సంస్కరణల టీఎస్‌పీఎస్సీ

ABN , First Publish Date - 2020-12-17T08:24:13+05:30 IST

పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దేశంలో ఎక్కడాలేనివిధంగా గత ఆరేళ్లలో వినూత్న సాంకేతిక సంస్కరణలు తీసుకువచ్చినట్లు టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌

సంస్కరణల టీఎస్‌పీఎస్సీ

 నియామకాల్లో అత్యాధునిక సాంకేతికత వినియోగం..

ఆరేళ్లలో 45 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షలు

పారదర్శకంగా 35,724 పోస్టుల భర్తీ

చైర్మన్‌గా పదవీ విరమణ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో ఘంటా చక్రపాణి


హైదరాబాద్‌, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దేశంలో ఎక్కడాలేనివిధంగా గత ఆరేళ్లలో వినూత్న సాంకేతిక సంస్కరణలు తీసుకువచ్చినట్లు టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి నియామకప్రక్రియను సులభతరం చేశామని పేర్కొన్నారు. తక్కువ ఉద్యోగాలను భర్తీ చేశామన్నది పక్కనబెడితే పారదర్శకంగా నియామకాలు చేపట్టామనే సంతృప్తి తమకు ఉందన్నారు. ఆరేళ్లలో 108 నోటిఫికేషన్లు జారీశామని, 45 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు.


ఇప్పటివరకు 35,724 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు.  రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త గ్రూప్‌-1నోటిపికేషన్‌ వెలువడకపోవడం బాధాకరమన్నారు.  50 వేల పోస్టులను భర్తీ చేయాలంటూ సీఎం కేసీఆర్‌ ఆదేశాలివ్వడం శుభపరిణామన్నారు. టీఎ్‌సపీఎస్సీ ఆరేళ్ల ప్రస్థానంపై గురువారం చైర్మన్‌గా పదవీవిరమణ చేయనున్న సందర్భంగా  ‘ఆంధ్రజ్యోతి’తో చక్రపాణి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటాల్లోనే..


మొదట్లో ఎన్నో సవాళ్లు!

రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియామకాల పరంగా విశ్వసనీయ వ్యవస్థ ఉండాలని నాకు సీఎం కేసీఆర్‌  చెప్పారు. పారదర్శకంగా కొలువులను భర్తీ చేస్తున్నారనే నమ్మకం నిరుద్యోగుల్లో కలిగిస్తే, టీఎ్‌సపీఎస్సీ విజయం సాధించనట్లేనని అన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా.. అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. మొదటగా తెలంగాణ సంస్కృతికఇ పెద్దపీట వేస్తూ కొత్త సిలబ్‌సను రూపొందించాం. 18 మంది విద్యావేత్తలతో కమిటీ వేశాం. ప్రొఫెసర్‌ హరగోపాల్‌, కోదండరాం, చుక్కా రామయ్య అందులో ఉన్నారు. క్లర్క్‌ ఉద్యోగం నుంచి గ్రూప్‌-1 వరకు పరీక్షల సిలబ్‌సను రూపొందించాం.  టీఎ్‌సపీఎస్సీ తన ఆరేళ్ల ప్రస్థానంలో దేశంలోని ఇతర కమిషన్లకు ఆదర్శంగా నిలిచింది. 


ఓటీఆర్‌లో 25 లక్షల అభ్యర్థుల నమోదు

టీఎ్‌సపీఎస్సీ చరిత్రలో వన్‌టైం రిజిస్ట్రేషన్‌(ఓటీఆర్‌) అద్భుత ఆవిష్కరణ. ఇప్పటివరకు 25 లక్షల మంది అభ్యర్థులు వివరాలు నమోదుచేసుకున్నారు. నోటిఫికేషన్‌ వివరాలను అభ్యర్థుల ఫోన్‌నంబర్లకు పంపించే సౌకర్యం ఏర్పాటు చేశాం. దేశంలో డిజిటల్‌ పేమెంట్‌ మొదటిసారిగా తీసుకొచ్చింది టీఎ్‌సపీఎస్సే. పరీక్షల అనంతరం ప్రశ్నాపత్రాల ‘కీ’ లను ప్రకటిస్తున్నాం. ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఫీజు చెల్లింపు, హాల్‌టికెట్ల జారీ, పరీక్షల నిర్వహణ.. సేవలన్నీ ఆన్‌లైన్‌ చేశాం. 


