసుకున్న మూడువారాలకు రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. మరికొన్నింటిలో రెండో డోసు నాలుగువారాల తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మనకు వచ్చిన వ్యాక్సిన్‌ మా ర్గదర్శకాల ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది.  రెండో డోసు తీసుకున్నాకే పూర్థిస్థాయి రక్షణ ఉంటుంది. కరోనా టీకా ఒకసారి తీసుకుంటే 9 నుంచి 12 నెలల వరకు ఆ వైరస్‌ నుంచి రక్షణ ఉంటుంది. 


ఎక్కువ మంది తీసుకోకుంటే..?

వైరస్‌ వల్ల కలిగిన ఆర్థిక, కుటుంబ నష్టాలపై అందరికీ అవగాహన ఉంది. జీవితాంతం ఈ వైర్‌సతో బతికే పరిస్థితి లేదు. ఇలాంటి వైర్‌సకు అడ్డుకట్ట పడేది టీకాలతోనే. కాబట్టి అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందేనని కోరుతున్నాం.


మన వాతావరణానికి ఏ టీకా సరిపోతుంది? 

మన వాతావరణ పరిస్థ్థితులకు మైనస్‌ 2-8 డిగ్రీల టెంపరేచర్‌లో ఉంచే వ్యాక్సిన్‌ అయితే సరిపోతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఇటువంటి కోల్డ్‌ స్టోరేజ్‌నే అభివృద్ధి చేసి పెట్టుకోవాలని మాకు సూచించింది. 


సాధారణ ప్రజలకు టీకా ఎప్పటి నుంచి..?

కేంద్రం చెబుతున్నదాని బట్టి ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన వ్యాక్సిన్‌ కాదు ఇది. వైరస్‌ బారినపడి చనిపోయిన వారిలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారే ఉన్నారు. ప్రస్తుతం ఇటువంటి వారిని రక్షించుకోవాలి. ఇక సాధారణ ప్రజలకు ఈ టీకా అందుబాటులోకి రావాలంటే కనీసం 6 మాసాల నుంచి ఏడాది పట్టవచ్చు. రాబోయే రోజుల్లో ప్రైవేట్‌ రంగంలో కూడా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుంది.


టీకా వచ్చిన తర్వాత కూడా కొద్ది నెలల పాటు ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందే. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, సమూహాలకు దూరంగా ఉండటం లాంటివి పాటించాలి. వ్యాక్సిన్‌ వేసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండవద్దని ప్రజలను కోరుతున్నాం.

Updated Date - 2020-12-10T07:40:19+05:30 IST