పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో..భూ సంస్కరణలపై 4న సెమినార్‌: వీహెచ్‌

ABN , First Publish Date - 2020-12-30T07:27:59+05:30 IST

పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జనవరి 4న భూ సంస్కరణలపై ఇందిరా భవన్‌లో సెమినార్‌ నిర్వహిస్తున్నామని కమిటీ గౌరవాధ్యక్షుడు వి. హన్మంతరావు వెల్లడించారు. గాంధీభవన్‌లో మంగళవారం

పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో..భూ సంస్కరణలపై 4న సెమినార్‌: వీహెచ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జనవరి 4న భూ సంస్కరణలపై ఇందిరా భవన్‌లో సెమినార్‌ నిర్వహిస్తున్నామని కమిటీ గౌరవాధ్యక్షుడు వి. హన్మంతరావు వెల్లడించారు. గాంధీభవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. భూ సంస్కరణలు అమలు చేయకుంటే పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతాడని, భూ సంస్కరణల అమలు ద్వారానే పేదరికం తొలగిపోతుందని చెప్పిన ఏకైక నేత పీవీ నర్సింహరావు అని కొనియాడారు. ఆయన ఆలోచనను దివంగత ప్రధాని ఇందిరా గాంధీ అమలు చేశారని, దాంతో పేదవాడు దున్నుకునేందుకు భూమి లభించిందన్నారు. అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలవుతున్నాయా లేదా? అన్న అంశంపై సెమినార్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు పీవీ భూ సంస్కరణలను అమలు చేశారని, దాంతో ఆయన పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చిందని వీహెచ్‌ గుర్తు చేశారు. కాగా, ఎల్‌ఆర్‌ఎ్‌సకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్పష్టత లేదని, క్రమబద్ధీకరణ అంశం అందులో ప్రస్తావించలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో స్పష్టత వచ్చే వరకూ పోరాడతామని చెప్పారు. అయితే ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన నేపథ్యంలో బుధవారం తాను తలపెట్టిన దీక్షను వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపారు.  

Updated Date - 2020-12-30T07:27:59+05:30 IST