శ్రీనివాసుడిపై నమ్మకం లేకుంటే తిరుమలను వీడాలి

ABN , First Publish Date - 2020-09-21T07:17:20+05:30 IST

తిరుమల శ్రీనివాసుడిపై నమ్మకం లేకపోతే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమలను వీడాలని సమాచార హక్కు మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌

శ్రీనివాసుడిపై నమ్మకం లేకుంటే తిరుమలను వీడాలి

టీటీడీ చైర్మన్‌ వైవీకి మాడభూషి లేఖ


తిరుమల శ్రీనివాసుడిపై నమ్మకం లేకపోతే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమలను వీడాలని సమాచార హక్కు మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ సూచించారు. ఈ మేరకు ఆయన వైవీకి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. తిరుమల దర్శనానికి వచ్చే అన్య మతస్తులు ఎటువంటి డిక్లరేషన్‌/సంతకం పెట్టాల్సిన అవసరం లేదని వైవీ అనడం అసంబద్ధమేనన్నారు. ‘‘మీ వైఖరి తిరుమల దేవస్థాన సాంప్రదాయాలు, పద్ధతులపై అవగాహన లేకపోవడాన్ని తెలియజేస్తుంది. స్వామివారిపై మీకు నమ్మకం ఉందా? లేదా? ముందు ఆ విషయాన్ని ప్రకటించండి.


అనవసరంగా గందరగోళం సృష్టించారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్‌ అవసరమని తెలుసుకుని, ఆ పుస్తకం తెచ్చే వరకు వేచి ఉండి, సంతకం చేసిన తర్వాతే దైవ దర్శనం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా పని చేసిన నిసార్‌ అహ్మద్‌ కక్రూ కూడా డిక్లరేషన్‌, సాంప్రదాయాలు తెలుసుకుని.. దైవ దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ-మెయిల్‌ ఐడీ పొందుపర్చకపోవడం.. పరిపాలన పారదర్శకతకు, సమాచార హక్కు చట్టానికి, ట్రస్టీషి్‌పనకు విరుద్ధం’’ అని ఆ లేఖలో శ్రీధర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-21T07:17:20+05:30 IST