ఇద్దరు వైద్యులకు కొవిడ్‌

ABN , First Publish Date - 2020-05-18T08:42:19+05:30 IST

రాష్ట్రంలో ఇద్దరు వైద్యులకు కరోనా సోకింది. కింగ్‌కోఠి ఆస్పత్రిలో పని చేసే ఈఎన్‌టీ వైద్యుడికి, గాంధీ ఆస్పత్రి క్యాజువాలిటీలో విధులు నిర్వర్తించే ఓ జూనియర్‌ డాక్టర్‌కు ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఇద్దరు వైద్యులకు కొవిడ్‌

  • ఒకరు గాంధీలో జూనియర్‌ డాక్టర్‌
  • మరొకరు కింగ్‌కోఠి ఆస్పత్రిలో డాక్టర్‌
  • ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కూ పాజిటివ్‌
  • బ్యాంకు మేనేజర్‌ ఇంట్లో14 మందికి..
  • రాష్ట్రంలో కొత్తగా 42.. మొత్తం 1551


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో ఇద్దరు వైద్యులకు కరోనా సోకింది. కింగ్‌కోఠి ఆస్పత్రిలో పని చేసే ఈఎన్‌టీ వైద్యుడికి, గాంధీ ఆస్పత్రి క్యాజువాలిటీలో విధులు నిర్వర్తించే ఓ జూనియర్‌ డాక్టర్‌కు ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయా ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్న క్రమంలోనే వీరికి వైరస్‌ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే, వీరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 42 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 1551కి పెరిగింది. చికిత్స అనంతరం కోలుకున్న 21 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం డిశ్చార్జిల సంఖ్య 992కు చేరుకోగా, ఇంకా 525 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 37 హైదరాబాద్‌ పరిధిలోనే ఉండగా, రంగారెడ్డిలో ఇద్దరికి, మరో ముగ్గురు వలస కార్మికులకు పాజిటివ్‌ అని తేలింది. కాగా, ఈ నెల 16వ తేదీ సాయంత్రం వరకూ రాష్ట్రవ్యాప్తంగా 23,388 పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఆ రోజు వరకూ మొత్తం 1513 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో పురుషులే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మొత్తంగా చూస్తే 947 మంది పురుషులు, 566 మంది మహిళలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వయస్సుల వారీగా చూస్తే 15 ఏళ్ల లోపున్న 218 మందికి, 16-30 ఏళ్ల మధ్య 434 మందికి, 31-45 ఏళ్ల మధ్య 406 మందికి, 46-60 ఏళ్ల మధ్య 301 మందికి వైరస్‌ సోకింది. 60ఏళ్ల పైబడిన వారిలో 151 మంది కరోనా బారినపడ్డారు. 


ఒకే కుటుంబంలో 14 మందికి..

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. జుమ్మెరాత్‌బజార్‌లోని జుంగూర్‌ బస్తీలో నివాసం ఉండే ఓ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌కు వైరస్‌ సోకగా, అతడి కుటుంబంలోని 14 మందికి తాజాగా పాజిటివ్‌ వచ్చింది. సదరు ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌ (60) కరోనాతో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. అలాగే, శివ్‌లాల్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగికి కరోనా రావడంతో అతని ద్వారా ఉద్యోగి రెండో కొడుకు, కొడుకు భార్య, మూడో కొడుకు భార్యకు వైరస్‌ సోకింది. ప్రముఖ ఎంఎన్‌సీలో పని చేస్తూ చెన్నారెడ్డినగర్‌లో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు కరోనా బారిన పడ్డారు. అశోక్‌నగర్‌లో ఇద్దరికి, ఓల్డ్‌మలక్‌పేట వాహేద్‌నగర్‌లో 30 ఏళ్ల యువకుడికి, రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని ఓం నగర్‌కు చెందిన వ్యక్తికి, భోలక్‌పూర్‌ డివిజన్‌లో గర్భిణి(28)కి పాజిటివ్‌ వచ్చింది.


మూడు జిల్లాల్లో వలస కేసులు 

జగిత్యాల జిల్లాలో వెల్గటూర్‌కు చెందిన వృద్ధుడు (69), పైడిపెల్లికి చెందిన వ్యక్తి(35), గొల్లపల్లి మండలానికి చెందిన మహిళ(40) ఇటీవల ముంబై నుంచి వచ్చారు. వారికి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించగా పాజిటివ్‌ అని తేలింది. అలాగే, యాదాద్రి జిల్లాకు చెందిన ఓ వలస కూలీకి పాజిటివ్‌ వచ్చింది.


అనారోగ్యంతో వలస కూలీ మృతి

మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన వలస కూలీ అనారోగ్యంతో మృతి చెందగా.. కరోనా అనుమానంతో అతడి మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావొద్దంటూ గ్రామస్థులు అడ్డుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన నిలుగొండ జంపయ్య (45), లక్ష్మి దంపతులు కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రకు వెళ్లారు. శనివారమే భార్యాభర్తలు స్వగ్రామానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం జంపయ్య అస్వస్థతకు గురికావడంతో మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కరోనాతో మృతి చెందాడేమోనని సందేహించిన గ్రామస్థులు.. మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావొద్దంటూ అడ్డుకున్నారు. చివరకు అధికారులు జోక్యం చేసుకుని ఊరి బయట ఖననం చేయించారు.

Updated Date - 2020-05-18T08:42:19+05:30 IST