సంప్రదింపుల మధ్యనే చైనా దొంగ దెబ్బ
ABN , First Publish Date - 2020-06-22T09:37:07+05:30 IST
సరిహద్దులో చైనాతో ఘర్షణల్లో వీర మరణం పొందిన మన సైనికుల త్యాగం వృథా కానివ్వమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

అమరుల త్యాగాలు వృథాకానివ్వం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. సంతోష్‌బాబు కుటుంబానికి పరామర్శ
సూర్యాపేట, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): సరిహద్దులో చైనాతో ఘర్షణల్లో వీర మరణం పొందిన మన సైనికుల త్యాగం వృథా కానివ్వమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్‌బాబు సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. సంతోష్‌బాబు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సరిహద్దులో ఇటీవల ఏ లక్ష్యం కోసమైతే భారత సైనికులు ప్రాణ త్యాగం చేశారో.. దానిని నెరవేర్చేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేస్తామన్నారు.
‘చైనా ఓపక్క సంప్రదింపులు చేస్తూనే దొంగదెబ్బ తీసింది. త్వరలోనే సమస్య పరిష్కారం కానుంది. 20 మంది సైనికుల బలిదానంతో దేశ ప్రజల్లో చైనా వ్యతిరేకత పెరిగింది. చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు’ అని కిషన్‌రెడ్డి అన్నారు. సంతోష్ బాబు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం, సైన్యం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అమర వీరులకు భారతీయులందరూ రుణపడి ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చెప్పిన విషయాలను సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు వివరించినట్లు తెలిపారు. ఆయనవెంట బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఉన్నారు.