విపక్ష నేతలదే ఆందోళన

ABN , First Publish Date - 2020-10-03T09:51:23+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో రైతులు లేరని.. విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలే ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

విపక్ష నేతలదే ఆందోళన

వ్యవసాయ చట్టంపై నిరసనల్లో రైతులు లేరు

అన్నదాతల సంక్షేమానికి బీజేపీ కృషి చేస్తుంది

రైతు సంఘాలతో చర్చలకు సిద్ధమే: కిషన్‌రెడ్డి 

వ్యవసాయ చట్టంతో అద్భుతాలు జరగవు: జేపీ


పంజాగుట్ట/హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో రైతులు లేరని.. విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలే ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అన్నదాతల సంక్షేమం, వారి ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది కానీ, అన్యాయం చేయదని చెప్పారు. అమీర్‌పేటలోని ఎన్‌కేఎం గ్రాండ్‌ హోటల్‌లో బీజేపీ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో గురువారం ‘నూతన వ్యవసాయ చట్టం’పై నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాన్ని రైతుల ప్రయోజనం, అభివృద్ధి కోసం రూపొందించామని చెప్పారు. ఇందులో పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన, పార్టీల తరఫున ఎవరైనా సలహాలు, సూచనలు అందిస్తే స్వీకరిస్తామని చెప్పారు.


రైతులు, రైతు సంఘాల నాయకులతో చర్చించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. దేశంలో ఏ ఒక్క రైతు కూడా దీనికి వ్యతిరేకంగా లేరని కిషన్‌రెడ్డి తెలిపారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టం వల్ల అద్భుతాలు జరగవని చెప్పారు. ఈ చట్టాన్ని ఇంకా మార్చాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రైతులకు పంటను ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఇవ్వడం ద్వారా బ్లాక్‌ మార్కెటింగ్‌, ధరలు పెరుగుతాయనడం అవగాహన రాహిత్యమేనన్నారు. ప్రస్తుతం ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి మధ్య దాదాపు ఆరుగురు మధ్యవర్తులు ఉన్నారని.. దీని వల్ల రైతుకు రూ.100కు రూ.20 నుంచి రూ.25 మాత్రమే ఆదాయం వస్తోందన్నారు. దళారులు లేకపోతే అన్నదాతకు రూ.65 దక్కే అవకాశముందన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, సంఘాల నేతలు పాల్గొన్నారు.


దండం పెడతా.. మాస్కులు ధరించండి: కిషన్‌రెడ్డి 

బౌద్ధనగర్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): మీకు దండం పెడతా మాస్కులు ధరించండి అంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సికింద్రాబాద్‌ నియోజకవర్గ కోర్‌ కమిటీ సమావేశం కోసం వారాసిగూడకు వచ్చిన ఆయన చుట్టూ నాయకులు, కార్యకర్తలు గుమిగూడారు. అనంతరం కిషన్‌రెడ్డి హాలు లో సమావేశానికి వెళ్లాక, అక్కడ కూడ చాలా మంది మాస్కులు తీసి ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించారు. దీంతో ‘‘మీకు దండం పెడతా మాస్కులు తీయకుండా మాట్లాడండి, భౌతిక దూరం పాటించండి’’ అని కిషన్‌రెడ్డి కోరారు.

Updated Date - 2020-10-03T09:51:23+05:30 IST