మరో ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-04-12T09:19:07+05:30 IST

రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మర్కజ్‌కు వెళ్లివచ్చిన వ్యక్తి ద్వారా ఇతనికి

మరో ఇద్దరు మృతి

  • 14కు చేరిన కరోనా మరణాలు... 
  • ఆస్పత్రుల నుంచి 51 మంది డిశ్చార్జ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మర్కజ్‌కు వెళ్లివచ్చిన వ్యక్తి ద్వారా ఇతనికి వైరస్‌ సోకినట్లు అధికారులు చెప్పారు. సోమాజిగూడలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళను గాంధీకి తరలిస్తుండగా మరణించారు. దీంతో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 14కు పెరిగింది. ఇక, రాష్ట్రంలో కొత్తగా మరో 16 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 503కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, సూర్యాపేట జిల్లాలో తొలుత మూడు కేసులేనని వెల్లడించగా.. రాత్రి వరకూ 11 కేసులు నమోదైనట్లు ఆ జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు. ఇవి కూడా కలిపితే శనివారం నాటి పాజిటివ్‌ల సంఖ్య 24కు చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 393 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. శనివారం 51 మందిని డిశ్చార్జ్‌ చేశారు. జిల్లాల వారీగా వివరాల్లోకి వెళితే... ఆసిఫాబాద్‌ జిల్లాలో తొలిసారి ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. వీరికి పాజిటివ్‌ ఎలా వచ్చిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రెండు, నిజామాబాద్‌ జిల్లాలో రెండు, రంగారెడ్డి జిల్లాలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. మెదక్‌ జిల్లాలో 26 ఏళ్ల యువకుడికి పాజిటివ్‌ వచ్చింది. మర్కజ్‌ వెళ్లొచ్చిన సంగారెడ్డి వ్యక్తి ద్వారా ఇతడికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు.   వికారాబాద్‌, సిరిసిల్ల, కొత్తగూడెం, వనపర్తి, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో కొత్తగా కేసులేమీ నమోదు కాలేదు.


కరోనా ఆస్పత్రులివే..

రాష్ట్రంలో  కరోనాకు చికిత్స అందించే ఆస్పత్రుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. గాంధీ, కింగ్‌కోఠీ, గచ్చిబౌలి ఆస్పత్రి, బేగంటపేటలోని నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రి, నిజామియా జనరల్‌ ఆస్పత్రి, ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆస్పత్రి, హోమియో ఆస్పత్రితోపాటు వరంగల్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.


కరోనా లక్షణాలతో వృద్ధుడి మృతి

లంగర్‌హౌజ్‌: కొవిడ్‌ లక్షణాలతో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు శనివారం మృతి చెందాడు. షేక్‌పేట్‌కు చెందిన వృద్ధుడు(72) అమెరికా వెళ్లి, మార్చి 20న నగరానికి వచ్చాడు. అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయన కరోనాతో చనిపోయినట్లు అధికారికంగా ధ్రువీకరించలేదు. 


నిర్మల్‌కు ‘దేవబంద్‌’ లింకు

నిర్మల్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి పాజిటివ్‌ వచ్చిన ఇద్దరు వ్యక్తులు దేవబంద్‌లో జరిగిన జాతీయ మదర్సా కార్యక్రమానికి హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారంతో జిల్లా యంత్రాంగం వారిని గుర్తించింది. అదే మదర్సాకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి పది మంది వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిలో ఏడుగురు నిర్మల్‌ వాసులే కాగా.. మొత్తం ముగ్గురిని అధికారులు గుర్తించారు. వీరికి పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది.  ఉద్దేశపూర్వకంగా ప్రయాణ వివరాలు దాచి పెట్టినందుకు వీరిపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఇదే తరహాలో వికారాబాద్‌లోనూ నలుగురిపై కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-04-12T09:19:07+05:30 IST