తుంగభద్ర పుష్కరాలపై స్పష్టత కరువు!

ABN , First Publish Date - 2020-10-27T09:23:25+05:30 IST

తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర పుష్కరాలు

తుంగభద్ర పుష్కరాలపై స్పష్టత కరువు!

నిర్వహణ, ఏర్పాట్లపై సర్కారు మౌనం 

నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు పుష్కరాలు 


తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు దేవాదాయ శాఖ పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయమై ఒకట్రెండు రోజుల్లో  మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అధికారిక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి జరిగిన గోదావరి పుష్కరాల్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహించింది. ఇప్పుడు తుంగభద్రకు పుష్కరాలు రావడం తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొదటి సారి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోని అలంపూర్‌ నియోజకవర్గంలో తుంగభద్ర పుష్కరాలు నిర్వహిస్తారు. తెలంగాణలో తుంగభద్ర ప్రవహించే ఏకైక ప్రాంతం అలంపూర్‌ నియోజకవర్గం మాత్రమే. తుంగభద్ర నది పరివాహకంలోని జోగులాంబ శక్తిపీఠంతో పాటు మొత్తం 12 ఆలయాల ప్రాంతంలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. 


కరోనా కారణంగానే.. !

కరోనా కారణంగా గణేశ్‌, బోనాలు, బతుకమ్మ, దసరా ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేదు. ఇదే కారణంతో తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువర్చలేదు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా తుంగభద్ర పుష్కరాలు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. రూ. 100 కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించింది.

Updated Date - 2020-10-27T09:23:25+05:30 IST