మహబూబ్‌నగర్, కరీంనగర్ కలెక్టర్లకు యునిసెఫ్ ప్రశంస
ABN , First Publish Date - 2020-12-03T07:26:39+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, నీటి వసతి కల్పించి స్వచ్ఛ విద్యాలయాలుగా అభివృద్ధి చేసినందుకు, సామాజిక

హైదరాబాద్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, నీటి వసతి కల్పించి స్వచ్ఛ విద్యాలయాలుగా అభివృద్ధి చేసినందుకు, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టినందుకు మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్లు వెంకటరావు, శశాంకలను యునిసెఫ్ అభినందించింది. యునిసెఫ్, ఎన్‌ఐఆర్డీపీఆర్ ఆధ్వర్యంలో 7వ వాష్ కాన్‌క్లేవ్ ఆన్‌లైన్ సదస్సును బుధవారం నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా యునిసెఫ్ పరిధిలోని తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ కార్యక్రమాలు, మూడు రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను ఇందులో ప్రస్తావించారు.
తెలంగాణ నుంచి మహబూబ్‌నగర్, కరీంనగర్ కలెక్టర్లు వెంకటరావు, శశాంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా యునిసెఫ్ సీనియర్ వాష్ స్పెషలిస్ట్ సుజయ్ మజుందార్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలోని అన్ని పాఠశాలలకు నీటివసతి కల్పించడంతోపాటు మరుగుదొడ్లు నిర్మించి మహబూబ్‌నగర్ జిల్లా ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. సామాజిక మరుగుదొడ్ల నిర్మాణంపై కరీంనగర్ కలెక్టర్‌ను ప్రశంసించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వాష్ కాన్‌క్లేవ్ సంచికను ఆవిష్కరించారు. ఏపీలోని పలు జిల్లాలకు చెందిన కలెక్టర్లు సైతం వారు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. యునిసెఫ్ చీఫ్ ఆఫ్ వాష్ నికోలస్ పాల్గొన్నారు.