మనస్తాపంతో కోడలు.. భయంతో మామ..

ABN , First Publish Date - 2020-08-20T09:24:34+05:30 IST

క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిల్చింది. మామ మందలించడంతో కోడలు ఆత్మహత్య చేసుకుంది.

మనస్తాపంతో కోడలు.. భయంతో మామ..

  • క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలి

మోటకొండూరు, ఆగస్టు 19: క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిల్చింది. మామ మందలించడంతో కోడలు ఆత్మహత్య చేసుకుంది. దాంతో భయపడిన మామ కూడా బలన్మరణానికి పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగింది. యాదగిరిగుట్ట సీఐ నర్సయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మోటకొండూరుకు చెందిన లూర్దు మర్లయ్య(52)కు ఇద్దరు కుమారులు. పెద్ద  కొడుకు జైసన్‌, పెద్దపల్లి జిల్లాకు చెందిన మానస(28) ప్రేమించుకున్నారు. 2016లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత.. చిన్న కొడుకు లివింగ్‌స్టన్‌ కూడా మానస చెల్లెలు రీచాతో ప్రేమలో పడ్డాడు. ఈ నెల 17న వారిద్దరూ వివాహం చేసుకున్నారు.


ఇద్దరు కుమారులు కూడా ప్రేమ వివాహాలు చేసుకోవడంతో మర్లయ్య ఆవేదన చెందాడు. ఈ క్రమంలో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. చిన్న కుమారుడి  ప్రేమ వివాహానికి కారణమంటూ పెద్ద కోడలు మానసను మర్లయ్య నిందించాడు. మనస్తాపం చెందిన ఆమె.. మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుంది. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. దీంతో భీతిల్లిన మర్లయ్య.. ఇంటికి సమీపంలోని పశువుల కొట్టం వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మర్లయ్య భార్య అనారోగ్యంతో ఆరు నెలల క్రితం మృతి చెందింది. 

Read more