ఏ ఒక్కరూ పైరవీ చేయలేదు

నియామకాల్లో పైరవీలున్నప్పుడే అవినీతికి ఆస్కారం ఉంటుంది. టీఎ్‌సపీఎస్సీ వైపు వెళ్లొద్దని, చైర్మన్‌, సభ్యులను కలవొద్దని అధికారులు, రాజకీయాలకు సీఎం కేసీఆర్‌ స్పష్టంగా ఆదేశాలిచ్చారు. దీంతో గత ఆరేళ్లలో ఒక్క రాజకీయనాయకుడు పైరవీ చేయలేదు. పారదర్శకత కోసం సీఎం కేసీఆర్‌ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఉమ్మడి కృషి వల్లే ఈ ఆరేళ్లలో టీఎ్‌సపీఎస్సీ విజయవంతంగా నియామకాలు చేపట్టింది.


మెరిట్‌లిస్టే వల్లే అక్రమాలు బయటకు!

మేం పారామెడికల్‌ పోస్టుల మెరిట్‌లిస్ట్‌ ప్రకటించడం వల్లే వైద్య ఆరోగ్యశాఖ చేసిన అక్రమాలు బయటకు వచ్చాయి. వెయిటేజీ మార్కుల్లో తప్పులు దొర్లాయని, ఆ సందేహాలను నివృత్తి చేయాలని వైద్యఆరోగ్యశాఖకు జాబితాను పంపించాం. లేకపోతే 4వేల పారామెడికల్‌ పోస్టుల భర్తీని ఇప్పటికే చేపట్టేవాళ్లం.


త్వరలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-3 నోటిఫికేషన్లు

టీఎ్‌సపీఎస్సీ నుంచి గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ వెలువడకపోవడం బాధాకరం. 2011లో 150మందిని భర్తీ చేశాం. కొత్త నోటిఫికేషన్‌ మాత్రం రాలేదు. తాజాగా సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో.. త్వరలోనే గ్రూప్‌-1 నోటిపికేషన్‌ రానుంది. హైదరాబాద్‌లో ఉన్న వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి.


కోర్టు కేసుల వల్లే జాప్యం

కోర్టు కేసుల వల్లే ఉద్యోగాల నియామక ప్రక్రియలో జాప్యం జరిగింది. టీఎ్‌సపీఎస్సీలో సిబ్బంది కొరతకూడా ఉంది. మొత్తం 100 మంది ఉంటే అందులో 30 మంది అటెండర్లే. ప్రస్తుతం నేను ప్రొఫెసర్‌గా సెలవులో ఉన్నా. పదవీవిరమణ తర్వాత ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తా.


నేటితో పదవీకాలం పూర్తి 

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎ్‌సపీఎస్సీ) చైర్మన్‌ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్‌, బి.చంద్రావతి, మతీనుద్దీన్‌ ఖాద్రీ పదవీకాలం గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్‌, సభ్యులను ప్రభుత్వం ఎంపికచేసి.. జాబితాను గవర్నర్‌కు పంపనుంది. త్వరలోనే కొత్త కమిషన్‌ కొలువుదీరే అవకాశాలున్నాయి. 


100 నోటిఫికేషన్లు.. 1000కిపైగా పిటిషన్లు!

టీఎ్‌సపీఎస్సీ ఇప్పటివరకు 108 నోటిఫికేషన్లు జారీచేసింది. అందులో 100 నోటిఫికేషన్లపై దాదాపు 1000కిపైగా పిటిషన్లను కోర్టులో దాఖలు చేశారు. ప్రస్తుతం గురుకుల ప్రిన్సిపల్‌, పీఈటీ పోస్టుల రెండు నోటిఫికేషన్లకు చెందిన 919 పోస్టులే కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. వివాదమున్నప్పుడు ఫలితాలను ప్రకటించడం   సబబుకాదు. ఇప్పటివరకు టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్లను కోర్టు తప్పుబట్టలేదు. 

Updated Date - 2020-12-17T08:24:13+05:30 IST