కోవిడ్‌ కష్టాల నుంచి జర్నలిస్టులను రక్షించుకుంటాం

ABN , First Publish Date - 2020-09-06T21:59:30+05:30 IST

రాష్ట్రంలో కోవిడ్‌ మహమ్మారి ప్రభావంతో ఉద్యోగ, ప్రాణ భద్రత కరువై ఆందోళన చెందుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నందున, జర్నలిస్టులను రక్షించుకోవడానికి వివిధ రూపాల్లో పోరాటాలను ఉధృతం చేస్తామని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజె) వెల్లడించింది.

కోవిడ్‌ కష్టాల నుంచి జర్నలిస్టులను రక్షించుకుంటాం

హైదరాబాద్‌: రాష్ట్రంలో కోవిడ్‌ మహమ్మారి ప్రభావంతో ఉద్యోగ, ప్రాణ భద్రత కరువై ఆందోళన చెందుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నందున, జర్నలిస్టులను రక్షించుకోవడానికి వివిధ రూపాల్లో పోరాటాలను ఉధృతం చేస్తామని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజె) వెల్లడించింది. యూనియన్‌ అధ్యక్షుడు నగునూరి శేఖర్‌ అధ్యక్షతన ఆదివారం టీయూడబ్బ్యూజె కార్యవర్గ సమావేశం జూమ్‌యాప్‌ ద్వారా జరిగింది. ఆయా జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 35 మంది రాష్ట్ర సభ్యులు ఈసమావేశంలో పాల్గొన్నారు. కరోనా బారినపడి పలువురుజర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నా బాధిత కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సహించరానిదని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్‌అలీ తన నివేదికను సమర్పిస్తూ తాము సేకరించిన సమాచారం మేరకు ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఏడుగురు జర్నలిస్టులు, ముగ్గురు మీడియా సిబ్బంది కరోనా కాటుకు గురై ప్రాణాలు కోల్పోయినట్టు విచారం వ్యక్తం చేశారు. 


అలాగే సుమారు 900 మంది జర్నలిస్టులు, మీడియా సిబ్బంది 1500 మంది వారి కుటుంబ సభ్యులు కరోనా పాజిటివ్‌కు గురైనట్టు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారికి ఐసొలేషన్‌లో ఉన్నవారికి మాత్రమే మీడియా అకాడమీ ఆర్ధిక సాయాన్ని అందిస్తుంది తప్ప మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు ఇంత వరకూ ఎలాంటి ఆర్ధిక సాయం అందించక పోవడం విచారకరమని అన్నారు. కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు వైద్యసహకారం అందించడంతో పాటు తమ సంఘం అగ్రస్థానంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. అలాగే స్వచ్చంద సంస్థల సహకారంతో గడిచిన 6 నెలల వ్యవధిలో రాష్ట్రంలో 3వేల జర్నలిస్టు కుటుంబాలకు తమ సంఘం రేషన్‌సరుకుల కిట్లను అందించినట్టు విరాహత్‌అలీ తెలిపపారు. 


నగురూరి శేఖర్‌ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మీడియా అకాడమీ జర్నలిస్టు సంక్షేమ నిధి వడ్డీపై ఆధారపడి సహాయం చేయడం సరైంది కాదని , ఆ నిధి నుంచి మృతి చెందిన ప్రతి జర్నలిస్లు కుటుంబానికి 5లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన హెల్త్‌కార్డులు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో తిరస్కరణకు గురవుతున్నందున అనారోగ్యానికి గురై వైద్యం పొందలేక పోతున్నజర్నలిస్టులకు చౌక ప్రీమియంతో గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా చేయూతనిచ్చేందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీలతో చర్చించేందుకు సమావేశం నిర్ణయించింది. 

Updated Date - 2020-09-06T21:59:30+05:30 IST