కులాలవారీ జనాభా గణనకు కేంద్రం సుముఖత
ABN , First Publish Date - 2020-10-04T07:30:11+05:30 IST
దేశ జనాభా గణనలో కులాలవారీ లెక్కలు తీసేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా ఉందని జాతీయ బీసీ ..
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): దేశ జనాభా గణనలో కులాలవారీ లెక్కలు తీసేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులతోనూ చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఓ ప్రకటనలో వెల్లడించారు. దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో కిషన్‌రెడ్డిని శనివారం కృష్ణయ్య కలిశారు. దేశ జనాభా గణనలో కులాల వారీ లెక్కలు తీయాలని మంత్రిని కోరారు. బీసీ కులాల జనాభా లెక్కలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. 2018లో అక్టోబరు 1న జరిగిన కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో జనాభా గణన బీసీ కులాల వారిగా సేకరించాలని నిర్ణయం తీసుకొని, రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎందుకు వెనక్కు తగ్గారని ప్రశ్నించారు.