కాంగ్రెస్ గెలిస్తే టీఆర్‌ఎస్‌లోకే
ABN , First Publish Date - 2020-10-31T09:23:01+05:30 IST
దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా తిరిగి టీఆర్‌ఎస్‌లోకి పోవాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

గులాబీ పార్టీది అధికార దుర్వినియోగం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
తుంగభద్ర పుష్కరాలు నిర్వహిస్తారా.. లేదా?: బండి సంజయ్
కాంగ్రెస్-టీఆర్‌ఎస్ రెండూ ఒక్కటే: లక్ష్మణ్
సిద్దిపేట టౌన్/గద్వాల/మెదక్ అర్బన్, అక్టోబరు 30: దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా తిరిగి టీఆర్‌ఎస్‌లోకి పోవాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలోనూ అబద్ధాలు ఆడుతోందని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని, ఆ పార్టీ నుంచి గెలిచిన వారంతా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ దొందు దొందే అని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన రావాలంటే టీఆర్‌ఎస్, ఎంఐఎంలకు బుద్ధి చెప్పాలని కోరారు. రేషన్ బియ్యంలో కేంద్రం రూ.31 నుంచి రూ.32 సబ్సిడీ ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది రూ.2 మాత్రమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటా ఉందని వీటిలో హౌసింగ్, పశుసంవర్ధక, పెన్షన్, తదితరాలు ఉన్నాయని పేర్కొన్నారు. దుబ్బాక ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీ అభ్యర్థి గెలవడం ఖాయమని కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో తుంగభద్ర పుష్కరాలు జరపాలనే సోయి సీఎం కేసీఆర్‌కు లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శుక్రవారం ఆయన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని ఐదో శక్తి పీఠం జోగులాంబను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫాంహౌస్‌లో, ప్రగతిభవన్‌లో సోయి లేకుండా ఉంటే సరిపోదని, తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చేతకాకుంటే చాలా మంది దాతలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారని సంజయ్ అన్నారు.
ఉప ఎన్నిక రావడంతో సీఎం కేసీఆర్ దుబ్బాకపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మెదక్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు అబద్ధాల కోరు అని, ఆయనను నమ్ముకుంటే మునిగిపోతారని హెచ్చరిం చారు. టీఆర్‌ఎస్ ఆటలకు త్వరలో కేంద్రం కళ్లెం వేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానిదేనని, కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. టీఆర్‌ఎస్-కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజల కోసం పనిచేయాలి కానీ ప్రభుత్వాల కోసం కాదని లక్ష్మణ్ అన్నారు. కాగా, మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రచార సరళిపై సమీక్ష జరిపారు.