టీఎస్‌పీఎస్సీ ఖాళీ!

ABN , First Publish Date - 2020-12-11T08:08:31+05:30 IST

ప్రభుత్వ కొలువులను భర్తీ చేసే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎ్‌సపీఎస్సీ) మరికొద్ది రోజుల్లోనే ఖాళీ అవుతోంది.

టీఎస్‌పీఎస్సీ ఖాళీ!

17తో ముగుస్తున్న చైర్మన్‌ పదవీకాలం

ఆయనతోపాటు ముగ్గురు సభ్యులు కూడా

కమిషన్‌లో మిగిలేది ఇద్దరే సభ్యులు

పాతవారిని కొనసాగించే అవకాశం లేదు

చైర్మన్‌ రేసులో ప్రస్తుత సభ్యుడు విఠల్‌!


హైదరాబాద్‌, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కొలువులను భర్తీ చేసే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎ్‌సపీఎస్సీ) మరికొద్ది రోజుల్లోనే ఖాళీ అవుతోంది. టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణితోపాటు సభ్యులు విఠల్‌, చంద్రావతి, మతీనుద్దీన్‌ ఖాద్రీల పదవీకాలం 17న ముగుస్తోంది. వీరి స్థానంలో ప్రభుత్వం ఎవర్ని నియమిస్తుందనే దానిపై చర్చజరుగుతోంది. ప్రస్తుతం ఒక చైర్మన్‌, ఐదుగురు సభ్యులున్నారు. అందులో నలుగురి పదవీకాలం పూర్తవుతుడటంతో.. ఇక కృష్ణారెడ్డి, ప్రొఫెసర్‌ సాయిలు సభ్యులుగా ఉంటారు. అందులో కృష్ణారెడ్డి పదవీ కాలం మార్చి 2021లో, మరొక సభ్యుడు సాయిలుది అక్టోబరులో ముగుస్తుడటం గమనార్హం. దీంతో టీఎ్‌సపీఎస్సీ చట్టంలోని రెగ్యులేషన్‌ 3(1) ప్రకారం గరిష్ఠంగా 10 మంది సభ్యులతో పాటు ఒక చైర్మన్‌ ఉండాల్సిన కమిషన్‌కు ఇద్దరు సభ్యులే మిగులుతున్నారు. సర్వీస్‌ కమిషన్‌ విధులు నిర్వర్తించాలంటే ఒక చైర్మన్‌తో పాటు కనీసం ఐదుగురు సభ్యులుండాలి. టీఎ్‌సపీఎస్సీకి ఇప్పటికే చైర్మన్‌, సభ్యుల పేర్లను గవర్నర్‌కు ప్రతిపాదించాల్సిన ప్రభుత్వం.. ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టనట్లు తెలుస్తోంది. 


పొడిగింపునకు నో చాన్స్‌!

 ఆర్టికల్‌ 316 ప్రకారం ప్రభుత్వ కొలువులు భర్తీ చేసేందుకు ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉంటుంది. అందులో ఒక చైర్మన్‌తో పాటు సభ్యులుంటారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను పరిశీలించిన తర్వాత గవర్నర్‌వారిని నియమిస్తారు. వారు ఆరేళ్లు లేదా 62 ఏళ్ల వయసు వచ్చేవరకు పదవీలో కొనసాగుతారు. ఒకసారి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తికి.. మరోసారి అదే పదవీలో కొనసాగే అవకాశం లేదు. సభ్యులకూ ఇదే నిబంధన వర్తిస్తుంది. కానీ సభ్యులనుమాత్రం చైర్మన్‌గా నియమించవచ్చు. ఈ నిబంధనతో ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న ఘంటా చక్రపాణి చైర్మన్‌గా విఠల్‌, చంద్రావతి, మతీనుద్దీన్‌ ఖాద్రీ సభ్యులుగా కొనసాగే అవకాశం లేదు. అయితే, ప్రస్తుత సభ్యులకు చైర్మన్‌ అయ్యే అవకాశం ఉండటంతో.. విఠల్‌ చైర్మన్‌ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.


కనీసం ఐదురుగు!

  రాజ్యాంగంలోని 316 (1), (2) ప్రకారం సీనియర్‌ ఐఏఎ్‌స/ఐపీఎస్‌ అధికారిని చైర్మన్‌గా నియమించే అధికారం గవర్నర్‌కు ఉంది. అంతేకాదు, కొత్త చైర్మన్‌ నియామకం జరిగే వరకు సభ్యుల్లోని ఒకరిని తాత్కాలిక చైర్మన్‌గా నియమించే అధికారం కూడా ఉంది. రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తులను టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌, సభ్యులుగా నియమించవద్దని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. సభ్యుల్లోని సగం మంది రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులుగా వివిధ విభాగాల్లో కనీసం పదేళ్లు పనిచేసినవారై ఉండాలి. మిగతా సగం మంది విద్యావేత్తలై ఉండాలి. 


Updated Date - 2020-12-11T08:08:31+05:30 IST