యూకే నుంచి వచ్చిన మరో ఇద్దరికి..

ABN , First Publish Date - 2020-12-27T08:00:28+05:30 IST

యూకే నుంచి, యూకే మీదుగా రాష్ట్రానికి వచ్చినవారిలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ ఇద్దరూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాకు చెందినవారే.

యూకే నుంచి వచ్చిన మరో ఇద్దరికి..

రాష్ట్రంలో మొత్తం 18కి చేరిన పాజిటివ్‌లు

కాంటాక్ట్‌లలో మరో ముగ్గురికి వైరస్‌

1,216 మందిలో 184 మంది వివరాల్లేవ్‌


హైదరాబాద్‌, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): యూకే నుంచి, యూకే మీదుగా రాష్ట్రానికి వచ్చినవారిలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ ఇద్దరూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాకు చెందినవారే. దీంతో యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో శనివారం నాటికి మొత్తం 18 మందికి పాజిటివ్‌ వచ్చినట్లయింది. మరోవైపు ఈ నెల 9 నుంచి 1,216 మంది రాష్ట్రానికి వచ్చారు. వీరిలో 937 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించామని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు.


మొత్తం 18 మందిలో హైదరాబాద్‌ నుంచి నలుగురు, మేడ్చల్‌-మల్కాజిగిరి నుంచి ఆరుగురు, జగిత్యాల జిల్లాకు చెందినవారు ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల వారు ఒక్కొక్కరున్నారని వివరించారు. వీరిని వివిధ ఆసుపత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో ఉంచామన్నారు. ఈ 18 మంది సన్నిహితంగా ఉన్న మరో 79 మందిని గుర్తించి, క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. వీరిలో ముగ్గురికి పాజిటివ్‌గా తేలిందన్నారు. అందరి నమూనాలను జన్యు విశ్లేషణకు సీసీఎంబీకి పంపినట్లు  చెప్పారు. 


92 మందిపై ఇతర రాష్ట్రాలకు సమాచారం

కొత్త స్ట్రెయిన్‌ వ్యాప్తి రీత్యా.. యూకే నుంచి వచ్చినవారి విషయంలో ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌ విధానాన్ని కచ్చితంగా పాటిస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. యూకే నుంచి హైదరాబాద్‌ చేరినవారిలో 92 మంది ఇతర రాష్ట్రాల వారని, ఆయా రాష్ట్రాలకు సమాచారమిచ్చామని చెప్పారు. మరో 184 మందికి సంబంధించి సమగ్ర వివరాలు లేవన్నారు.

యూకే ప్రయాణ చరిత్ర ఉన్నవారు 040-24651119 నంబరుకు ఫోన్‌ చేసి వివరాలు అందించాలని లేదా 9154170960 నంబరుకు వాట్సాప్‌లో వివరాలివ్వాలని కోరారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు.


రాష్ట్రంలో 317 కొత్త కేసులు

రాష్ట్రంలో శుక్రవారం 317 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. 536 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. 30,376 మందికి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పింది. 6,618 యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపింది. 4,535 మంది హోం క్వారంటైన్‌/ఇన్‌స్టిట్యూషనల్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని వివరించింది. కాగా, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కరోనా నుంచి కోలుకున్నారు. శనివారం చేసిన పరీక్షలో ఆయనకు నెగెటివ్‌ వచ్చింది.


Updated Date - 2020-12-27T08:00:28+05:30 IST