కేసీఆర్ ప్రకటన రైతుల్ని అవమానపర్చేలా ఉంది: ఉత్తమ్
ABN , First Publish Date - 2020-12-29T21:03:36+05:30 IST
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన రైతులను అవమాన పర్చేలా ఉందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన రైతులను అవమాన పర్చేలా ఉందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ ప్రకటన నిజమైతే కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. జనాభాలో 70 శాతం ఉన్న రైతుల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఎందుకు? మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందని చెప్పడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను 2004లో కాంగ్రెస్ ప్రారంభించిందని గుర్తుచేశారు. కరోనా నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పిన అధికారులకు జ్ఞానం ఉండాలని వ్యాఖ్యానించారు.
అన్ని విషయాల్లో టీఆర్ఎస్ కేంద్రానికి మద్దతు ఇచ్చిందని ఉత్తమ్ పేర్కొన్నారు. కేసీఆర్ అసమర్థత వల్ల పంట బీమా రద్దు అయిందని తెలిపారు. రేపటి నుంచి జనవరి 7వరకు మండల కేంద్రాల్లో నిరసన తెలిపి తహశీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. జనవరి 11న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు .. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. జనవరి 18న రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.